సక్సెస్ : శశికళ ది కుక్

సక్సెస్ : శశికళ ది కుక్

ఉదయ్​పూర్​కి చెందిన శశికళ సనధ్యకు 60 ఏండ్లు. ఆమె ఒకప్పుడు ఇంటి నుంచి కాలు బయటపెట్టని గృహిణి. కానీ ఇప్పుడు... భారతీయ వంటకాలను ఎలా వండాలో విదేశీ టూరిస్ట్​లకు నేర్పిస్తోంది. ఇటలీ, రష్యా, ఐర్లాండ్​, స్విట్జర్లాండ్​, పోలండ్​లకు చెందిన టూరిస్ట్​లు ఎందరో ఇండియన్​ వంటకాలు నేర్చుకున్నారు. విదేశాల నుంచి వచ్చి మరీ ఈమె దగ్గర వంట నేర్చుకుంటున్నారంటే స్పెషాలిటీ ఏంటి అనిపిస్తోందా! అయితే ఈ స్టోరీ చదవండి.

రాజస్తాన్​లోని ఉదయ్​పూర్​లో పుట్టి పెరిగింది శశికళ సనధ్య. ఇప్పుడామెకు 60 ఏండ్లు. పందొమ్మిదేండ్ల వయసులో హోటల్​లో​ మేనేజర్​గా పనిచేస్తున్న అతనికి ఇచ్చి పెండ్లి చేశారు. దాంతో ఉదయ్​పూర్​ నుంచి నథ్​ద్వారా సమీపంలో ఉన్న  ఓడా అనే చిన్న గ్రామంలో ఉన్న అత్తారింటికి వెళ్లిపోయింది. అప్పటివరకు పుట్టింట్లో మేవారి భాష మాట్లాడేవాళ్లు. అత్తగారింటికి వెళ్లాక హిందీలో మాట్లాడేందుకు చాలా ఇబ్బందిపడింది. అలా నెట్టుకొస్తున్న సంసారంలో ఒక్కసారిగా కుదుపు చోటుచేసుకుంది. ఆమె భర్త 2001లో చనిపోయాడు. బ్రాహ్మణ కుటుంబం కావడంతో వాళ్ల ఆచారాలను బట్టి భర్త మరణం తరువాత 45 రోజులు ఒక గదిలో మూలకు పరిమితమైపోయింది. వేరే మనిషితో మాట్లాడలేదు. ఆ కుటుంబాల్లో భర్తపోయిన ఆడవాళ్లు మరో పెళ్లి చేసుకోకూడదు. కొన్ని రంగుల చీరలు కట్టుకోకూడదు. ఇలా ఎన్నో ఆంక్షల నుంచి విదేశీ టూరిస్ట్​లకు వంట పాఠాలు నేర్పే స్థాయికి చేరుకుంది. ఆ జర్నీ గురించి ఆమె మాటల్లోనే...


‘‘పనిమీద బయటకు వెళ్లిన మా ఆయన ఒక రోజు రాత్రి ఎంత టైం అయినా ఇంటికి రాకపోవడంతో కంగారుగా అనిపించింది. ఆయనకోసం ఎదురుచూస్తున్న నాకు చాలా సేపటి తరువాత ఆయన నుంచి ఫోన్​ కాల్​ వచ్చింది. ‘నేను రేపు ఉదయం వస్తా.  మినపప్పు పరాఠా చేసి ఉంచు’ అని చెప్పాడు. దాంతో  అందుకు అవసరమైన ఫిల్లింగ్​ తయారుచేసి, పిండి రెడీ చేశా. కానీ మరుసటి రోజు ఉదయం వచ్చిన ఫోన్​ కాల్​ నా జీవితాన్నే మార్చేసింది. ‘మీ ఆయన చనిపోయాడు’ అని ఫోన్​ చేశారు వాళ్లు. డబ్బుకు సంబంధించిన గొడవల్లో మా ఆయన్ని చంపేశారు. ఆయన్ని కోల్పోవడంతో జీవితం మీద ఆశ పోయింది. కానీ కళ్ల ఎదురుగా నా ఇద్దరు కొడుకులు కనిపించారు. ఆయన చనిపోయేటప్పటికి మా పిల్లల్లో ఒకరికి ఐదు, మరొకరికి ఏడేండ్ల వయసు. మా ఆయన 2001లో చనిపోయాడు.

ఎవ్వరి సాయం లేక...

