బౌలింగ్‌ చేయకపోతే  హార్దిక్‌పై వేటు

బౌలింగ్‌ చేయకపోతే  హార్దిక్‌పై వేటు


న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌‌ టూర్‌‌కు  టీమిండియా స్టార్​ఆల్‌‌రౌండర్​ హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయకపోవడాన్ని మాజీ నేషనల్‌‌సెలెక్టర్ శరణ్​ దీప్‌‌ సింగ్‌‌ సమర్థించాడు. ఒకవేళ తన కోటా ఓవర్లు వేయలేకపోతే  షార్ట్‌‌ ఫార్మాట్‌‌లోనూ హార్దిక్‌‌ చోటు కోల్పోతాడని చెప్పాడు. 2019లో బ్యాక్‌‌ సర్జరీ చేయించుకుని రీఎంట్రీ ఇచ్చిన తర్వాత పాండ్యా  రెగ్యులర్​గా బౌలింగ్‌‌  చేయడం లేదు. దాంతో యూకే టూర్​కు వెళ్లిన టెస్టు టీమ్‌‌లో అతనికి ప్లేస్‌‌ దక్కలేదు.  ‘టెస్టు టీమ్‌‌ నుంచి హార్దిక్‌‌ను తప్పించాలన్న సెలెక్టర్ల నిర్ణయం సమంజసమే. సర్జరీ తర్వాత అతను రెగ్యులర్​గా బౌలింగ్‌‌ చేయడం లేదు. వన్డేల్లో పది ఓవర్లు, టీ20ల్లో నాలుగు ఓవర్లు వేయలేకపోతే షార్ట్‌‌ ఫార్మాట్స్‌‌ ఫైనల్‌‌ ఎలెవన్‌‌లో కూడా తనకు చోటు ఉండదని నేను భావిస్తున్నా. ఓ బ్యాట్స్‌‌మన్‌‌గా మాత్రమే పాండ్యా  అవసరం లేదు. తను బౌలింగ్‌‌ చేయలేకపోతే టీమ్‌‌ బ్యాలెన్స్‌‌ దారుణంగా దెబ్బతింటుంది. ఎక్స్‌‌ట్రా బౌలర్​ను తీసుకోవాల్సి వస్తే సూర్యకుమార్​ లాంటి బ్యాట్స్‌‌మన్‌‌ను పక్కనబెట్టాల్సి ఉంటుంది.  మనం కేవలం ఐదుగురు బౌలర్లతోనే ఆడితే ఫలితం ఉండదని ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌‌ల్లో చూశాం. అయితే మన దగ్గర ఇతర ఆల్‌‌రౌండర్లు చాలా మందే ఉన్నారు.  వాషింగ్టన్‌‌ సుందర్, అక్షర్​ పటేల్‌‌తో పాటు జడేజా కూడా తిరిగొచ్చాడు. తాను ఆల్‌‌రౌండర్​గా కూడా పని కొస్తానని  శార్దుల్‌‌ ఠాకూర్ చూపెట్టాడు. ఒకవేళ హార్దిక్‌‌ బౌలింగ్‌‌ చేయలేకపోతే వీళ్లతో అతని ప్లేస్‌‌ను భర్తీ చేయొచ్చు’ అని శరణ్ దీప్‌‌ చెప్పుకొచ్చాడు.