
చిన్న రోగమొచ్చినా, రొష్టొచ్చినా యాంటీ బయాటిక్‌లు లేనిది నడవట్లేదు. దీంతో ఆ రోగాలకు కారణమయ్యే బ్యాక్టీరియాలూ మొండిగా మారిపోయాయి. యాంటీబయాటిక్‌లకు లొంగట్లేవు సరికదా.. మరింత స్ట్రాంగ్ అవుతున్నాయి. ఇప్పటిదాకా కొత్త యాంటీబయాటిక్‌లు రాకపోవడం, ఉన్న వాటినే మార్చి మార్చి వాడడమూ పరిస్థితి తీవ్రమవడానికి కారణమవుతోంది. కానీ, ఇప్పుడు ఓ కొత్త యాంటీబయాటిక్‌ను కనిపెట్టారు సైంటిస్టులు. కాదు..కాదు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ– కృత్రిమ మేధ) కనిపెట్టింది. అది కూడా ఇప్పుడున్న యాంటీ బయాటిక్‌ల కన్నా పవర్ఫుల్. మరి, ఆ యాంటీ బయాటిక్ ఏంటి..? ఏఐ దాన్ని కనిపెట్టడం వెనకున్న సైంటిస్టులెవరు? ఏఐనే ఎందుకు ఎంచుకున్నారు? అసలు ఏఐ దాని జాడ ఎట్ల పట్టింది? ఆ మందు వల్ల లాభాలు.. నష్టాలేంటో ఓ సారి లుక్కేద్దాం!
అందుకే ఏఐ..
నిజానికి కొత్త యాంటీ బయాటిక్‌లను కనిపెట్టడంపై ఎప్పటి నుంచో పరిశోధనలు జరుగుతున్నాయి. ఆ పరిశోధనల్లో కొన్ని యాంటీ బయాటిక్‌లను గుర్తించినా, అవి ఇప్పుడున్న వాటితో కొద్దోగొప్పో పోలికలున్నాయి. పైగా సైంటిస్టులు మాన్యువల్‌గా చేయడం ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఖర్చు కూడా ఎక్కువ. అందుకే మొండిగా తయారైన బ్యాక్టీరియా అంతు చూడాలంటే, అసలు ఏ పోలికా లేని కొత్త మందును కనుగొనాలని, అది కూడా తక్కువ టైం, తక్కువ ఖర్చులో అయిపోవాలని సైంటిస్టులు డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన సైంటిస్టులు కొత్త యాంటీ బయాటిక్‌ను కనిపెట్టడానికి ‘ఏఐ’పై దృష్టి పెట్టారు. ఈ–కొలి వంటి మొండి బ్యాక్టీరియాలను చంపే మాలిక్యూల్స్‌ను గుర్తించేలా దానికి ట్రైనింగ్ ఇచ్చారు. 2,500 కెమికల్స్‌ను దానితో స్టడీ చేయించారు. అందులో 1,700 మాలిక్యూల్స్ ఎఫ్‌డీఏ అనుమతి పొందిన మందులు కాగా, మరో 800 సహజమైన ఉత్పత్తులున్నాయి.
ఆ మందు పేరు…
ఏఐకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత బ్రాడ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన డ్రగ్ రీపర్పసింగ్ హబ్‌లో దానితో మందును కనిపెట్టే పనిలో పడ్డారు సైంటిస్టులు. ఈ క్రమంలోనే ఎన్నెన్నో కాంపౌండ్లను విశ్లేషించిన ఏఐ, పవర్ఫుల్ కొత్త యాంటీ బయాటిక్‌ను గుర్తించింది. దానికి సైంటిస్టులు ‘2001: ఏ స్పేస్ ఒడిస్సీ’ అనే 1968లో వచ్చిన సినిమాలోని ఓ కల్పిత ఇంటెలిజెన్స్ సిస్టమ్ పేరు ‘హెలిసిన్’నే ఈ కొత్త మందుకు పెట్టారు. పేషెంట్ల నుంచి సేకరించిన వివిధ రకాల మొండి బ్యాక్టీరియాలపై టెస్ట్ చేశారు. ప్రాణాంతకమైన క్లాస్ట్రీడియం డిఫిసిల్, ఎసినెటోబ్యాక్టర్ బౌమానీ, మైకో బ్యాక్టీరియం ట్యుబర్క్యులోసిస్, సూడోమోనాస్ ఏరుజినోసా వంటి స్ట్రెయిన్లను రోగుల నుంచి తీసుకుని, ల్యాబ్‌లో పెట్రి డిష్‌లలో కాలనీలుగా పెంచారు. వాటిపై హెలిసిన్ను ఆయింట్‌మెంట్‌గా పూశారు. ఒక్క సూడోమోనాస్ మినహా, మిగతా అన్ని బ్యాక్టీరియాలు ఒక్కటి లేకుండా చచ్చిపోయాయి. ఆ తర్వాత ఎసినెటోబ్యాక్టర్ బౌమానీతో ఇన్ఫెక్ట్ అయిన ఎలుకలపైనా టెస్ట్ చేశారు. ఎలుకల్లో ఆ బ్యాక్టీరియాను హెలిసిన్ పూర్తిగా అంతం చేసింది.
మందు ఎట్లా పనిచేస్తుంది?
నిజానికి ఇప్పటిదాకా ఉన్న చాలా యాంటీబయాటిక్‌లు బ్యాక్టీరియా కణాలు, కణగోడలను టార్గెట్‌గా చేసుకునే పనిచేస్తాయి. సెల్వాల్ సింథసిస్‌ను అడ్డుకుని బ్యాక్టీరియాను చంపేస్తుంటాయి. అయితే, మళ్లీ కణాలు పుట్టుకురావడం, బ్యాక్టీరియా బతకడం మామూలైపోయింది. ఇప్పుడు కనిపెట్టిన హెలిసిన్ మాత్రం కణంలోని ఎడినోసిన్ ట్రై ఫాస్ఫేట్(ఏటీపీ) టార్గెట్‌గా పనిచేస్తుంది. కణాల్లో శక్తిని స్టోర్ చేసుకునేందుకు ఈ ఏటీపీలే కీలకం. ఆ ఏటీపీనే హెలిసిన్ బ్రేక్ చేసేస్తుంది. దాని వల్ల కణం పూర్తిగా చచ్చిపోతుంది. ఈ కొత్త పద్ధతిలో బ్యాక్టీరియా మొండిగా మారడం చాలా కష్టమని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ కొత్త యాంటీబయాటిక్ హెలిసిన్ను మనుషులపై టెస్టులు చేసేందుకు ఓ ఫార్మా కంపెనీ లేదా స్వచ్ఛంద సంస్థతో జట్టు కట్టాలని సైంటిస్టులు భావిస్తున్నారు.