జమ్మూకాశ్మీర్​లో లోయలో పడ్డ క్రూజర్.. ఏడుగురు మృతి

జమ్మూకాశ్మీర్​లో లోయలో పడ్డ క్రూజర్.. ఏడుగురు మృతి

లోయలో పడ్డ క్రూజర్.. ఏడుగురు మృతి

జమ్మూకాశ్మీర్​లో ఘోరం

జమ్మూ : జమ్మూకాశ్మీర్​లో ఘోర ప్రమాదం జరిగింది. క్రూజర్ లోయలో పడి ఏడుగురు కూలీలు చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కిష్త్వార్ జిల్లాలో జరిగింది. ఇక్కడి దంగ్డూర్ పవర్ ప్రాజెక్టులో పని చేస్తున్న 10 మంది కూలీలతో బుధవారం ఉదయం క్రూజర్ బయలుదేరింది. 8:30 గంటల ప్రాంతంలో ప్రాజెక్టు సమీపంలోకి చేరుకుంది. అయితే అక్కడ ఓ మూల మలుపు దగ్గర అదుపు తప్పి పెద్ద లోయలో పడిపోయింది. వందలాది అడుగుల లోయలో పడిపోవడంతో క్రూజర్ మొత్తం నుజ్జునుజ్జయింది. స్పాట్​లో ఆరుగురు చనిపోగా, మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, వాళ్లను ఆస్పత్రికి తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. యాక్సిడెంట్ జరిగిన ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయని, దాంతో డ్రైవర్ కంట్రోల్ కోల్పోయాడని ఎస్పీ ఖలీల్ అహ్మద్ తెలిపారు. మూల మలుపు దగ్గర వెహికల్ అదుపు తప్పి పెద్ద లోయలో పడిపోయిందని చెప్పారు. స్థానికులు వచ్చి సహాయక చర్యలు చేపట్టి, గాయపడినోళ్లను ఆస్పత్రికి తరలించారని పేర్కొన్నారు. చనిపోయినోళ్లలో ఇద్దరు జార్ఖండ్ వ్యక్తులని తెలిపారు. 

ప్రాజెక్టు వర్కర్ల నిరసన.. 

ఈ ఘటనపై ఎల్జీ మనోజ్ సిన్హా విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. గాయపడినోళ్లకు మెరుగైన ట్రీట్ మెంట్ అందించాలని అధికారులను ఆదేశించారు. వాళ్లందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై మాజీ సీఎంలు గులాంనబీ ఆజాద్, మెహబూబా ముఫ్తీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కాగా, బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని పవర్ ప్రాజెక్టు వర్కర్లు ధర్నా చేశారు. వర్క్ సైట్ దగ్గర వందలాది మంది నిరసన తెలిపారు.