మహిళా సంఘం కృషితో కాలనీని మార్చేశారు

మహిళా సంఘం కృషితో కాలనీని మార్చేశారు

‘కాళ్లకుంట’ కాలనీ… ఒకప్పుడు ఈ పేరు చెబితే అందరికి చిన్న చూపు. సిద్దిపేట మున్సిపాలిటీలో ఒక మూలకు విసిరివేసినట్టు
ఉంటుంది . ఇప్పుడు అదే కాలనీ అందరినోళ్లలో నానుతోంది. మహిళా సంఘం కృషితో కాలనీ రూపురేఖలు పూర్తిగా మారాయి. వారి ప్రయత్నంతో ఏకంగా జాతీయ అవార్డు వరించింది. కాళ్లకుంట కాలనీ పేరు వినిపిస్తే .. ఇప్పుడు ప్రత్యేక గౌరవభావం కలుగుతుంది.

సిద్దిపేట , వెలుగు: సిద్దిపేట పట్టణానికి  ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ కాలనీ. రెండు వేల ఐదు వందల ఇళ్లున్నాయి. దాదాపు ఏడు వేల మంది జనాభా ఉంది. 2008లో ఏర్పాటైన ‘విపంచి స్లమ్‌‌ సమాఖ్య’ అందరిని జాగృతం చేసి ‘ఆదర్శ కాలనీ’గా తీర్చిదిద్దింది. వివిధ కార్యక్రమాలను చేపట్టి, కాలనీవాసులను ఏకం చేసింది. సామాజికాంశాలతో అవగాహన కల్పించి, ప్రజల జీవనాన్ని మార్చింది. దీనికితోడు ‘మెప్మా’ తోడవడంతో మరింత అభివృద్ధి చెందింది. ‘విపంచి స్లమ్‌‌ సమాఖ్య’లో ప్రస్తుతం మూడు వందల మంది సభ్యులు  ఉన్నారు. వీళ్లంతా కాలనీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు.

ఎన్నో ఏళ్ల కృషి…

ఒకప్పుడు ఈ కాలనీలో ఎక్కడ వేసిన చెత్తాచెదారం అక్కడే ఉండేది. దాంతో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. బహిర్భూమికీ ఆరుబయటకు వెళ్లేవాళ్లు. తాగునీరు, విద్య, వైద్యం వసతులు కూడా అంతంతమాత్రమే.. ఇవన్నీ పూర్తిగా మార్చింది ‘విపంచి స్లమ్‌‌ సమాఖ్య’.  కాలనీ సమావేశాలు నిర్వహించి హరితహారం, తడిపొడి చెత్త సేకరణ వంటి అంశాల గురించి వివరించడమే కాకుండా కాలనీలో మరుగుదొడ్ల నిర్మాణానికి కూడా నడుం బిగించింది. ఎవరూ ముందుకు రాకపోవడంతో  ప్రత్యేక నిధులు కేటాయించింది. నూట నలభై ఆరు మరుగుదొడ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేసింది. నీటి వినియోగం, స్వయం ఉపాధి పథకాలకు రుణాలకు సహకరించడం, ప్లాస్టిక్‌‌ వినియోగం తగ్గించడం వంటి కార్యక్రమాలపై అవగాహన కల్పించింది. దాంతో అభివృద్ధి పట్టాలెక్కింది. ‘విపంచి స్లమ్‌‌ సమాఖ్య’ ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తుందంటే .. ఇప్పడు వందల మంది కాలనీ వాసులు కదలివస్తారు. అందరూ ఒక్కటై విశ్రాంతి లేకుండా శ్రమిస్తారు.

ఇంటింటికి ఐదు మొక్కలు

కాలనీ బాగుండాలంటే.. ముందుగా మొక్కలు నాటాలి. అప్పుడే కాలనీ పచ్చగా ఉంటుందని భావించింది. అందుకే ప్రతి ఇంటికి ఐదు మొక్కలను అందజేసి ‘హరితహారం’ కార్యక్రమాన్ని విజయవంతం చేసింది. ప్రస్తుతం కాలనీలో ఏ వీధి చూసినా ప్రతి ఇంటి ముందు  మొక్కలు కనిపిస్తాయి. ఐదేళ్ల కాలంలో పది వేల మొక్కలను నాటారు. ప్లాస్టిక్​ వాడకం కూడా పూర్తిగా నిషేధించి, అది అమలు జరిగేలా జాగ్రత్త పడ్డారు.

జాతీయ అవార్డుకు ఎంపిక

దశాబ్ద కాలంగా.. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుండటం.. ‘విపంచి స్లమ్‌‌ సమాఖ్య’ అవగాహన కల్పిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ‘జాతీయ స్వచ్ఛత ఎక్సలెన్సీ’ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రమంత్రి హరిదీప్‌‌ సింగ్‌‌ పురి చేతుల మీదుగా ‘విపంచి  స్లమ్‌‌ సమాఖ్య’ సభ్యులు అవార్డు అందుకున్నారు. ఒకప్పుడు  కాలనీ పేరెత్తడానికి కూడా ఇష్టపడని వాళ్లు, ఇప్పుడు  కాలనీవాసుల కృషిని అభినందిస్తున్నారు.