తండ్రి లేడు కాబట్టి ఇంటి బాధ్యతలను కొడుక్కి కట్టబెట్టాలి. అందుకు మా సంప్రదాయం ప్రకారం పగిడీ దస్తూర్​(తండ్రి పగిడీని పెద్ద కొడుకు తల మీద పెడతారు) అనే కార్యక్రమం చేస్తాం. దానికోసం కూడా డబ్బులు లేని పరిస్థితి. రోటీ, ఉప్పు, పచ్చిమిర్చి తిని బతికిన రోజులు ఉన్నాయి. అంత కష్టంలో ఉంటే పుట్టింటి వాళ్లు లేదా అత్తింటి వాళ్లు ఆదుకోలేదా అనిపిస్తుంది. మా తండ్రి ఇంటి నుంచి కానీ అత్తమామల దగ్గర నుంచి కానీ మాకు ఎటువంటి సపోర్టు లేదు. తినడానికే లేనప్పుడు పిల్లల్ని ఇంగ్లిష్​ మీడియం స్కూల్లో ఏం చదివిస్తా? అందుకే వాళ్లను ఆ బడి మానిపించి గవర్నమెంట్​ స్కూల్లో చేర్చా. ఇంటి అవసరాలు తీరడం కోసం ఉదయ్​పూర్​కి వచ్చే టూరిస్టుల బట్టలు ఉతికేదాన్ని. గిన్నెలు కడిగేదాన్ని. అలా 2008 వరకు చేస్తూనే ఉన్నా. ఆ టైంలో ఇండియన్ ఫుడ్​ మీద బాగా ఇష్టం ఉన్న ఐర్లాండ్​ టూరిస్ట్​ ఒకర్ని మా అబ్బాయి మా ఇంటికి తీసుకొచ్చాడు.

అతనికి వండి పెట్టేందుకు ఇంట్లో సరుకులు లేవు. కానీ అప్పటికప్పుడు తెచ్చే అవకాశం కూడా లేదు. అందుకని ఇంట్లో ఉన్న వాటితో రోటీ, సబ్జీ చేసి పెట్టా. అవి తిన్న అతను ‘చాలా టేస్టీగా ఉన్నాయ’ని చెప్పి వెళ్లిపోయాడు. అతను ఉదయ్​పూర్​లో ఐదు రోజులు ఉన్నాడు. ఉన్నన్ని రోజులు మా ఇంటికి వచ్చి తిని వెళ్లేవాడు. నేను రకరకాల కూరగాయల వంటకాలు చేసి పెట్టేదాన్ని. అవన్నీ అతనికి చాలా బాగా నచ్చి ఆ వంటలు ఎలా చేస్తారో నేర్చుకుంటా అన్నాడు. అలా నా కుకింగ్​ క్లాసులకి అంకురం పడింది.

ఇంగ్లిష్​ వింగ్లిష్​

ప్రొఫెషనల్​ కుకింగ్​ నేర్పించేంత కిచెన్​ మా ఇంట్లో లేదు. చిన్న చెక్క బల్ల ఉందంతే. దానిమీదే మొదలుపెట్టా. మా మొదటి అతిథి ఆస్ట్రేలియా నుంచి వచ్చిన జంట. వాళ్లకి వంట నేర్పించాలంటే నాకు చాలా నెర్వస్​గా అనిపించింది. భయంతో నా చేతులు వణికాయి. చెమటలు పట్టాయి. ఆ కంగారులో ఒక టీ కప్పు కూడా పగలగొట్టా. కానీ వాళ్లు మాత్రం నన్ను బాగా ఎంకరేజ్​ చేశారు. టీ, పకోడీ, నాన్​ చట్నీ, పొటాలో పరాటా, పులావ్​ చేయడం నేర్పించా వాళ్లకు. ఆ తరువాత ఫ్రెంచ్​ టూరిస్ట్​లు వచ్చారు. వాళ్లకు ఇంగ్లిష్​  రాదు. నాకు ఫ్రెంచ్​ రాదు. వాళ్లు, నేను ఒకరి ముఖం ఒకరం చూసుకునేవాళ్లం. వాళ్లు దేఖో(ఫ్రెంచ్​లో డి ఎకార్డ్​ )అంటే ‘ఓకే’ అని అర్థం. హిందీలో దేఖో అంటే చూడు అని అర్థం. కొన్ని సందర్భాల్లో ఏం చేయాలో అర్థంకాక నేను వాళ్లని  స్టేర్​ చేసి చూసేదాన్ని. దాంతో అందరూ పెద్దగా నవ్వే వాళ్లు. అలా భాషకి సంబంధించిన అంశాలను పక్కనపెడితే వాళ్లు నన్ను బాగా ఇష్టపడేవాళ్లు.

