- అమెరికా– ఇరాన్ శాంతి ఒప్పందంపై ఆశలు
- అంతర్జాతీయంగా తగ్గిన క్రూడాయిల్ ధరలు
- 87 డాలర్లకు దిగొచ్చిన బ్రెంట్ క్రూడ్
- 72 పైసలు బలపడి 95.13కు రూపాయి
- గ్లోబల్ మార్కెట్లలో కూడా సందడి
ముంబై: అమెరికా–-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు మెండుగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా తగ్గడంతో బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీ శుక్రవారం 2 శాతం మేర లాభపడ్డాయి. ఇన్వెస్టర్ల సంపద రూ.10 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 462 లక్షల కోట్లకు చేరింది.
సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసే సమయానికి ఏకంగా 1,695 పాయింట్లు ఎగబాకి 75,527.95 వద్ద ముగియగా, నిఫ్టీ 461 పాయింట్లు జంప్ చేసి 23,622.90 వద్ద స్థిరపడింది. మార్కెట్ హెచ్చుతగ్గులను సూచించే 'ఇండియా విక్స్' 5శాతం తగ్గి 14.80 కి పడిపోయింది.
దీనిని బట్టి మార్కెట్ స్టేబుల్‌గా ఉందని, అనిశ్చితి తగ్గిందని అర్థం చేసుకోవచ్చు. సెన్సెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్ అత్యధికంగా 6శాతం లాభపడింది. ఎల్‌అండ్‌టీ , ఇండిగో సంస్థలు 5శాతం చొప్పున పెరిగాయి. వీటితోపాటు టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతి సుజుకి, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు 2 నుంచి 4 శాతం పెరిగాయి. మరోవైపు మార్కెట్లో పాజిటివ్ సెంటిమెంట్ ఉన్నప్పటికీ, ఐటీ ఇండెక్స్ మాత్రం స్వల్ప నష్టాల్లో ముగిసింది. ముఖ్యంగా టెక్ మహీంద్రా షేరు 2శాతానికి పైగా నష్టపోయి టాప్ లూజర్‌గా నిలిచింది. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, పీఎస్‌యూ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రియల్టీ ఇండెక్స్‌లు 3శాతం చొప్పున పెరిగాయి.
ఎన్‌ఎస్‌ఈలో 2,740 షేర్లు శుక్రవారం లాభాల్లో ముగియగా, కేవలం 564 షేర్లు మాత్రమే నష్టపోయాయి. ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) మాత్రం శుక్రవారం నికరంగా రూ.1,081 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. ఇదే టైమ్‌లో డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (డీఐఐలు) రూ.5,341 కోట్ల విలువైన షేర్లను కొన్నారు.
మార్కెట్లను పరుగులు పెట్టించిన అంశాలు..
- అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై ఆశలు
గత నెల రోజులుగా సాగుతున్న అమెరికా-–ఇరాన్ ఉద్రిక్తతలకు తెరదించుతూ, ఈ ఆదివారం స్విట్జర్లాండ్‌లో ఇరు దేశాలు శాంతి ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉందని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. ఈ వారాంతంలోనే యూరప్‌లో ఒప్పందం కుదరొచ్చని, హార్మూజ్ జల సంధి అధికారికంగా తిరిగి ఓపెన్ అవుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
అయితే ఇరాన్ విదేశాంగ శాఖ స్పందిస్తూ, చర్చలు ముగింపు దశకు వచ్చినా తమ కొన్ని కీలక డిమాండ్లపై రాజీ పడేది లేదని స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం అమెరికా చమురు ఆంక్షలను ఎత్తివేయనుండగా, ఇరాన్ 30 రోజుల్లోగా సముద్ర మార్గాన్ని తిరిగి ఓపెన్ చేయనుంది.
- ప్రపంచ మార్కెట్ల జోరు
చమురు ధరలు తగ్గడంతో గ్లోబల్ మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొంది. జపాన్ నిక్కీ 3శాతం, సౌత్ కొరియా కోస్పి 4శాతం పైగా లాభపడగా, హాంగ్ కాంగ్, చైనా మార్కెట్లు 1-–2శాతం పెరిగాయి. యూరప్ మార్కెట్లు కూడా శుక్రవారం 2శాతం వరకు లాభపడ్డాయి.
- రూపాయి రికార్డు రికవరీ
డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ శుక్రవారం 67 పైసలు బలపడి 95.18 వద్దకు చేరింది. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం కలిసొచ్చింది. రాబోయే రోజుల్లో రూపాయి 95.25–95.95 మధ్య కదలాడొచ్చని ఎనలిస్టులు
అంచనా వేస్తున్నారు.
- నిపుణుల మాట
సెంటిమెంట్ పాజిటివ్‌గా మారినప్పటికీ, ఇన్వెస్టర్లు భౌగోళిక రాజకీయ పరిణామాలపై అప్రమత్తంగా ఉండాలని, అమెరికా–ఇరాన్ చర్చల్లో ఎలాంటి అడ్డంకులు వచ్చినా మార్కెట్ మళ్లీ ఒత్తిడికి గురవుతుందని యాక్సిస్ డైరెక్ట్ రీసెర్చ్ హెడ్ రాజేష్ పాల్వియా తెలిపారు. సాంకేతికంగా నిఫ్టీ 23,300–23,350 స్థాయి కంటే పైన ఉన్నంతవరకు మార్కెట్ బలంగానే ఉంటుందన్నారు. ఒకవేళ 23,500 పైన స్థిరంగా కొనసాగితే, రాబోయే రోజుల్లో నిఫ్టీ 23,700 మార్కును సులువుగా దాటొచ్చని, ఒకవేళ నష్టాలు వస్తే 23,100 కీలక మద్దతుగా పనిచేస్తుందని అంచనావేశారు.
- తగ్గిన చమురు ధరలు
ఈ శాంతి ఒప్పంద వార్తలతో ముడిచమురు ధరలు భారీగా పడ్డాయి. యుద్ధానికి ముందు గ్లోబల్ ఆయిల్ రవాణాలో 20శాతం హార్మూజ్ జల సంధి గుండా జరిగిన విషయం తెలిసిందే. ఈ మార్గం తిరిగి ఓపెన్ అయితే ఆయిల్ సప్లయ్ ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. దీంతో శాంతి ఒప్పందం వార్తలు రాగానే బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 4శాతం తగ్గి బ్యారెల్ 87 డాలర్లకు దిగొచ్చాయి. అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్ 83 డాలర్లకి చేరింది. ఈ ఏడాది ప్రారంభంలో ఉద్రిక్తతల వల్ల చమురు ధరలు ఏకంగా బ్యారెల్‌కు 120 డాలర్లను టచ్ చేశాయి.
