మెడికల్ కాలేజీల్లోసార్లు ఏరి?

మెడికల్ కాలేజీల్లోసార్లు ఏరి?
  • ఖాళీగా 1300 అసిస్టెంట్  ప్రొఫెసర్ పోస్టులు
  • రిక్రూట్‌ చేయాలని అధికారుల ప్రతిపాదన
  • గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వని రాష్ట్ర సర్కార్
  • నెల రోజుల్లో మొదలు కానున్న ఎంబీబీఎస్ క్లాసులు

హైదరాబాద్, వెలుగు: ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రక్రియ షురువైంది. మరో నెల రోజుల్లో క్లాసులు కూడా మొదలు కానున్నాయి. కానీ, చదువు చెప్పేందుకు సార్లు మాత్రం సరిపడా లేరు. రాష్ట్రంలో 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే, అన్నింటిలోనూ ప్రొఫెసర్ల కొరత ఉంది. అత్యధికంగా 1301 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండగా, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులు కలిపి మరో 300 వరకు ఖాళీగా ఉన్నాయి. ట్యూటర్, ఇతర అడ్మినిస్ట్రేషన్ పోస్టులు మరో 300 కు పైగా కొరత ఉంది. ఖాళీల భర్తీకి పర్మిషన్ కోరుతూ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగం నాలుగైదు నెలలకిందే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కానీ, ఇప్పటికీ సర్కారు నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉండే జిల్లా హాస్పిటళ్లు, ఏరియా హాస్పిటళ్లలోనూ డాక్టర్ల కొరత పెరిగింది. కాంట్రాక్ట్ బేసిస్‌లో రిక్రూట్‌మెంట్లకు ప్రయత్నించినా డాక్టర్లు చేరడం లేదు. 

తెరపైకి సర్దుబాట్లు
రిక్రూట్‌మెంట్‌కు సర్కార్ సానుకూలంగా లేకపోవడంతో మరోసారి డాక్టర్ల సర్దుబాట్లకు ఆఫీసర్లు తెరలేపారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో పనిచేస్తున్న డాక్టర్లను, మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి, వైద్య విధాన పరిషత్‌ పరిధిలోకి విలీనం చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్న 291 మంది డాక్టర్లను టీచింగ్ హాస్పిటళ్లు, జిల్లా, ఏరియా హాస్పిటళ్లలోకి పర్మినెంట్‌గా బదిలీ(అబ్సర్ప్షన్‌) చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మొత్తం మందిని మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా తీసుకున్నా.. ఇంకా వెయ్యికిపైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగానే ఉంటాయి. ఈ ఎఫెక్ట్‌ విద్యార్థుల చదువుల మీద పడడంతో పాటు, కాలేజీలకు అనుబంధంగా ఉన్న హాస్పిటళ్లకు వచ్చే రోగుల మీద కూడా పడనుంది. 

పీహెచ్‌సీలూ ఖాళీ
ప్రైమరీ హెల్త్ సెంటర్లు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలోనూ 500 డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈసారి పీజీ సీట్ల భర్తీలో ఇన్‌సర్వీస్ వెయిటేజ్ సౌకర్యం కల్పించడంతో పీహెచ్‌సీలలో పనిచేస్తున్న 100 మందికిపైగా ఎంబీబీఎస్ డాక్టర్లు.. స్పెషాలిటీ కోర్సులలో చేరారు. వాళ్లంతా మూడేండ్లపాటు డ్యూటీలకు దూరంగా ఉండనున్నారు. ఇప్పుడు విలీనం పేరుతో మరో 291 మందిని తరలిస్తే ఖాళీల సంఖ్య ఇంకా పెరిగి, పీహెచ్‌సీలలో వైద్య సేవలకు ఆటంకాలు కలిగే ప్రమాదం ఉంది. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయాన్ని వాపస్ తీస్కుని, రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ చేపట్టాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రస్తుతం పీహెచ్‌సీల నుంచి షిఫ్ట్ అవుతున్న డాక్టర్లంతా స్పెషాలిటీ పూర్తి చేసినోళ్లేనని, వాళ్ల సేవలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకునేందుకు పెద్ద దవాఖాన్లకు పంపిస్తున్నామని ఆఫీసర్లు చెబుతున్నారు.

పంపుడే తప్ప నింపుడు లేదు
సేవల వినియోగం పేరుతో పీహెచ్‌సీల నుంచి డాక్టర్లను ఇతర దవాఖాన్లకు పంపిస్తున్నారే తప్ప.. కొత్తగా ఎవరినీ రిక్రూట్‌ చేయట్లేదు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో ఉండే ప్రైమేరీ హెల్త్ సెంటర్లలో మూడేండ్ల నుంచి డాక్టర్లను రిక్రూట్‌ చేయలేదు. 500 ఖాళీల భర్తీకి ఆఫీసర్లు ప్రతిపాదనలు పంపినా.. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఈ నేపథ్యంలోనే డాక్టర్లు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రతిసారి ఇలా పీహెచ్‌సీల నుంచి టీచింగ్ హాస్పిటళ్లకు, జిల్లా హాస్పిటళ్లకు డాక్టర్లను పంపడం వల్ల కొత్తగా ప్రభుత్వ సర్వీస్‌లోకి రావాలనుకుంటున్న స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లకు అవకాశం రావట్లేదని డాక్టర్లు నిరుడు కోర్టుకు కూడా వెళ్లారు.

ఇట్లైతే ఎట్లా?
ఇప్పటికే పీహెచ్‌సీలలో 500కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈసారి ఇన్‌సర్వీస్‌ కోటా కింద 100 మందికిపైగా డాక్టర్లు పీజీ కోర్సుల్లో చేరారు. ఇప్పుడు ఒకేసారి ఇంత మందిని పంపిస్తున్నారు. ఇవన్నీ కలిపి ఖాళీల సంఖ్య ఏడొందలు దాటుతోంది. ఇట్లైతే ప్రైమరీ హెల్త్ సిస్టమ్ ఎలా ఇంప్రూవ్ అవుతది. కొత్తగా అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా గవర్నమెంట్ సర్వీస్‌లోకి రావాలనుకుంటున్న వారికి అవకాశాలు ఎలా వస్తాయి? గతంలో కోర్టులో మేము ఈ విషయాన్ని సవాల్ చేశాం. ప్రభుత్వం ఇప్పుడు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపో మరోసారి కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నాం.
- డాక్టర్ మహేశ్‌, ప్రెసిడెంట్, హెల్త్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్