వాళ్ల భాష నాకు నేర్పించేందుకు ట్రై చేసేవాళ్లు. ఇలా క్లాసులు తీసుకునే ముందు వరకు రాజస్తానీ మాత్రమే మాట్లాడేదాన్ని. ఇప్పుడు ఇంగ్లిష్​తో పాటు కొన్ని విదేశీ భాషలు కూడా మాట్లాడగలుగుతున్నా. ఫారిన్​ టూరిస్ట్​ల భాష నాకు రాకపోతే వాళ్లకు వంటలు నేర్పించలేను కదా! ఉదాహరణకి ఆటాను ఇంగ్లిష్​లో ‘హోల్​ వీట్​ ఫ్లోర్​’ అంటారని తెలియాలి. లేదంటే వాళ్లకి నేనేం చెప్పగలను. అలాగే ఫ్రెంచ్​లో ‘ఫెరిన్​ డె బ్లే ఎంటైర్’ అంటారు. వాళ్లకు నేర్పించేటప్పుడు తెలుసుకున్న పదాలను రాసుకునేందుకు ఒక డైరీ పెట్టుకున్నా. అందులో ఆ పదాలను హిందీలో రాసుకుంటా. నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్​ని చూశాక నాకు ఇంగ్లిష్​ నేర్చుకోవడం అవసరం అనిపించింది. అలాగే వంటల్లో వాడే మసాలాలను ఇంగ్లిష్​, ఇటాలియన్, స్పానిష్​, ఫ్రెంచ్​లలో చెప్పగలుగుతున్నా. 

సక్సెస్​ రెసిపీ

లోకల్​ గైడ్స్​, టూర్​ ఆపరేటర్స్​, బ్లాగర్స్​ ద్వారా ఇండియన్​ కుజిన్​ మీద ఆసక్తి ఉన్న విదేశీ టూరిస్టులు అంబా మాతాలో ఉన్న మా ఇంటికి వస్తారు. 2008 నుంచి ఇప్పటివరకు దాదాపు ఐదువేల మంది విజిటర్స్​కు13 రకాల ఇండియన్​ వంటలు ఎలా చేయాలో నేర్పించా. ఇప్పటివరకు 30కి పైగా దేశాల వాళ్లు నేర్చుకున్నారు. మొదట వాళ్లకు మసాలా చాయ్​ ఎలా చేయాలో నేర్పిస్తా. ఆ తరువాత కొత్తిమీర, డ్రె మ్యాంగో చట్నీ, పనీర్, ఆలు​ పకోడీలు, మిక్స్​డ్​ వెజిటబుల్, పప్పు, ఆలు గోబీ, పనీర్​ బటర్​ మసాలా, చపాతీ, రాజస్తానీ ట్రెడిషనల్​ సబ్జీ (గట్టెకి సబ్జీ) నేర్పిస్తా. దీన్ని శెనగపిండితో తయారుచేస్తారు. టూరిస్ట్​ల ప్రిఫరెన్స్​ బట్టి కాయగూరలు వండడం కూడా నేర్పిస్తా.

వంటల తయారీ గురించి చెప్పడం మొదలుపెట్టినప్పుడు పుస్తకంలో తయారీ రాసి  వండమనేదాన్ని. రాయడంలో మా అబ్బాయి సాయం తీసుకునేదాన్ని. ఆ తరువాత కమ్యూనికేషన్​ పెరిగి నేనే చెప్తున్నా. ఇక్కడ నేర్చుకున్న వాటిని వాళ్ల దేశం వెళ్లాక ఎలా  ప్రిపేర్​ చేసుకోవాలో కూడా చెప్తా. వంటలో వాడే పదార్థాల మోతాదును వాళ్లకు చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఎందుకంటే మనం తినే ఉప్పు, కారాలకు వాళ్లు తినే వాటికి తేడా ఉంటుంది కదా అందుకే. విదేశీయులు మన టీ, పకోడి, చపాతీ, కాయగూరలు​, బటర్​ పనీర్​, గింజధాన్యాల​ వంటివి బాగా ఇష్టపడతారు. 

వంట ఒక్కటే కాదు...

