కృష్ణా నదిలో నీటి వాటా తేల్చండి.. ఆంధ్ర, కేంద్రంకు సీఎం కేసీఆర్ అల్టిమేటం

కృష్ణా నదిలో నీటి వాటా తేల్చండి.. ఆంధ్ర, కేంద్రంకు సీఎం కేసీఆర్ అల్టిమేటం

కృష్ణా నదిలో నీటి వాటాను తేల్చాలని డిమాండ్ చేశారు సీఎం కేసీఆర్. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో ఈ మేరకు ప్రశ్నించారాయన. ఆంధ్రా ప్రజలకు మేం వ్యతిరేకం కాదని.. మేం ఎవరి నీళ్లు తీసుకోవటం లేదని.. ఎవర్నీ దోచుకోవటం లేదని.. తెలంగాణ వాటా నీళ్లు మాత్రమే అడుగుతున్నామని స్పష్టం చేశారు కేసీఆర్. 

బీజేపీ నాయకులకు సిగ్గూ లజ్జా ఉంటే ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లి.. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా విషయాన్ని తేల్చాలని.. ట్రిబ్యునల్ ఇచ్చే విధంగా ప్రయత్నించాలంటూ చురకలు అంటించారాయన. కేసీఆర్ కాన్వాయ్ పై పడుడు కాదని.. మేం ఊదేస్తే నశిం కింద కొట్టుకుపోతారంటూ బీజేపీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి పంచ్ లు వేశారు కేసీఆర్.

తెలంగాణను ఓడగొట్టింది.. నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీనే అంటూ దుమ్మెత్తిపోశారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ పాలనలో.. టీడీపీ పాలనలో పాలమూరు దగాపడిందని.. ఇప్పుడిప్పుడే ముఖాలు తెల్లబడుతున్నాయని.. ఓట్ల కోసం వచ్చే వాళ్లను నమ్మొద్దని పిలుపునిచ్చారు కేసీఆర్. ఇప్పుడు గోల పడితే.. తర్వాత గోస పడతామని ప్రజలను హెచ్చరించారాయన. పాలమూరుకు కొత్తగా ఐదు మెడికల్ కాలేజీలు వచ్చాయని.. ఇన్నాళ్లు పాలించినా కాంగ్రెస్, టీడీపీ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారాయన. 

కృష్నా జలాల్లో తెలంగాణ వాటాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ.. కేంద్రంలోని బీజేపీ వాటా తేల్చాలని డిమాండ్ చేయటం ఇప్పుడు ఆసక్తిగా మారింది.