
టీమిండియా వన్డే కెప్టెన్సీపై ప్రస్తుతం చర్చ సాగుతుంది. 50 ఓవర్ల ఫార్మాట్ కు రోహిత్ శర్మ కెప్టెన్ గా కొనసాగుతున్నప్పటికీ ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకొని హిట్ మ్యాన్ స్థానంలో వేరొకరికి సారధ్య బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ చూస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే వన్డే వైస్ కెప్టెన్ గా ఉంటున్న శుభమాన్ గిల్ కు కెప్టెన్సీ దక్కాలి. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం వన్డే పగ్గాలు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ కు అప్పజెప్పాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. బీసీసీఐ తీసుకోబోతున్న ఈ నిర్ణయానికి కారణం లేకపోలేదు.
నిన్నటివరకు శుభమాన్ గిల్ ఆల్ ఫార్మాట్ కెప్టెన్ గా బాధ్యతలు ఇవ్వాలని బీసీసీఐ చూస్తున్నట్టు సమాచారం. ఆసియా కప్ కు గిల్ ను టీ20 వైస్ కెప్టెన్ గా ప్రకటించి బీసీసీఐ పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది. మూడు ఫార్మాట్ లలో గిల్ కు బాధ్యతలు అప్పగిస్తే పనిభారం ఎక్కువ అవుతుందని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుత క్రికెట్ క్యాలెండర్ ప్రకారం అన్ని ఫార్మాట్లకు ఒకే ఆటగాడిని కెప్టెన్‌గా చేయడం సాధ్యం కాదని బీసీసీఐ వర్గాలు వివరించాయి. ఏడాది పొడవునా టోర్నమెంట్లు, టూర్ లు ఉండడంతో మూడు ఫార్మాట్లకు ఒకరినే కెప్టెన్ గా నియమించడం అతనికి శక్తికి మించిన పని అవుతుందని బోర్డు భావిస్తోంది.
ALSO READ : సెప్టెంబర్ 4న దుబాయ్‌కు టీమిండియా
గిల్ ప్రస్తుతం టెస్ట్ కెప్టెన్ గా జట్టును నడిపిస్తున్నాడు. 2026 టీ20 వరల్డ్ కప్ తర్వాత సూర్య స్థానంలో కెప్టెన్సీ చేపట్టడం దాదాపుగా ఖాయమైంది. మరోవైపు అయ్యర్ కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. అతడికి టెస్ట్, టీ20 జట్టులో చోటు దక్కడం లేదు. ఒక్క ఫార్మాట్ కావడంతో 50 ఓవర్ల ఫార్మాట్ లో శ్రేయాస్ కు సారధ్య బాధ్యతలు అప్పగిస్తే అంతా సెట్ అనే ఆలోచనలో బీసీసీఐ ఉంది. అయ్యర్ కు వన్డేల్లో మంచి రికార్డ్ ఉంది. 30 ఏళ్ల అయ్యర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఐదు మ్యాచ్‌ల్లో (15, 56, 79, 45,48) 243 పరుగులు చేసి నిలకడగా రాణించాడు. ఐపీఎల్ లోనూ పంజాబ్ కింగ్స్ ను తన కెప్టెన్సీతో ఫైనల్ కు చేర్చాడు.
శ్రేయాస్ అయ్యర్ కు ఇటీవలే ఆసియా కప్ లో చోటు దక్కని సంగతి తెలిసిందే. అయ్యర్ ఐపీఎల్ 2025 సీజన్ లో అత్యద్బుత్యంగా రాణించాడు. 175 స్ట్రైక్ రేట్ తో 600 పరుగులు చేశాడు. కెప్టెన్ గాను రాణించి జట్టును ఫైనల్ కు చేర్చాడు. కంబ్యాక్ ఇవ్వడం గ్యారంటీ అనుకున్నా జట్టులో చోటు సంపాదించలేకపోయాడు. వన్డే కెప్టెన్సీ ఇస్తే అతనికి బీసీసీఐ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టే. బీసీసీఐ వన్డే కెప్టెన్సీ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.