ఎన్నో అందాలు దాచుకున్న సిక్కిం

ఎన్నో అందాలు దాచుకున్న సిక్కిం

భారతదేశంలో రెండవ అతిచిన్న రాష్ట్రమైన సిక్కిం ఎన్నో అందాలు దాచుకుంది. తెల్లని దుప్పటి పరచుకున్న హిమాలయాలు, అందమైన సరస్సులు, బౌద్ధారామాలు, రంగురంగుల పూదోటలతో మనసు దోచే సిక్కిం ప్రాంతాన్ని ఒక్కసారైనా చూడాలనుకుంటారు చాలామంది. అలానే అనుకున్నారు విజయవాడలోని ‘సిద్ధార్థ వాకర్స్ క్లబ్ ‌‌ ‌‌’ మెంబర్స్ కూడా. ఎన్నో అనుభూతులను మిగిల్చిన వాళ్ల సిక్కిం టూర్ విశేషాలు ఆ టూర్ ‌‌కెళ్లిన సూరపనేని దుర్గా ప్రసాద్ మాటల్లో..
 
పోయిన ఏడాది నవంబర్ 6, ఉదయం ఏడుంబావుకి విజయవాడలో మా ప్రయాణం మొదలైంది. కోల్​కతా చేరుకుని, అక్కడి నుంచి గ్యాంగ్​టక్, డార్జిలింగ్ మీదుగా తిరిగి కోల్​కతా రావడంతో టూర్ ముగిసింది. మేము మా మొదటిరోజున విజయవాడలో విమానం ఎక్కి, అదే రోజు మధ్యాహ్నం 3.20 గంటలకు బెంగాల్ ‌‌ ‌‌లోని బాగ్ ‌‌ ‌‌డోగ్రాకు చేరుకున్నాం. అక్కడి నుంచి 12 కి.మీ దూరంలో ఉన్న సిలిగురి మీదుగా గ్యాంగ్​టక్ చేరుకోవడానికి ట్యాక్సీలు ఎక్కాం. ఐదు గంటల జర్నీ తర్వాత, సిక్కిం రాజధాని గ్యాంగ్ ‌‌ ‌‌టక్ ‌‌ ‌‌కు రాత్రి తొమ్మిది గంటలకు చేరుకున్నాం. అక్కడ ‘మహాత్మా గాంధీ మార్గ్’ లోని ఒక హోటల్​లో బస చేశాం. మరుసటి రోజు కోసం ఉత్సాహంతో ఎదురుచూస్తూ ఆ రోజు రాత్రి నిద్రపోయాం.

చార్​ధామ్ టెంపుల్

రెండో రోజు ఉదయం ఏడు గంటలకే లేచి, మహాత్మా గాంధీ మార్గ్​లో కాసేపు నడిచాం. తర్వాత గ్యాంగ్​టక్​కు 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న చార్​ధామ్ టెంపుల్​కు బయలుదేరాం. దూరంగా హిమాలయాలు, మధ్యలో అందమైన రోడ్లతో సిక్కిం చాలా అందంగా ఉంది. కొద్దిసేపు జర్నీ చేసిన తర్వాత నామ్​చి సిటీలో ఉన్న చార్​ధామ్​కు చేరుకున్నాం. అదొక ఆలయాల సముదాయం. దీన్ని 2011లో కట్టారు. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలతో పాటు, బద్రీనాథ్, పూరి, రామేశ్వరం, ద్వారక ఆలయాల నమూనాలు ఉంటాయి. అక్కడ దర్శనం చేసుకుని, 25 కి.మీ దూరంలో ఉన్న బుద్ధ పార్కుకి బయలుదేరాం. దక్షిణ సిక్కిం జిల్లాలోని రావంగ్లాకు దగ్గర్లో ఉన్న ఈ అద్భుతమైన పార్కులో 130 అడుగుల ధ్యాన బుద్ధ విగ్రహం ఉంది. అది చూసిన వాళ్లు మంత్రముగ్ధులు కావాల్సిందే. ఈ విగ్రహాన్ని14వ దలైలామా ప్రతిష్ఠించారు. విశాలమైన ఆలయాన్ని చూసి, తిరిగి హోటల్​​కి చేరుకుని, రాత్రంతా విశ్రాంతి తీసుకున్నాం.

