వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురి మృతి

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురి మృతి

రాష్ట్రంలో పలుచోట్ల రహదారులు రక్తమోడాయి. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒక్కరోజే ఏడుగురు మృతిచెందారు. శంషాబాద్ మండలం పెద్దషాపూర్ దగ్గర ఘోర రోడ్డు  ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీ నగర్ వద్ద వెనుక నుంచి బైక్ ను టిప్పర్ ఢీకొట్టింది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రధానంగా అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే  ఈ ప్రమాదాలు చోటుచేసుకున్నాయని పోలీసులు గుర్తించారు. 

* కొమురంభీం జిల్లా: జిల్లాలోని కౌటాల మండలం యాపల్ గూడ వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల పాప దుర్గం రియపై నుంచి కంకర టిప్పర్ దూసుకెళ్లింది. దీంతో  చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహంతో  టిప్పర్ ను అడ్డుకొని ఆందోళనకు  దిగారు. టిప్పర్ డ్రైవర్ ను చితకబాదారు. 

* జనగామ జిల్లా : పాలకుర్తి మండలం వావిలాల గ్రామంలో బైక్ ను వెనుక నుంచి టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో  బైక్ పై వెళ్తున్న యువతి అక్కడికక్కడే మృతిచెందింది. బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 

* నిర్మల్ జిల్లా : జిల్లా కేంద్రంలోని సోఫీ నగర్ వద్ద వెనుక నుంచి బైక్ ను టిప్పర్ ఢీకొట్టింది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


*  రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ మండలం పెద్దషాపూర్ దగ్గర ఘోర రోడ్డు  ప్రమాదం జరిగింది. షాద్నగర్ వైపు నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం పెద్దషాపూర్ దగ్గర అదుపు తప్పింది. అది కారును ఢీకొట్టి తర్వాత బైకును ఢీకొట్టి ముగ్గురి పై నుంచి దూసుకెళ్లింది. ఈ  ప్రమాదంలో షాద్ నగర్ నియోజకవర్గం సరూర్ నగర్ కు చెందిన ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు.

మృతి చెందిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన భార్య, భర్త, కూతురు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. డీసీఎం బీభత్సంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడగా.. పోలీసులు క్లియర్ చేశారు. రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.