
సీనియర్ సిటిజన్స్ ఇటీవల కాలంలో నిరాదరణకు గురవుతున్నారు. వీరిని ఆదుకోవాల్సిన బాధ్యత సీఎం రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది. వయోవృద్ధుల సంరక్షణలో భాగంగా పోషణ సంరక్షణ చట్టం (సీనియర్ సిటిజన్స్ చట్టం) అమలుకు ప్రత్యేక అధికారిని ప్రభుత్వం నియమించాలి. కొడుకులు, బిడ్డల నిరాదరణకు గురవుతున్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం 2007లో తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రతి డివిజన్ స్థాయిలో ఒక ట్రిబ్యునల్ కమిటీని ఏర్పాటు చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో వృద్ధుల సమస్యల పరిష్కారం, సంక్షేమం, హక్కుల రక్షణ కోసం నియమావళిని రూపొందించారు. కమిటీకి చైర్మన్‌గా రెవెన్యూ డివిజన్ స్థాయి అధికారి, జిల్లా వికలాంగుల సహాయ సంచాలకులు, వయోవృద్ధుల శాఖ సహాయ సంచాలకులు కన్వీనర్లుగా, స్వచ్ఛంద సంస్థల నుంచి ఒకరు లేదా ఇద్దరు ప్రతినిధులు కమిటీలో ఉంటారు. కోర్టుకు ఉండే అధికారాలు కమిటీకి ఉంటాయి. నిరాదరణకు గురైన తల్లిదండ్రుల కేసులు విచారించి 90 రోజుల్లో తీర్పులు ఇస్తారు. అయితే, క్షేత్రస్థాయిలో వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం ఆశించినవిధంగా జరగడం లేదు.
సీనియర్ సిటిజన్స్ చట్టంపై అవగాహన కల్పించాలి
ప్రధానంగా గ్రామాల్లో సీనియర్ సిటిజన్స్ చట్టంపై అవగాహన కల్పించాలి. గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రామంలోని వృద్ధుల సంఖ్యపై సర్వే నిర్వహించాలి. గ్రామసభలో వయోవృద్ధుల పోషణ, సంక్షేమం, హక్కుల రక్షణ, సీనియర్ సిటిజన్స్ చట్టం పట్ల చైతన్యం కలిగించాలి. వృద్ధుల ఆరోగ్యం, సంక్షేమ చట్టాలపై చర్చ జరగాలి. వృద్ధులకు ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలి. ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి వయోవృద్ధుల జనాభా సేకరించి ప్రతి నెల వృద్ధుల కోసం ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించాలి.
వయో వృద్ధుల కమిటీని ఏర్పాటు చేయాలి. ప్రతి గ్రామంలో మహిళా సంఘాలు, తల్లుల కమిటీలు మాదిరి వయోవృద్ధుల కమిటీని కూడా ఏర్పాటు చేయాలి. సీనియర్ సిటిజన్స్‌కు సంబంధించిన చట్టాలను మీడియా విస్తృతంగా ప్రచారం చేయాలి. కేంద్రం వయోవృద్ధులు సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన టోల్ ఫ్రీ నెంబర్14567ను విస్తృతంగా ప్రచారం చేయాలి.
మీడియా క్రియాశీలక పాత్ర పోషించాలి. గ్రామాల్లో వయో వృద్ధులను బెదిరించి ఆస్తిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నవారిపై కేసులు నమోదు చేసి కఠిన శిక్షలు, జరిమానాలు విధించాలి. తిరిగి వయోవృద్ధులకు వారి ఆస్తిని వారి పేరు మీద రిజిస్టర్ చేయాలి. సీనియర్ సిటిజన్స్ ఎదుర్కొనే సమస్యలు జిల్లా కలెక్టర్, రెవెన్యూ డివిజన్ అధికార్లకు నివేదించాలి. వృద్ధులను మానవ వనరుల అభివృద్ధికి సారథులుగా సమాజం, ప్రభుత్వం గుర్తించాలి.
వృద్ధులపై బెదిరింపులు అరికట్టాలి
రెవెన్యూ డివిజన్ స్థాయి అధికారి తన రెగ్యులర్ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం వల్ల తగిన సమయం లేకపోవడంతో వయోవృద్ధుల సమస్యలు పరిష్కారానికి నోచుకోని స్థితి దాపురించింది. రాష్ట్రంలో వృద్ధులను బెదిరించి వారి ఆస్తులను తమ పేరు మీద రాయించుకోవడం, రిజిస్ట్రేషన్ చేయించుకోవడం తదితర కారణాల వల్ల గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఒంటరి వృద్ధులు ఆస్తులు కోల్పోయి రోడ్డునపడిన సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి.
ప్రజాప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేయడం అభినందనీయం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్లు, ఒంటరి మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పలు పథకాలు ప్రవేశపెట్టడం కూడా హర్షణీయం. కానీ, గ్రామీణప్రాంత వృద్ధుల హక్కుల రక్షణకు సమగ్రమైన చర్యలు చేపట్టాలి. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే నిరక్షరాస్యులైన వయోవృద్ధుల సంక్షేమం వారి హక్కుల రక్షణకు సమగ్రమైన చర్యలు చేపట్టాలి. వయోవృద్ధుల ఆస్తులు రాయించుకొని వారిని ఇంటి నుంచి బయటకు గెంటి వేస్తున్నారు. కొంతమంది వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు.
వృద్ధుల ఆస్తి విక్రయానికి సంబంధించిన సొమ్ము వృద్ధుల ఖాతాలోనే జమ అయ్యేలా అధికారులు తగుచర్యలు తీసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వృద్ధులు నిరక్షరాస్యులు వారందరికీ బ్యాంక్ ఖాతాలు ఉండవు. డివిజన్ స్థాయి అధికారులు తమ రెగ్యులర్ ఉద్యోగ బాధ్యతల్లో తీరిక లేకుండా ఉండటం వల్ల వయోవృద్ధుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రతి మండల స్థాయిలో సీనియర్ సిటిజన్స్ చట్టం అమలుకు ప్రత్యేక అధికారిని నియమించాలి. వయోవృద్ధుల సమస్యలు పరిష్కారం సంక్షేమం హక్కుల రక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలి.
- నేదునూరి కనకయ్య