ఆక్సిజన్ ఇబ్బందులు

మూడో రోజు పొద్దున్నే హోటల్​లో టిఫిన్ చేసి సముద్ర మట్టానికి సుమారు 14,200 అడుగుల ఎత్తులో ఉన్న ‘ఓల్డ్ సిల్క్ రోడ్’ మీదుగా నాథులా పాస్​ ‌‌కు బయలుదేరాం. ఇది గ్యాంగ్​టక్ నుంచి 48 కి.మీ. దూరంలో ఉన్నప్పటికీ, వెళ్లడానికి రెండున్నర గంటలు పట్టింది. నాథులాకు వెళ్లే దారిలో, యాక్స్ (జడల బర్రెలు) ఎక్కి కొన్ని ఫొటోలు దిగాం. రూ.200 కట్టి యాక్ స్వారీ కూడా చేయొచ్చు. నాథులాపాస్ ఎంతో ఎత్తులో ఉండడం వల్ల ఆక్సిజన్ తక్కువగా అందుతుంది. దానివల్ల శ్వాస ఆడక ఇబ్బంది పడాల్సి వచ్చింది. అక్కడి నుంచి చైనా సరిహద్దు కనిపిస్తుంది. మానస సరోవరానికి వెళ్లే దారి, భూటాన్​ ‌‌లోని ఎత్తైన శిఖరం ‘చుంబి లహ్రీ’ని కూడా ఇక్కడి నుంచి చూడొచ్చు. నాథులాపాస్​ ‌‌కి వెళ్లే దారిలో ప్రతిచోటా సైనిక శిబిరాలు కనిపిస్తాయి. ఆర్మీ వాళ్లు టూరిస్టులతో ఫ్రెండ్లీగా ఉంటారు. ఆల్టిట్యూడ్ సిక్​నెస్ కారణంగా మా టీంలో కొందరి హెల్త్ పాడవ్వడంతో ఆ రోజు హోటల్​కు వచ్చేశాం.

గ్రీన్ సిటీ గ్యాంగ్​టక్ 

నాలుగో రోజు గ్యాంగ్​టక్ ‌‌ ‌‌లోని ‘లింగ్డమ్ బౌద్ధారామం’కి వెళ్లాం. ఇది హిమాలయ అడవుల్లో కట్టిన విశాలమైన సముదాయం. ఇక్కడ శిల్పకళ గొప్పగా ఉంటుంది. ఆ గర్భగుడిలో కొంతసేపు ధ్యానం చేశాం. చాలా ప్రశాంతంగా అనిపించింది. మా వాళ్లు అక్కడ షాపింగ్ కూడా చేశారు. చాలా కష్టంమీద ఆశ్రమాన్ని విడిచిపెట్టాం. ఐదో రోజు గ్యాంగ్​టక్ సిటీని చూడడానికి వెళ్లాం. సిక్కింలో అదే మా ఆఖరి రోజు. సిక్కిం పూర్తిగా పర్వత ప్రాంతం. చక్కగా, శుభ్రంగా ఉంది. ముఖ్యంగా గ్యాంగ్​టక్.. ప్లాస్టిక్ ఫ్రీ సిటీ. అక్కడ లా అండ్ ఆర్డర్ పక్కాగా ఉంది. ఎలాంటి గొడవలు లేవు. పార్కింగ్ ఇబ్బందులు లేవు. అల్మరాలో పుస్తకాలు పేర్చినట్లుగా రోడ్డు పక్కన కార్లు నీట్​గా పార్క్ చేసి ఉన్నాయి. కొండలపై చదును చేసిన ప్రాంతాల్లో చిన్న చిన్న ఇళ్లు ఎంతో అందంగా కట్టుకున్నారు సిక్కిం ప్రజలు. ఆ రోజు సిక్కింకు వీడ్కోలు చెప్తుంటే మనసు భారంగా అనిపించింది. 

డార్జిలింగ్​లో సూర్యోదయం

ఆరో రోజు ఉదయాన్నే డార్జిలింగ్​కు మా ప్రయాణాన్ని మొదలుపెట్టాం. మధ్యాహ్నం 12.45 గంటలకు డార్జిలింగ్​లోని హోటల్​కి చేరుకున్నాం. ముందుగా డార్జిలింగ్ శాంతి పగోడాకు వెళ్లాం. 1945లో హిరోషిమా, నాగసాకిపై జరిగిన నరమేధాన్ని చూసి చలించిపోయిన మహాత్మా గాంధీ శిష్యుడు ఫుజీ దీన్ని నిర్మించాడు. ప్రపంచశాంతికి చిహ్నంగా ఆయన రెండు శాంతి పగోడాలను కట్టాడు. ఒకటి జపాన్​లోని కుమామోటోలో ఉంటే మరొకటి డార్జిలింగ్​లో ఉంది. అవి చూసిన తర్వాత డార్జిలింగ్ జూకి వెళ్లాం. అక్కడ రాయల్ బెంగాల్ టైగర్, చిరుతపులి, నల్ల చిరుతపులి, స్నో లెపర్డ్, హిమాలయన్ తోడేళ్ళు, హిమాలయన్ ఎలుగుబంటి లాంటివి చూశాం. అయితే గ్యాంగ్​టక్ ఉన్నంత శుభ్రంగా డార్జిలింగ్ లేదు. ఇరుకుగా, ఎక్కడ చూసినా చెత్త ఉంది. 

