కార్మికుల కొరత.. స్కిల్డ్ ​లేబర్​ లేక ఇక్కట్లు

కార్మికుల కొరత.. స్కిల్డ్ ​లేబర్​ లేక ఇక్కట్లు

కార్మికుల కొరత కారణంగా తమ లాభదాయకత దెబ్బతింటున్నదని కంపెనీలు అంటున్నాయి. ఒక సర్వేలో పాల్గొన్న వాటిలో 76 శాతం కంపెనీలు ఇదే మాట చెప్పాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి కార్మికులకు ప్రత్యేక ట్రెయినింగ్​ ఇస్తున్నామని, కొత్త టెక్నాలజీలను తెస్తున్నామని తెలియజేశాయి.

న్యూఢిల్లీ :  ఇంజినీరింగ్, ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్, కెమికల్, ఫార్మాస్యూటికల్,  ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాలకు చెందిన కంపెనీలకు నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత పెద్ద సమస్యగా మారింది. వర్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్,  హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ సర్వీస్ ప్రొవైడర్ అల్టిమేట్ క్రోనోస్ గ్రూప్ ఈ విషయమై 300లకుపైగా కంపెనీలతో సర్వే చేసింది. వీటిలో 76శాతం సంస్థలు నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత  2023లో తమ లాభదాయకతను దెబ్బతీసిందని చెప్పాయి. 35శాతం సంస్థ ప్రభావం  తీవ్రంగా  ఉందని, దాదాపు 19శాతం కంపెనీలు తక్కువ ప్రభావం ఉందని, మిగతా 5శాతం మంది ప్రభావం లేదని చెప్పాయి. కార్మికుల కొరత వల్ల 28శాతం సంస్థల్లో కనీసం ప్రతి రెండు వారాలకు ఒకసారి ఉత్పత్తి ఆలస్యం అవుతున్నది.  ఉద్యోగులతో తరచూ ఓవర్​టైం చేయించాల్సి వస్తోందని, లేబర్ షెడ్యూల్ సర్దుబాటు చేయాల్సి ఉంటోందని, అల్టిమేట్ క్రోనోస్‌‌‌‌‌‌‌‌లో కంట్రీ మేనేజర్ సుమీత్ దోషి అన్నారు. దాదాపు 22శాతం సంస్థలు కనీసం ప్రతి రెండు వారాలకు ఒకసారి షిఫ్ట్​లను మార్చడమో, పెంచడమో చేస్తున్నాయి. ఉద్యోగులు రానప్పుడు 29శాతం మంది మేనేజర్లు కనీసం ప్రతి రెండు వారాల్లో ఒక్కసారైనా లేబర్ షెడ్యూళ్లను సర్దుబాటు చేస్తున్నారు. దాదాపు 23శాతం మంది మేనేజర్లు ప్రతి రెండు వారాలకు ఒకసారి ఉద్యోగుల్లో బర్న్‌‌‌‌‌‌‌‌అవుట్ (అలసట,  సామర్థ్యం తగ్గుదల, నిరాసక్తత) సంకేతాలను చూస్తున్నారు.

రాజీనామాలు.. మరో తలనొప్పి

 ఉద్యోగుల రాజీనామాలు (ఆట్రిషన్​) ఎక్కువగానే ఉంటున్నాయి. - సర్వేలో పాల్గొన్న 54 సంస్థల్లో 10–-20శాతం అట్రిషన్ ఉంది. - తయారీ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో ఇదీ ఒకటి. కార్మికుల కొరత వల్ల దాదాపు 72శాతం ఇతర కార్మికులతో ఓవర్ టైం చేయించాల్సి వస్తోంది. గత సంవత్సరంలో వస్తువులు,  సేవల డిమాండ్ పెరిగింది. అప్పటి నుంచి నైపుణ్యం కలిగిన కార్మికులకు డిమాండ్ మరింత పెరిగినా, తగినంత మంది అందుబాటులో లేరు. అధిక డిమాండ్ కారణంగా కంపెనీలు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కంపెనీలు ఈ సమస్యల పరిష్కారానికి చాలా చర్యలు తీసుకుంటున్నాయి.  39శాతం కంపెనీలు ఇంటర్న్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లు,  అప్రెంటిస్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లను అందించడం ద్వారా కార్మికుల నైపుణ్యాలను పెంచుతున్నాయి. సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో 37శాతం మంది తమ శ్రామిక శక్తిని పెంచుకోవడానికి లేదా భర్తీ చేయడానికి టెక్నాలజీలపై ఆధారపడుతున్నట్టు చెప్పాయి. వాటిలో 37శాతం సంస్థలు ఖాళీలను పూరించడానికి తమ ఉద్యోగులకు క్రాస్-ట్రైనింగ్ ఇస్తున్నాయి. పెద్ద బాధ్యతలను నిర్వహించడానికి శిక్షణ పొందిన ఉద్యోగులు సరిపోతారని దాదాపు 94శాతం  సంస్థలు అంగీకరిస్తున్నాయి. కార్మికుల కొరతను పరిష్కరించడానికి కంపెనీలు తీసుకున్న కొన్ని చర్యల్లో... మెంటార్లను కేటాయించడం (25శాతం), థర్డ్-పార్టీ కాంట్రాక్ట్ కార్మికులను నియమించుకోవడం (33శాతం), టెక్నికల్ లేదా కమ్యూనిటీ కాలేజీలతో భాగస్వామ్యం (37శాతం)   మహిళలను నియమించుకోవడం (26శాతం) వంటివి ఉంటున్నాయి.