కులం పేరు రాయలేదని స్కూల్ అడ్మిషన్ క్యాన్సిల్

కులం పేరు రాయలేదని స్కూల్ అడ్మిషన్ క్యాన్సిల్

టెక్నాలజీలో ఎంత దూసుకుపోయినా.. కొన్ని విషయాలలో మాత్రం అలాగే ఉండిపోతున్నాం. కుల, మత బేధాలు లేకుండా మనుషులంతా కలిసుండాలని ప్రభుత్వాలు చెబుతుంటే.. కొంతమంది మాత్రం కులాన్నే ముఖ్యంగా భావిస్తున్నారు. కుల పిచ్చి ఎంతలా పాకిందంటే.. స్కూల్ అడ్మిషన్ ఫాంలో తమ కులమేంటో రాయలేదని, ఏకంగా అడ్మిషనే క్యాన్సిల్ చేశారు ఆ స్కూల్ యాజమాన్యం.

తిరువనంతపురంకు చెందిన నజీమ్-ధన్యా దంపతులు తమ కుమారుడికి ఫస్ట్ గ్రేడ్‌లో అడ్మిషన్ కోసం పట్టాంలోని సెయింట్ మేరీస్ హయ్యర్ సెకండరీ స్కూల్‌కు వెళ్లారు. ఆ స్కూల్ యాజమాన్యం ఆ దంపతులకు అడ్మిషన్ ఫాం ఇచ్చి నింపమన్నారు. అందులో కులం, మతం ఏంటో కూడా రాయాలని ఉంది. వాటిని ఆ దంపతులు నింపలేదు. ఆ కారణం చేత స్కూల్ యాజమాన్యం పిల్లవాడికి అడ్మిషన్ ఇవ్వడానికి నిరాకరించింది. అడ్మిషన్ ఎందుకు ఇవ్వరని స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే సదరు కాలమ్స్ నింపకపోవడమే కారణమని చెప్పారు. దాంతో ఖంగుతిన్న దంపతులు.. మా కుమారుడిని కుల, మతాలకు అతీతంగా పెంచాలనుకున్నామని, అందుకే వాటిని నింపలేదని తెలిపారు. అయితే, అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఒక అఫిడవిట్ సమర్పించాలని వారిని స్కూల్ యాజమాన్యం కోరింది. అందుకు ఆ తల్లిదండ్రులు అంగీకరించలేదు. అంతేకాకుండా ఎందుకు నింపాలో చెప్పాలని ప్రశ్నించారు. కుల, మతాన్ని బట్టే విద్యార్థులకు ప్రభుత్వ ఫలాలు అందుతాయని, అందుకే ఆ కాలమ్స్ నింపాలని కోరారు. ఒకవేళ ఎటువంటి ప్రయోజనాలు వద్దనుకుంటే ఆ అఫిడవిట్‌లో పేర్కొంటూ.. దానికి బాధ్యత వహించాలని స్కూల్ యాజమాన్యం దంపతులను కోరింది. అలా రాసి ఇస్తే పిల్లవాడికి అడ్మిషన్ ఇవ్వడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపింది. ఇదంతా జరిగింది ఏ ప్రైవేట్ స్కూళ్లోనో కాదు.. ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్లో. ఈ విషయం విద్యా శాఖ మరియు విద్యాశాఖ మంత్రికి తెలిసి విచారణ చేయిస్తున్నారు.

For More News..

హైటెక్ నక్సల్స్..! బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లతో రంగంలోకి..

అయోధ్య రామ మందిరం మోడల్ ఇదే

పట్టపగలు ఇంట్లోకి చొరబడి గొడ్డలితో నరికిన్రు