దాస్‌ వచ్చే..మార్పులు వచ్చే

దాస్‌ వచ్చే..మార్పులు వచ్చే
  • ఈ వారంతో ఆర్బీఐ గవర్నర్‌‌‌‌గా 2 ఏళ్లు పూర్తి
  • మాజీ గవర్నర్‌‌‌‌లు చేతులెత్తేసిన టైమ్‌‌లో పదవిలోకి

బిజినెస్‌‌‌‌డెస్క్‌‌, వెలుగు: శక్తికాంత దాస్‌‌  ఆర్‌‌‌‌బీఐ గవర్నర్‌‌‌‌గా బాధ్యతలు తీసుకొని ఈ వారంతో రెండేళ్లు పూర్తయ్యింది. ఈ రెండేళ్లలో ఎకానమీలోని అనేక సమస్యలను ఆయన నాయకత్వంలోని రిజర్వ్‌‌ బ్యాంక్‌‌ పరిష్కరించింది. చర్యలను వేగంగా తీసుకొని దివాలా స్థాయికి చేరుకున్న ఫైనాన్షియల్ సంస్థలను కాపాడింది. ఆర్‌‌‌‌బీఐ గవర్నర్‌‌‌‌గా దాస్‌‌ పదవి చేపట్టే టైమ్‌‌కి  సెంట్రల్‌‌ బ్యాంక్‌‌కు ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. అప్పటి గవర్నర్‌‌‌‌ ఉర్జిత్ పటేల్‌‌, డిప్యూటీ గవర్నర్‌‌‌‌ విరల్‌‌ ఆచార్య తమ పదవి కాలం ముగియకుండానే ఆర్‌‌‌‌బీఐని విడిచిపెట్టేశారు. ఆర్‌‌బీఐ కార్యకలాపాలలో ప్రభుత్వ జోక్యం పెరిగిందని, అందుకే తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నామని కూడా ప్రకటించారు. చాలా మంది కూడా ఆర్‌‌‌‌బీఐలో రాజకీయ జోక్యం పెరిగిందని ఆరోపించారు. ఆ టైమ్‌‌లో ఆర్‌‌‌‌బీఐ గవర్నర్‌‌‌‌గా దాస్‌‌ను ప్రభుత్వం నియమించింది. మోడీ ప్రభుత్వం–1 లో దాస్‌‌ కీలకంగా ఉన్నారు. నోట్ల రద్దు వంటి కీలక చర్యలలో ఆయన భాగమయ్యారు. గవర్నర్‌‌‌‌గా వచ్చిన  దాస్‌‌ తన పనిని సక్రమంగా చేశారనే చెప్పొచ్చు. అతని ముందు పనిచేసిన గవర్నర్లతో పోలిస్తే ఆయన భిన్నంగా పనిచేశారని ఎనలిస్టులు అంటున్నారు. మీడియా ఫ్రెండ్లీగా పనిచేశారని, తన సహ ఉద్యోగులతో ఎటువంటి గొడవలు పెట్టుకోలేదని చెప్పారు. ఎందుకంటే ఈ రెండేళ్లలో దాస్‌‌పై ఏ రిజర్వ్‌‌ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్‌‌‌‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. ఇంకా చెప్పాలంటే ఈ టైమ్‌‌లో ఆర్‌‌‌‌బీఐ, ప్రభుత్వం కలిసి పనిచేశాయనొచ్చు.

దాస్‌‌ ఏం చేశారు?

