బేర్మన్న స్టాక్ మార్కెట్లు

బేర్మన్న స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు బేర్మన్నాయి. అన్నీ ప్రతికూల సంకేతాలే ఉండటంతో వారం ప్రారంభంలో భారీగా నష్టపోయాయి. ఒకవైపు ద్రవ్యోల్బణ భయాలు.. మరోవైపు అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును ప్రభావితం చేశాయి. రూపాయి విలువ మరింత పతనమవడం, పెరుగుతున్న క్రూడాయిల్ ధరలు సైతం మార్కెట్ పై ప్రతికూల ప్రభావం చూపాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. అమ్మకాల ఒత్తిడితో ఒక్క రోజులోనే రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. బీఎస్ఈలో లిస్టైన కంపెనీల విలువ శుక్రవారం రూ.251.81 లక్షల కోట్లు ఉండగా.. సోమవారం వాటి విలువ రూ. 246.14 లక్షల కోట్లకు తగ్గిపోయింది. 

ఉదయం 53,184.61 పాయింట్ల వద్ద ప్రారంభమైన మార్కెట్లో ట్రేడింగ్ ఆరంభంలో నమోదైన 53,207.54 పాయింట్లు ఇవాళ్టి గరిష్ఠ స్థాయి. అనంతరం అమ్మకాల ఒత్తిడితో మార్కెట్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. మార్కెట్ ముగిసే సమయానికి 1456.74 పాయింట్ల నష్టంతో 52,846.70 -పాయింట్ల వద్ద క్లోజయింది. బజాజ్  ఫిన్ సర్వ్ షేర్లు 7శాతంపైగా నష్టపోగా.. బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ 5శాతానికి పైగా, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, ఎన్టీపీసీ వాటాలు 4శాతానికి పైగా లాస్ అయ్యాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా భారీగా లాసైంది. 427.40 పాయింట్లు నష్టపోయి 15,774.40 పాయింట్ల వద్ద ముగిసింది.