10 కోట్లు చాలకపోతే.. ఇంకా ఎక్కువ ఇస్తా.. వాడిని చంపేయండి : ఉదయనిధిపై పరంధాస్ ఆచార్య

10 కోట్లు చాలకపోతే.. ఇంకా ఎక్కువ ఇస్తా.. వాడిని చంపేయండి : ఉదయనిధిపై పరంధాస్ ఆచార్య

సనాతన ధర్మాన్ని నిర్మిలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై అయోధ్య స్వామీజీ పరంధాస్ ఆచార్య ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఇప్పటికే ఉదయనిధి స్టాలిన్ తల నరికి తీసుకొస్తే 10 కోట్ల రూపాయలు ఇస్తానంటూ ప్రకటించిన ఆయన.. తాజాగా ఆ రివార్డ్ ను మరింత పెంచుతానని హామీ ఇచ్చారు. 10 కోట్లు కాకపోతే.. 20 కోట్లు ఇస్తాను.. ఉదయనిధిని చంపండి అంటూ మరోసారి వ్యాఖ్యానించటం సంచలనంగా మారింది. 

ఓ రాష్ట్ర మంత్రిని.. ఓ పార్టీ ముఖ్యవ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఏంటనే విమర్శలు వచ్చిన తర్వాత కూడా పరమహసం వెనక్కి తగ్గకపోగా.. మరింత రెచ్చిపోయారు. 10 కోట్ల ఆఫర్ ఏంటీ.. కావాలంటే ఇంకా ఎక్కువే ఇస్తాను.. సనాతన ధర్మాన్ని అవహేళన చేసిన వాళ్లను ఎలా బతకనిస్తారంటూ.. ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో మరింత తీవ్రంగా రెచ్చిపోయి మాట్లాడటం ఇప్పుడు కలకలం రేపుతోంది.

"సనాతన ధర్మాన్ని అవమానిస్తే.. ఏమాత్రం సహించను. అతని (ఉదయనిధి) తల నరికినందుకు రూ. 10 కోట్లు సరిపోకపోతే చెప్పండి..  ఆ రివార్డ్‌ను మరింత పెంచుతాను.." అని పరంధాస్ ఆచార్య ప్రకటించారు. ఉదయనిధి చేసిన వ్యాఖ్యల వల్ల దేశంలోని 100 కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని, వెంటనే డీఎంకే మంత్రి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో ఏ అభివృద్ధి జరిగినా 'సనాతన ధర్మం' వల్లనే అని తెలిపారు.

కాగా, ఉదయనిధిని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడినందుకు మంగళవారం వెల్లూరులో డీఎంకే మద్దతుదారులు..  పరంధాస్ ఆచార్య దిష్టిబొమ్మను దహనం చేశారు.