బంగారు కాంచనజంగ

డార్జిలింగ్​కు వచ్చే చాలామంది టూరిస్టులు 8,482 అడుగుల ఎత్తులో ఉన్న టైగర్ హిల్స్​లో సూర్యోదయాన్ని చూసేందుకు వస్తారు. మరుసటి రోజు మేం కూడా అదే ప్లాన్ చేశాం. ఏడో రోజు పొద్దున్నే టైగర్ హిల్స్​కు బయల్దేరాం. అక్కడ సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు కాంచనజంగ శిఖరం.. బంగారం రంగులోంచి వెండి రంగులోకి మారడాన్ని చూస్తుంటే ఎంతో అద్భుతంగా అనిపించింది. ఆ తర్వాత కాస్త రెస్ట్ తీసుకుని కోల్​కతాకు తిరుగు ప్రయాణమయ్యాం. రాత్రి తొమ్మిది గంటలకు కోల్​కతాకు పడాటిక్ ఎక్స్​ప్రెస్ ‌‌ ఎక్కాం. అలా డార్జిలింగ్​కు బైబై చెప్పాం.

కోల్​కతా మెమరీస్

ఎనిమిదో రోజు ఉదయం ఏడు- గంటలకు కోల్​కతాలోని సీల్దా స్టేషన్​లో దిగాం. కోల్​కతా నగర రణగొణ ధ్వనుల మధ్య హోటల్​కు చేరుకునేసరికి ఉదయం తొమ్మిది గంటలైంది. బస్సు ఎక్కి విక్టోరియా మెమోరియల్, హౌరా బ్రిడ్జి చూస్తూ న్యూ మార్కెట్ ‌‌ ‌‌లో ఆగాం. 1983–84లో ఇండియన్ బ్యాంక్ ప్రొబెషనరీ ఆఫీసర్​గా కోల్​కతాలో ఆరు నెలలు పనిచేశా. జనాభా పెరగడం మినహా కోల్​కతాలో పెద్దగా మార్పు ఏమీ లేదు. బెంగాలీలు ఎప్పటిలాగే వీధి మూలల్లోని టీ షాపుల్లో కూర్చుని, గంటల తరబడి మాట్లాడుకుంటున్నారు. రోడ్డు పక్కన ఉన్న గుడిసెలు, ఆరు బయట స్నానం చేయడం, రోడ్డుపైనే వంట చేయడం లాంటివి ఇక్కడ కామన్. నా పాత జ్ఞాపకాలు అన్నీ ఒకసారి కళ్లముందు మెదిలాయి.

చివరి రోజు

తొమ్మిదో రోజు మా టూర్​లోని చివరి రోజు. ఉదయాన్నే లేచి, హూగ్లీ నది ఒడ్డున ఉన్న దక్షిణేశ్వర్, రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యాలయమైన బేలూరు మఠాలకు వెళ్లాం. భోజనం చేశాక, సిటీలో షాపింగ్​కి వెళ్లి, సాయంత్రానికి హోటల్​కి తిరిగొచ్చాం. మరుసటి రోజు విజయవాడకు చేరుకోవడంతో మా టూర్ ముగిసింది.” 

సందడిగా గడిపాం

ఫ్లైట్ టికెట్లు ముందుగానే బుక్ చేసుకోవడంతో తక్కువ ఖర్చుతోనే టూర్ పూర్తయింది. ఈ టూర్​కు మనిషికి 28 వేల రూపాయలు ఖర్చు అయింది. అన్నిచోట్లా  ట్రాన్స్​పోర్ట్, హోటల్స్ లాంటివి ముందుగానే బుక్ చేసుకున్నాం. కోల్​కతాలో మా కోసం హోటళ్లు, ట్యాక్సీలను రెడీ చేసి, మాకు అన్నిరకాలుగా సాయం చేసిన నారాయణరావుకి థ్యాంక్స్ చెప్పినా తక్కువే. మా టీంలో కొంతమంది అనారోగ్యంతో ఇబ్బంది పడినప్పటికీ మొత్తంగా అందరం కలిసి చాలా సందడిగా, ఆనందంగా గడిపాం. నాథులా పాస్​లో చలికి వణుకుతూ కొత్త ప్రదేశాలను ఎంజాయ్ చేశాం. బెంగాల్, సిక్కిం రాష్ట్రాల వంటకాలు రుచి చూశాం. సిక్కిం నిజంగా ఓ స్వర్గం. సిక్కిం టూర్.. మాలోని ప్రతి ఒక్కరికీ శాశ్వతమైన మధురానుభూతులను మిగిల్చింది. దేశం మొత్తం ఏదో ఒక రోజు సిక్కింలా  శుభ్రంగా అవుతుందని నేను నమ్ముతున్నా.