దాస్‌‌ ఆర్‌‌‌‌బీఐ గవర్నర్‌‌‌‌గా వచ్చే టైమ్‌‌కి ఫైనాన్షియల్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. ఐఎల్‌‌ అండ్‌‌ ఎఫ్‌‌ఎస్‌‌ సంక్షోభంతో ఎన్‌‌బీఎఫ్‌‌సీ సెక్టార్‌‌‌‌ కుదేలయ్యింది. డబ్బులను సేకరించుకోవడం ఈ కంపెనీలకు కష్టంగా మారింది. వ్యవస్థలో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. గత మూడేళ్లలో కనీసం ఐదు ఫైనాన్షియల్ సంస్థలు రోడ్డున పడగా, వీటిని తిరిగి గాడిలో పెట్టే బాధ్యత ఆర్‌‌‌‌బీఐ తీసుకొంది. దాస్‌‌ పదవిని చేపట్టాక ఐఎల్‌‌ అండ్‌‌ ఎఫ్‌‌ఎస్‌‌, డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌, పీఎంసీ బ్యాంక్‌‌, యెస్‌‌ బ్యాంక్‌‌, లక్ష్మీ విలాస్ బ్యాంకులు దివాలా స్థాయికి పడిపోయాయి. ప్రస్తుతం ఎన్‌‌బీఎఫ్‌‌సీ సంక్షోభం నుంచి ఫైనాన్షియల్ మార్కెట్‌‌ బయటపడింది. యెస్‌‌ బ్యాంక్‌‌ను కాపాడేందుకు స్టేట్‌‌ బ్యాంక్‌‌ను ఆర్‌‌‌‌బీఐ రంగంలోకి దించింది. లక్ష్మీ విలాస్‌‌ బ్యాంక్‌‌ను ఫారిన్ బ్యాంక్ అయిన డీబీఎస్‌‌ బ్యాంక్ విలీనం చేసుకొంది. డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌ రిజల్యూషన్ ప్రాసెస్‌‌ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ కంపెనీని కొనేందుకు బిడ్లు దాఖలవుతున్నాయి.

కరోనా టైమ్‌‌లో ప్రభుత్వం వెంట ఆర్‌‌‌‌బీఐ..

సమస్యలన్ని ఒక్కొక్కటిగా కొలిక్కి వచ్చే టైమ్‌‌కి కరోనా సంక్షోభం దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. కరోనా దెబ్బకు ఎకానమీ, బ్యాంకులు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఈ సంక్షోభం నుంచి ఇండియా రికవరీ అవుతోంది.   ఎకానమీపై కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం, ఆర్‌‌‌‌బీఐ కలిసి చర్యలు తీసుకున్నాయి. వ్యవస్థలో లిక్విడిటీ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు రూ. 8–-9 లక్షల కోట్లను ఆర్‌‌‌‌బీఐ మార్కెట్‌‌లోకి విడుదల చేసింది. వన్‌‌ టైమ్‌‌ లోన్‌‌ రీస్ట్రక్చరింగ్‌‌ స్కీమ్‌‌, ఆరు నెలల పాటు మారటోరియం, ఎమర్జెన్సీ క్రెడిట్‌‌ గ్యారెంటీ లైన్  వంటివి ఒత్తిడిలో ఉన్న సెక్టార్లకు సాయపడ్డాయి. రెండేళ్ల నుంచి ఆర్‌‌‌‌బీఐ మానిటరీ పాలసీలు ప్రభుత్వానికి మద్ధతుగా ఉన్నాయని ఎనలిస్టులు అంటున్నారు. గత 20 ఏళ్లలోనే అత్యంత తక్కువ వడ్డీరేట్లు ప్రస్తుతం ఉన్నాయి.

ఇక ఏం చేస్తరు?

బ్యాంకింగ్‌‌ సెక్టార్లో మార్పులు తెచ్చేందుకు రిజర్వ్‌‌ బ్యాంక్ చర్యలు తీసుకుంటోంది. కార్పొరేట్‌‌ కంపెనీలకు బ్యాంకింగ్‌‌ లైసెన్స్ ఇవ్వాలని ఆర్‌‌‌‌బీఐ ఇంటర్నల్‌‌ వర్కింగ్ గ్రూప్‌‌ రికమండ్‌‌ చేసింది. ఈ అంశంపై చాలా మంది నిపుణుల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఆర్‌‌‌‌బీఐ ఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా డీల్‌‌ చేయాల్సి ఉంది. దీంతో పాటు కరోనా వలన బ్యాంక్‌‌ల మొండిబాకీలు భారీగా పెరిగే అవకాశం ఉంది. వీటిని కంట్రోల్ చేయాలి. 2021 మార్చి నాటికి బ్యాంకుల మొండిబాకీలు 14.7 శాతం పెరుగుతాయని రేటింగ్‌‌ కంపెనీలు అంచనావేస్తున్నాయి. వ్యవస్థలో ద్రవ్యొల్బణం పెరుగుతోంది. ఇప్పటి వరకు ఇన్‌‌ఫ్లేషన్‌‌ను పట్టించుకోకుండా వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్‌‌‌‌బీఐ, ఇక మీదట వడ్డీ రేట్లను తక్కువలో ఉంచుతూనే ఇన్‌‌ఫ్లేషన్‌‌ను కంట్రోల్‌‌ చేయాల్సి ఉంటుంది.