విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు నివాళి

విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు నివాళి

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా పలువురు ప్రముఖులు అమరవీరులకు నివాళులర్పించారు.1999లో పాకిస్థాన్ లో జరిగిన కార్గిల్ వార్ లో అమరులైన జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు. 23 ఏళ్ల క్రితం లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పాకిస్థాన్ సైన్యం అక్రమంగా స్వాధీనం చేసుకున్న భూభాగాన్ని భారత సైన్యం ఇదే రోజున తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని ఏటా జులై 26న కార్గిల్ విజయ్ దివస్ నిర్వహిస్తారు. 

కార్గిల్ అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులర్పించారు. సైనికుల ధైర్య సాహసాలు, సంకల్పానికి విజయ్ దివస్ ప్రతీక అని అన్నారు. మాతృభూమి కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులందరికీ  శిరసు వంచి నమస్కరిస్తున్నానని ట్వీట్ చేశారు. ఆ సైనికులకు, వారి కుటుంబ సభ్యులకు జాతియావత్తు ఎప్పటికీ రుణపడి ఉంటుందని అన్నారు. 

భరత మాత కీర్తి, ప్రతిష్టలకు కార్గిల్ విజయ్ దివస్ ప్రతీక అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఈ సందర్భంగా మాతృభూమి రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న  సైనికులకు శతకోటి వందనాలు తెలిపారు. 

రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైతం కార్గిల్ వార్ హీరోలకు నివాళి అర్పించారు. నేషనల్ వార్ మెమోరియల్ వద్ద పుష్పగుచ్ఛం ఉంచి వీర జవాన్లకు అంజలి ఘటించారు.

విజయ్ దినోత్సవ్ సందర్భంగా త్రివిధ దళాధిపతులు అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే  నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరి ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద నివాళులర్పించారు.