1947 సెప్టెంబర్‍ 02న మరో జలియన్ వాలాబాగ్‍

1947 సెప్టెంబర్‍ 02న మరో జలియన్ వాలాబాగ్‍
  • రజాకార్ల తూటాలకు ఒకేరోజు 16 మంది బలి

 

వరంగల్‍, వెలుగు: తెలంగాణ విముక్తి కోసం జరిగిన పోరాటాల్లో పరకాల మారణకాండ ఓ నెత్తుటి సంతకంలా నిలిచిపోయింది. రజాకార్ల చేతిలో ఒకేరోజు 16 మంది అశువులుబాయడంతో మరో జలియన్‍వాలాబాగ్‍గా చరిత్రకెక్కింది. ఈ ప్రాంతం నుంచి ఉద్యమ నేతలు కటంగూరి కేశవరెడ్డి, నరసింహారెడ్డి, ప్రతాప్‍రెడ్డి, ఎస్‍.మనోహర్‍రావు, వాసుదేవరెడ్డి, కోటయ్య, చంద్రయ్య, మేడిపల్లి మల్లయ్య, పాడి నరసింహారెడ్డి లాంటివారు విముక్తి పోరాటంలో భాగంగా రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. 1947 ఆగస్ట్7న పరకాలలో సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. హైదరాబాద్​ విమోచన ఉద్యమం వైపు జనం అడుగులు వేయడానికి ఈ  సంఘటన ప్రేరేపించింది. నిజాం సర్కార్‍ ఉద్యమ నేతలందరికీ అరెస్ట్ వారెంట్లు జారీ చేసినప్పటికీ.. వారి కళ్లుగప్పి ఊరురా తిరుగుతూ ప్రజలను ఉత్తేజపరిచారు.

రజాకార్ల బుల్లెట్ల వర్షానికి.. బెదరలే
ఉద్యమ నేతల పిలుపు మేరకు 1947 సెప్టెంబర్‍2న ప్రస్తుత హనుమకొండ జిల్లా పరకాలలో త్రివర్ణ పతాక ఆవిష్కరణకు అనేక గ్రామాల నుంచి వేల మంది తరలివచ్చారు. పట్టణంలోని చాపలబండ వద్ద ఊరేగింపు తీసి పెద్ద ఎత్తున నినదించారు. రజాకార్లు, నిజాం మిలటరీ శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో.. అక్కడివారిని ఆందోళన విరమించాలని ఆర్డర్‍ వేశారు. ఉద్యమ స్ఫూర్తితో ఉన్న జనాలు వారి ఆదేశాలను లెక్కచేయలేదు. దీంతో నిజాం పోలీసులు ఉద్యమకారులపై విచక్షణారహితంగా బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ కాల్పుల్లో 13 మంది అక్కడికక్కడే వీరమరణం పొందారు. ఇదే ఘటనలో భూపాలపల్లి జయశంకర్‍ జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపురంలో మరో ముగ్గురిని చెట్టుకు కట్టేసి కాల్చిచంపారు. మరో ఆరుగురు చికిత్సపొందుతూ హస్పిటల్‍లో చనిపోయినట్లు చెబుతారు. మొత్తంగా ఈ ఘటన నాడు ఉద్యమం ఉవ్వెత్తునలేవడానికి దోహదపడింది. నాటి పోరాట చరిత్ర భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో.. ‘హైదరాబాద్‍ సంస్థాన విమోచనోద్యమ యోధులకు నివాళి’ పేరుతో అప్పటి హోంశాఖ సహాయ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్‍రావు తన తల్లి చంద్రమ్మ మెమోరియల్‍ ట్రస్ట్ తరఫున వందలాది విగ్రహాలతో 2003లో అమరధామం కట్టించారు. దీనిని సందర్శించినవారికి నాటి నిజాం పోలీసుల దమనకాండ కళ్లకు కడ్తుంది. పోరాట యోధులను చెట్టుకు కట్టేసి చంపిన క్రమంలో రక్తం చిందిన క్షణాలను అమరధామం మధ్యలో ఉండే గుమ్మటంపై బొమ్మల రూపంలో ఏర్పాటు చేశారు. యువకులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా ‘ఉద్యమానికి మేం సైతం’ అన్నట్లు పిడికిలి బిగించి ముందుకు కదులుతున్న యోధుల రూపాలను  వరుసగా నిలిపారు. అమరవీరుల పేర్లను అక్కడి గోడలపై చెక్కించారు.