సింగరేణి సూపర్ ​బజార్ ​సేవలు బంద్

సింగరేణి సూపర్ ​బజార్ ​సేవలు బంద్
  •    జిల్లాలో నాలుగు చోట్ల మూతబడ్డ కేంద్రాలు 
  •     నిత్యావసరాలకు అవస్థలు పడుతున్న సింగరేణి ఉద్యోగులు
  •     ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన
  •     రీ ఓపెన్ పై దృష్టిపెట్టని యాజమాన్యం

కోల్​బెల్ట్, వెలుగు : సింగరేణి సంస్థలో పనిచేసే ఉద్యోగులు, అధికారులకు నిత్యావసరాలు అందించేందుకు ఏర్పాటు చేసిన సింగరేణి సూపర్​బజార్లు వరుసగా మూతపడుతున్నాయి. కార్మికులకు క్రెడిట్​పై క్వాలిటీ నిత్యావసరాలు, ఇతర హోంనీడ్స్​అందించేవారు. కానీ కొద్ది కాలంగా సూపర్​బజార్లలో 60 శాతం వరకు సరుకులను అందుబాటులో ఉంచడంలేదు. ఇప్పటికే వివిధ కాలనీల్లో నెలకొల్పిన 30 మినీ సూపర్​బజార్లను మేనేజ్​మెంట్ మూసివేయగా ఇప్పుడు ఏరియా వైజ్​గా ఉండేవాటిని మూసివేస్తున్నారు. శ్రీరాంపూర్, జైపూర్​ఎస్టీపీపీ(సింగరేణి థర్మల్​పవర్​ ప్లాంట్), బెల్లంపల్లి పట్టణం

ఆ ఏరియాలోని గోలేటిలో ఉన్న ఏరియా స్థాయి సూపర్​బజార్లను క్లోజ్​చేశారు. దీంతో సింగరేణి కార్మికులు, కార్మికేతర కుటుంబాలకు బహిరంగ మార్కెట్​కన్నా తక్కువ ధరలకు క్వాలిటీ సరుకులు అందకుండా పోతున్నాయి. అధికారుల లోపభూయిష్టమైన విధానాలు, సిబ్బంది చేతివాటంతో నష్టాలు రావడం.. అమ్మకాలు తగ్గడం.. సిబ్బంది కొరత మూసివేతకు కారణమవుతోంది.

50 ఏండ్ల క్రితం సేవలు షురూ.. 

సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు కావాల్సిన నిత్యావసర వస్తువులు తక్కువ ధరకు అందించాలనే ఉద్దేశంతో యాజమాన్యం1974లో కోఆపరేటివ్​సొసైటీ కింద సూపర్​బజార్లను ఏర్పాటు చేసింది. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్, జయశంకర్​ భూపాలపల్లి, పెద్దపల్లి, ఖమ్మం, భద్రాది కొత్తగూడెం జిల్లాల్లో మొత్తం 26 సూపర్​బజార్లను స్టార్ట్​ చేసింది. నిత్యావసరాలతో పాటు కాస్మోటిక్స్, ఎలక్ట్రానిక్​పరికరాలు, దుస్తులతో పాటు ప్రతి ఒక్క వస్తువు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసింది.

సింగరేణి బొగ్గు గనులు, విభాగాలపై నిర్వహించే క్యాంటీన్లకు సైతం వీటి నుంచే అవసరమైన సరుకులు సప్లై చేసేవారు. సూపర్​బజార్లలో కార్మికులకు ప్రతి నెలా రూ.15వేల వరకు అరువుపై సరుకులు సరఫరా చేసే అవకాశం ఉండటంతో చాలా మంది వీటిపైనే ఆధారపడేవారు.

