భయం భయంగా బడి.. శిథిలావస్థలకు చేరిన గదులు

భయం భయంగా బడి.. శిథిలావస్థలకు చేరిన గదులు
  • నిరూపయోగంగా మరుగుదొడ్లు
  • అవసరాలకు బయటకు వెళ్తున్న స్టూడెంట్లు
  • కనీస సదుపాయాలు లేక ఇబ్బందులు 

ఆదిలాబాద్, వెలుగు : ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. వాటి పరిస్థితి మాత్రం మారడం లేదు. స్కూళ్లలో ప్రత్యేక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయినా అరకొర నిధులతో అంతంత మాత్రంగానే పనులు సాగుతున్నాయి. సమస్యల కారణంగా సర్కారు బడుల్లో చదువుకునే పరిస్థితులు లేక కొందరు చిన్నారులు ఇంటికే పరిమితమయ్యే పరిస్థితి ఉంది.

శిథిలావస్థలో 300 బడులు

ఆదిలాబాద్​జిల్లా వ్యాప్తంగా 1439 ప్రభుత్వ స్కూళ్లు ఉండగా.. 1,39,421 మంది స్టూడెంట్లు చదువుకుంటున్నారు. అయితే, స్కూళ్లో సరైన మరుగుదొడ్లు, తాగునీరు, కిచెన్ షెడ్లు, ప్రహరీ వంటి సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే వర్షకాలం కావడంతో అపరిశుభ్రత కారణంగా పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. అటు మూత్రశాలలు కూడా లేని స్కూళ్లలో స్టూడెంట్లతోపాటు టీచర్లు కూడా బయటకు వెళ్లాల్సి వస్తోంది. దాదాపు 700 స్కూళ్లలో సరైన మరుగుదొడ్లు లేవు. దాదాపు 300 వరకు బడులు శిథిలావస్థలో ఉన్నాయి. వర్షాలు పడుతుండటంతో ఎప్పుడు పెచ్చులూడుతాయోనని స్టూడెంట్లు భయపడుతూనే తరగతి గదిలో కూర్చుంటున్నారు. 120 స్కూళ్లకు కనీసం తాగునీటి సదుపాయం కూడా లేదు.

నత్తనడకన మన ఊరు–మన బడి

స్కూళ్లో గదులు, సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 237 స్కూళ్లకు రూ.88 కోట్లు మంజూరయ్యాయి.  అయితే, రెండేండ్ల కాలంలో కేవలం 10 స్కూళ్లను మాత్రమే ప్రారంభించారంటే పనులు ఎలా నడుస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇంకా చాలా స్కూళ్ల గదులు పునాదులకే పరిమితమయ్యాయి. అటు ప్రభుత్వం, ఇటు అధికారులు పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. పాత బడులకు మరమ్మతులు, సదుపాయాలు కల్పించకపోవడం.. ఇ టు కొత్త బడుల నిర్మాణాలు పట్టించుకోకపోవడంతో స్టూడెంట్లు సమస్యలతో సతమతమవుతున్నారు.

ఈ ఫొటోలో పిచ్చిమొక్కలతో నిరుపయోగంగా కనిపిస్తున్నవి నేరడిగొండ మండలం ఆరెపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోని మూత్రశాలలు. స్కూల్​ఆవరణలో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలతో ఎప్పుడు ఎలాంటి విష పురుగులు వస్తాయోనని స్టూడెంట్లు భయం భయంగా గడుపుతున్నారు. మూత్రశాలలు నిరుపయోగంగా ఉండటంతో వారు బయటకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. అసలే వర్షకాలం కావడంతో అపరిశుభ్రత కారణంగా స్టూడెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదొక్కటే కాదు జిల్లాలోనే చాలా స్కూళ్లలో ఇదే పరిస్థితి.