డేంజర్ డెంగ్యూ .. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 50 కేసులు నమోదు

డేంజర్ డెంగ్యూ .. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 50 కేసులు నమోదు
  • ప్రబలుతున్న సీజనల్ వ్యాధులు 
  • అప్రమత్తంగాఉండాలంటున్న వైద్యారోగ్య శాఖ అధికారులు 
  • డెంగ్యూ నివారణ చర్యలకు ప్రత్యేక బృందాల ఏర్పాటు

ఆదిలాబాద్, వెలుగు: ఉమ్మడి జిల్లాలో ఓ వైపు సీజనల్ వ్యాధులు విజృంభిస్తుంటే.. డెంగ్యూ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. డెంగ్యూ, డయేరియా, మలేరియా, వైరల్ ఫీవర్​లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురుస్తుండడంతో సీజనల్ వ్యాధులు ప్రారంభమయ్యాయి. జ్వరం, ఒళ్లునొప్పులు, దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. డెంగ్యూ కేసులతోపాటు విష జ్వరాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆదిలాబాద్​ జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 7,324 విషజ్వరాల కేసుల నమోదయ్యాయి. దీంతో చికిత్స కోసం జనాలు హాస్పిటల్స్ కు క్యూ కడుతున్నారు. దీంతో అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ ర్యాపిడ్ ఫీవర్ సర్వే చేపట్టింది. మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ శాంపుల్స్ సేకరిస్తున్నారు. అవసరమున్నవారిని ఆస్పత్రులకు తరలిస్తున్నారు.  

ఏజెన్సీతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ..

డెంగ్యూ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆదిలాబాద్​లో ఇప్పటి వరకు 27 కేసులు, మంచిర్యాలలో 21 కేసులు,  ఆసిఫాబాద్ 2తో పాటు 10 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఏజెన్సీతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ ఎక్కువగానే బయటపడుతున్నాయి. ఆదిలాబాద్​ జిల్లాలో ఒక్క నెలలోనే 11 కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ, మున్సిపల్ అధికారులు డెంగ్యూ నియంత్రణపై అర్బన్ యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ఆదిలాబాద్​ పట్టణంలోని 49 వార్డుల పరిధిలో ఆరు ప్రత్యేక టీమ్​లు ఏర్పాటు చేశారు. ప్రతి టీమ్ వారంలో మూడు రోజులు (మంగళవారం, గురువారం, శుక్రవారం) వార్డుల్లో పర్యటిస్తూ డ్రైడే, యాంటీ లార్వా యాక్టివిటీస్ నిర్వహిస్తున్నారు. డెంగ్యూ కేసులు నమోదైన ప్రాంతాలను సందర్శించి ఇంటి ఆవరణ, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. నీటిని నిల్వ ఉంచుకోకుండా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 

ఆరోగ్య శాఖ అలర్ట్

జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం వైద్యారోగ్యశాఖ అలెర్ట్ అయ్యింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే స్టాప్ డయేరియా కార్యక్రమం నిర్వహిస్తోంది. సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజలకు జింక్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందిస్తూ, వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తున్నారు. అంగన్వాడీ, ప్రభుత్వ స్కూళ్లలో ఐరన్ ట్యాబ్​లెట్స్​ అందిస్తున్నారు. జనమన్ కార్యక్రమంలో భాగంగా ఏజెన్సీ గ్రామాల్లో నిత్యం వాహనాలు ఏర్పాటు చేసి మెడికల్ క్యాంపులు నిర్వహించి వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుండటంతో చాలా ప్రాంతాల్లో పారిశుధ్య లోపం కనిపిస్తోంది. దీంతో మురికి గుంటల్లో నీరు నిల్వ ఉండి దోమలు వృద్ధి చెందే అవకాశం ఉంది. వ్యాధుల నివారణకు అధికారులు మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో డెంగ్యూ కేసులు

ఆదిలాబాద్​    27
మంచిర్యాల   21
ఆసిఫాబాద్​    02
నిర్మల్​           00