షీనా బోరా బతికే ఉందట..!

షీనా బోరా బతికే ఉందట..!

ఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణీ ముఖర్జీ మరో ట్విస్ట్ ఇచ్చారు. తన కూతురు షీనా బతికే ఉందని సీబీఐకి లేఖ రాశారు. 2012లో షీనా బోరాను హత్య చేసిన కేసులో నిందితురాలైన ఇంద్రాణీ.. 2015 నుంచి  జైలులోనే ఉన్నారు. తాజాగా ఇంద్రాణీ జైలులో తన కూతురు బతికే ఉందంటూ ట్విస్ట్ ఇచ్చింది. తనతో పాటు జైలులో ఉన్న ఓ మహిళ కాశ్మీర్ లో తాను షీరా బోరాను కలిసినట్లు తనకు చెప్పిందని సీబీఐకి లేఖ రాసింది. అధికారులు వెంటనే కాశ్మీర్ లో ఉన్న షీనా బోరాను వెతికి పట్టుకోవాలని అభ్యర్థించింది. ఇదిలా ఉంటే ఇంద్రాణీ సీబీఐకి లేఖ రాసిన విషయం తనకు తెలియదని ఆమె తరఫు లాయర్ చెబుతున్నారు. 

ఆరేళ్లుగా జైలులో ఇంద్రాణీ
2015లో ఇంద్రాణీ డ్రైవర్ శ్యాంవర్ రాయ్ వద్ద తుపాకీ దొరకడంతో షీనా బోరా హత్య కేసు వెలుగులోకి వచ్చింది. విచారణలో మర్డర్ వెనుక ఇంద్రాణీ హస్తం ఉన్నట్లు తేలడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కేసును సీబీఐకి అప్పగించారు. హత్య కేసుకు సంబంధించి ఇంద్రాణీ ఆరేళ్లుగా ముంబైలోని బైకుల్లా జైలులోనే ఉంది. మరోవైపు షీనా బోరా హత్యకు సంబంధించిన సీబీఐ దర్యాప్తులో అనేక విషయాలు బయటకు వచ్చాయి. తల్లి ఇంద్రాణీ తన రెండో భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శాంవర్ రాయ్ సహకారంతో షీనాను హత్య చేసినట్లు తేలింది. 

అటవీ ప్రాంతంలో షీనా అవశేషాలు
ఇంద్రాణీ మూడో భర్త పీటర్ ముఖర్జియా కుమారుడైన రాహుల్ ముఖర్జియాతో షీనా రిలేషన్ షిప్ లో ఉండటం,  ముంబైలో ఫ్లాట్ ఇప్పించాలని తల్లిని బ్లాక్ మెయిల్ చేయడంతో మర్డర్ కు ప్లాన్ చేసినట్లు సీబీఐ విచారణలో వెల్లడైంది. ఇంద్రాణీ జైలు పాలైన 3 నెలల అనంతరం.. ఆమెకు సాయం చేసిన ఆరోపణలపై పీటర్ ముఖర్జీయాను సైతం అధికారులు అరెస్టు చేశారు. డ్రైవర్ స్టేట్ మెంట్ ఆధారంగా ముంబైకి సమీపంలోని అటవీ ప్రాంతంలో షీనా అవశేషాలను గుర్తించారు. 2017లో కేసు విచారణ ప్రారంభంకాగా.. కోర్టు ఇప్పటి వరకు 60 మంది సాక్ష్యులను విచారించింది. 2019లో ఇంద్రాణీ - పీటర్ ముఖర్జియా తమ 17 ఏళ్ల వైవాహిక బంధానికి తెరదించుతూ విడాకులు తీసుకున్నారు. 2020లో కోర్టు పీటర్ కు బెయిల్ మంజూరు చేసింది.

For more news :

ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఆఫీస్ రిటర్న్ ఇప్పట్లో లేనట్లే..

సర్పంచ్ పదవికి వేలం పాట