సిబ్బంది చేతివాటం, పర్యవేక్షణ లోపమే కారణం

ఈ సూపర్​బజార్లలో మూసివేతకు అందులో పనిచేసే సిబ్బంది చేతివాటమే ప్రధాన కారణమని తెలుస్తోంది. భారీగా అవకతవకలకు పాల్పడుతుండడంతో లక్షల్లో నష్టాలు చవిచూసి మూసివేస్తున్నట్లు సమాచారం. రామకృష్ణాపూర్ సింగరేణి సూపర్​బజార్​లోని గ్యాస్​కౌంటర్​లో  2022 ఏప్రిల్​లో రూ.40లక్షల వరకు స్కామ్​జరిగినట్లు ఆడిట్ ఆఫీసర్లు గుర్తించారు. గ్యాస్​సేల్స్​మెన్, సూపర్​మార్కెట్​ప్రొవిజన్​ కౌంటర్​బాధ్యుడితో పాటు మరొకరి పాత్ర ఉందని గుర్తించి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈ స్కామ్ జరిగిన టైమ్​లోనే శ్రీరాంపూర్ కృష్ణాకాలనీ కౌంటర్​దహనమైన ఘటనపై పలు అనుమానాలు తలెత్తాయి.

అక్కడ జరిగిన అక్రమాలు బయటపడకుండా కావాలనే తగలబెట్టారనే ప్రచారం జరిగింది. ఇక్కడ రూ.4లక్షల కుంభకోణం జరగ్గా 2022 జూన్​లో అదే ఏరియా పరిధిలో మరో ఇద్దరు రూ.6 లక్షల వరకు సొంతానికి వాడుకున్నట్లు గుర్తించారు. గతంలో మందమర్రి సూపర్​బజార్​లో సేల్స్​మెన్​రూ.12లక్షల స్కామ్ కు పాల్పడ్డాడు. బెల్లంపల్లిలో కూడా సేల్స్​మెన్​లు, ఇతర సిబ్బంది ఇదే తరహాలో అవకతవకలకు పాల్పడటం సూపర్​బజార్ మూసివేతకు కారణమని తెలుస్తోంది. పర్యవేక్షణ లోపం కారణంగా ఈ ఈ అవకతవకలు జరగ్గా.. వీటిని అరికట్టాల్సిన సింగరేణి యాజమాన్యం అలాంటి చర్యలు చేపట్టకుండా సూపర్​బజార్లనే మూసివేస్తోంది. ఫలింగా కార్మికులు, ఉద్యోగులు నిత్యావసరాలకు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉన్నతాధికారులు పునరాలోచించి వాటి రీఓపెన్​పై దృష్టి పెట్టాలని వారు కోరుతున్నారు.

ఒకదాని తర్వాత మరొకటి మూసేస్తూ..

జైపూర్​ సింగరేణి థర్మల్​ పవర్​ ప్లాంట్​లో 2022 ఆగస్టులో రూ.25లక్షల వ్యయంతో ఎస్టీపీపీలోని క్వార్టర్​లో సూపర్​బజార్​ను ప్రారంభించింది. సింగరేణి ఉద్యోగులు, ఆఫీసర్ల కుటుంబాలతో పాటు పవర్ ​మెక్​ప్రైవేటు కంపెనీ కార్మికులు నిత్యావసరాలు ఇక్కడే కొనుగోలు చేశారు. 6 నెలలు మాత్రమే ఆ సూపర్​బజార్​ను నడిపిన యాజమాన్యం 2023 ఫిబ్రవరిలో హడావిడిగా మూసేసింది. దీంతో ఆ పవర్ ప్లాంట్​లోని పనిచేసే ఉద్యోగులు, ఆఫీసర్లు, కాంట్రాక్ట్​ కార్మికులు నిత్యావసరాల కోసం శ్రీరాంపూర్, సీసీసీ, మంచిర్యాల, గోదావరిఖనికి వెళ్లి వస్తూ ఇబ్బందులు పడుతున్నారు.

దూర ప్రాంతాల్లో ఉన్న పట్టణాలకు సరుకుల కోసం డ్యూటీ వదులుకొని వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. నష్టాలు వస్తున్నాయని శ్రీరాంపూర్​ కాలనీలోని సూపర్​బజార్ ను గతంలోనే యాజమాన్యం మూసేసింది. ఇక బెల్లంపల్లి పట్టణ ప్రజలకు సేవలందిస్తున్న సూపర్​బజార్​ను గతేడాది అక్టోబర్​లో, అందే ప్రాంతం గోలేటిలోని సూపర్​బజార్​ను సైతం గతం​లోనే యాజమాన్యం బంద్​ పెట్టింది.