వనపర్తి, వెలుగు: సంస్థాధీశుల కాలంలో అప్పటి పాలకులు ముందుచూపుతో తవ్వించిన సప్తసముద్రాలు (చెరువులు) నేటికీ రైతులకు ఆదరువుగా నిలుస్తున్నాయి. ఎత్తైన ప్రాంతం నుంచి వచ్చే వరదను ఒడిసి పట్టేందుకు నిర్మించిన సప్తసముద్రాలు రైతులకు సాగునీటిని అందిస్తున్నాయి. ఏడు చెరువుల్లో మూడు రిజర్వాయర్లుగా మారాయి.
ఎత్తిపోతల పథకం నీటిని ఈ రిజర్వాయర్లలో నిల్వ చేయడంతో ఈ రిజర్వాయర్లు ఉన్న ప్రాంతాల్లో భూగర్భ జలాలు వృద్ధి చెంది రైతులు ఏటా వానాకాలం, యాసంగిలో రెండు పంటలు వేసుకుంటున్నారు. ఉష్ణోగ్రతలు పెరగడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చెరువులు, ప్రాజెక్టుల్లో నీళ్లు క్రమంగా అడుగంటిపోతుండగా, సప్తసముద్రాలు మాత్రం నీళ్లతో కళకళలాడుతున్నాయి. ఈ సప్తసముద్రాల కింద వనపర్తి జిల్లాలో 85వేల ఎకరాలలో పంటలు సాగు చేస్తున్నారు.
ఆరుతడి పంటలే కాన్సెప్ట్!
వనపర్తి సంస్థానం ప్రాంతంలో ముందు ఎక్కువగా వేరుశనగ పంట సాగయ్యేది. వనపర్తి ఎత్తైన ప్రాంతంలో ఉండడంతో వర్షంతో వచ్చే వరద గోపాల్పేట మండలం నుంచి కొత్తకోట మండలం కానాయపల్లి శంకరసముద్రం చెరువులోకి చేరుతాయి. అలా కిందికి పారుతూ రామన్‌పాడు ప్రాజెక్టులోకి చేరుతోంది. ఈ నీటిని ఒడిసిపట్టి రైతులకు సాగు నీటిని అందించేందుకు సంస్థానాధీశులు కొత్తకోట, పెద్దమందడి, పెబ్బేరు, శ్రీరంగాపూరు మండలాల్లో ఈ సప్తసముద్రాలను తవ్వించారు.
వీటి కింద వరి, వేరుశనగ పంటలను పండిస్తున్నారు. ఈ సముద్రాల ఏర్పాటులో రాణి శంకరమ్మ ప్రధాన పాత్ర పోషించారు. కొత్తకోట మండలం కానాయపల్లిలో శంకరసముద్రం, రాయనిపేటలో రాజసముద్రం, సంకిరెడ్డిపల్లిలో కృష్ణసముద్రం తవ్వించారు. పెద్దమందడి మండలం వెల్టూరులో గోపాలసముద్రం, పెబ్బేరు మండలకేంద్రంలో మహాభూపాలసముద్రం, శ్రీరంగాపూరు మండలకేంద్రంలో రంగసముద్రం, తాటిపాములలో వీరసముద్రం తవ్వించారు.
మూడు రిజర్వాయర్లు..
సంస్థాధీశులు తవ్వించిన సప్తసముద్రాల్లో మూడింటిని భీమా ఎత్తిపోతల పథకాన్ని అనుసంధానించారు. ఈ పథకం కింద శంకరసముద్రం, కృష్ణసముద్రం, రంగసముద్రం చెరువులను రిజర్వాయర్లుగా మార్చారు. వేసవికాలం వచ్చినా ఈ రిజర్వాయర్లలో నీరు అడుగంటిపోదు. ఫలితంగా రిజర్వాయరు కాల్వల ద్వారా పారే నీటితో సమీప గ్రామాల్లో భూగర్భ జలాలు వృద్ధి చెంది రైతుల బోరుబావుల్లో నీరు సమృద్ధిగా ఉంటోంది. వర్షాలు వచ్చినప్పుడు పై నుంచి కురిసిన వర్షానికి వచ్చే వరద నీరు వృథా పోకుండా సంస్థానాధీశులు తవ్వించిన చెరువుల్లో నిల్వ చేస్తుండడంతో ఈ చెరువుల్లో నీరు పూర్తిగా నిల్వ ఉండకున్నా అడుగంటి పోవడంలేదు.
