
హాలియా, వెలుగు: ఎమ్మెల్యే నోముల భగత్ శిలాఫలకం లేకుండా బంజారా భవన్‌కు శంకుస్థాపన చేయడమంటే గిరిజనులను అవమానించడమేనని డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ విమర్శించారు. శుక్రవారం హాలియాలో మీడియాతో మాట్లాడుతూ 2018 ఎన్నికల్లో హామీ ఇచ్చిన బంజారా భవన్‌ను మొన్నటి వరకు పట్టించుకోదని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ రాగానే గోడ మీద శిలాఫలకం లేకుండా ఒక గుడ్డను కప్పి శంకుస్థాపన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ప్రోగ్రామ్‌కు ఒక్క గిరిజన ప్రజాప్రతినిధిని కూడా ఆహ్వానించకపోవడం గిరిజనులను మోసం చేయడమేనన్నారు. గిరిజనులంతా ఏకమై నోముల భగత్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. నేతలు ధనావత్ భాస్కర్ నాయక్, రమావత్ శంకర్, పాండు , రమావత్ కృష్ణ నాయక్, మేరావత్ ముని, అనుముల, నాగేందర్, నారాయణ, వెంకటరామ్, లాలు, చిన్న పాల్గొన్నారు.