టూరిస్ట్​ సీజన్​లో కుకింగ్​ క్లాసులు ఫుల్​గా బుక్​ అయిపోతాయి. ఒక్కొక్కరికి 1500 రూపాయల ఫీజు తీసుకుంటా. ఐదు గంటలు వంట పాఠాలు చెప్తా. సంపాదన ఒక్కటే కాకుండా మన దేశానికి వచ్చిన అతిథులను బాగా చూసుకోవడం కూడా ముఖ్యం. అందుకే వాళ్లు సంతోషంగా వెళ్లేలా చూసుకుంటా. కొన్ని సందర్భాల్లో వాళ్లు ప్రేమతో నాకు అదనంగా డబ్బు ఇస్తుంటారు. నేను వాళ్ల చేతులకి అందంగా హెన్నా పెడతా. చీరకట్టుకోవడంలో, బ్యాంగిల్స్​ వేసుకోవడంలో, బొట్టు పెట్టుకోవడంలో సాయం చేస్తా. సింధూరం పెడతా. ఇండియన్​ కల్చర్​ తెలుసుకోవడం వాళ్లకు చాలా ఇష్టంగా ఉంటుంది. దేవుళ్లు, దేవతల కథలు చెప్పమని కొందరు అడుగుతుంటారు. తులసి మొక్క ప్రత్యేకత అడిగి తెలుసుకుంటారు. ఇక్కడకు వచ్చినప్పుడు వాళ్ల పుట్టినరోజులు ఉంటే అందరం కలిసి వేడుక చేసుకుంటాం. నన్ను ‘ఆంటీ’ అని వాళ్ల భాషలో పిలుస్తారు.

ఫారిన్​ టూరిస్ట్​లకు వంట నేర్పించడం వల్ల నాకు కొత్త శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది. మిమ్మల్ని మీరు నమ్ముకుంటే ఎవరూ మిమ్మల్ని ఓడించలేరు. కష్టపడి పనిచేయాలి. ఇతరుల ముందు ఏడవడం వల్ల లాభం లేదు. మీలో శక్తి నింపుకుని ముందుకు కదలాలి. అదే జీవితంలో విజయాన్ని తెచ్చి పెడుతుంది. అందుకు నేనే మీ ముందు ఉన్న పెద్ద ఎగ్జాంపుల్​. మొదట్లో నేను ఈ పని చేయగలనని అనుకోలేదు. మా అబ్బాయి నాలో ధైర్యం నింపాడు. ఆత్మ విశ్వాసం పెంచాడు. అందుకే నేను ఈ జర్నీలో సక్సెస్​ కాగలిగా” అని చెప్పింది శశికళ.

శశి స్పెషల్​ గార్లిక్​ చీజ్​. హంగ్​ కర్డ్, పెపర్​, తరిగిన వెల్లుల్లి వాడి తయారుచేసిన గార్లిక్​ చీజ్​ను వేడి వేడి నాన్​ లేదా చపాతీ మీద వేసి టొమాటో కర్రీతో సర్వ్​ చేస్తుంది. గెస్ట్​లంతా ఈ రెసిపీని చాలా ఇష్టంగా తింటారు.

పకోడీలు చేసుకుంటా

నేను, నా భార్య ఇద్దరం ఫుడ్​ ప్రేమికులం. మేం కొత్త దేశానికి వెళ్లినప్పుడల్లా అక్కడి వంటలు నేర్చుకుంటాం. అలా ఇండియాకు వచ్చినప్పుడు మేం స్పెయిన్​లో తిన్న ఇండియన్​ ఫుడ్​తో పోలిస్తే ఫ్లేవర్స్​ చాలా వేరుగా అనిపించాయి. ఇక్కడ మసాలాలు చాలా స్ట్రాంగ్​ ఫ్లేవర్​ ఉంటాయి. అందుకే శశికళ దగ్గర వంట నేర్చుకున్నాం. ఆమె వంటలు నేర్పించడమే కాదు తన జీవితం గురించి కూడా చెప్తుంటుంది. శశి, ఆమె కొడుకు వంట చేయడంలో చాలా బాగా సాయం చేస్తారు. నాకు వండడం అంటే ఇష్టం. శశి కుకింగ్​ క్లాసుల్లో నేర్పిన వంటకాలను ఇకమీదట స్పెయిన్​లో వండుకుంటా. కుకింగ్​ స్కిల్స్​ను ప్రాక్టీస్​ చేస్తా. కరకరలాడే పకోడీలను ఇష్టంగా తింటా నేను.

ఇకమీదట అవి తినాలనిపించినప్పుడల్లా ఇండియన్​ రెస్టారెంట్​ ఎక్కడ ఉందా? అని వెతుక్కోవాల్సిన అవసరంలేదు. పకోడి, పప్పు, ఆలుగోబీ, పులావ్​, నాన్​ వంటి రుచికరమైన భారతీయ వంటల తయారీ నేర్చుకున్నా కదా. ఇక మీదట నేనే మా వంటగదిలో చేసుకుంటా” అన్నాడు డేనియల్.