సెగ్మెంట్ రివ్యూ : వికారాబాద్​ విజేత ఎవరు? .. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ

 సెగ్మెంట్ రివ్యూ : వికారాబాద్​ విజేత ఎవరు? ..  బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ
  • ఎమ్మెల్యే తీరుపై పార్టీని వీడిన గులాబీ నేతలు 
  •   ప్రధాన లీడర్లంతా కాంగ్రెస్​లో చేరగా పెరిగిన బలం
  • చంద్రశేఖర్ పార్టీ మార్పుతో పట్టు కోల్పోయిన బీజేపీ 

హైదరాబాద్, వెలుగు :  హైదరాబాద్ రాష్ట్రంలో 1952లో వికారాబాద్‌‌ ద్విసభ్య నియోజకవర్గంగా ఉంది. జనరల్‌‌, ఎస్సీ రిజర్వేషన్లు ఉండేవి. జనరల్‌‌లో స్వతంత్ర అభ్యర్థిగా దివంగత మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి, ఎస్సీ అభ్యర్థి అరిగె రామస్వామి ఇద్దరూ గెలిచారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో14 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇది ఒకటి. తెలంగాణ  వచ్చాక 2016లో వికారాబాద్‌‌ కేంద్రంగా కొత్త జిల్లా ఆవిర్భవించింది. ఇందులో వికారాబాద్‌‌, తాండూరు, పరిగి, కొడంగల్‌‌ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 

వికారాబాద్ సెగ్మెంట్ పరిధిలో   వికారాబాద్‌‌, మోమిన్‌‌పేట, ధారూరు, బంట్వారం, మర్పల్లి, కోట్‌‌పల్లి మండలాలు ఉన్నాయి. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్​లో  బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ అభ్యర్థి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, కాంగ్రెస్​ ​నుంచి గడ్డం ప్రసాద్​కుమార్, బీజేపీ నుంచి నవీన్ కుమార్ పోటీలో నిలిచారు. అయితే, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే పోటీ నెలకొంది. 

వర్గపోరుతో బీఆర్ఎస్ సతమతం

ప్రస్తుత అభ్యర్థి ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ లీడర్లను పెద్దగా పట్టించుకోవడం లేదని ఇటీవల చాలా మంది నేతలు బీఆర్ఎస్​ను వీడారు. ఇందులో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నరోత్తం రెడ్డి, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ కొండల్ రెడ్డి, వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల,  వైస్ చైర్మన్ షంషద్ ముత్తాహర్ షరీఫ్, పలువురు కౌన్సిలర్లు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్ లు, కార్యకర్తలు కాంగ్రెస్​లో చేరారు. అనంతగిరిని తెలంగాణ ఊటీ చేస్తామని సీఎం కేసీఆర్​తో పాటు అందరు నేతలు ప్రకటించారు. నేటికీ హామీని నెరవేర్చలేదు. 

అధికార పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఉన్న అసంతృప్తులను బుబ్జగించేందుకు మెతుకు ఆనంద్‌‌ను గెలిపించే బాధ్యతను అధిష్ఠానం చేవెళ్ల ఎంపీ రంజిత్‌‌రెడ్డికి అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన ఆయన పార్టీలో అందరినీ సమన్వయం చేసుకుంటూ..అసమ్మతి నేతల ఇండ్లకు వెళ్లి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేసేలా ఒప్పిస్తున్నారు.  కాగా.. ఆనంద్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అంతటా పర్యటించాల్సి ఉండగా ప్రస్తుత పరిస్థితుల్లో సెగ్మెంట్​ను దాటడం లేదు. 

మరోవైపు మంత్రి మహేందర్ రెడ్డి, మెతుకు ఆనంద్ మధ్య ఎప్పటి నుంచో వర్గపోరు నడుస్తుంది. ప్రస్తుతం ఇద్దరూ ఒక్కటైనప్పటికీ మహేందర్ రెడ్డి వర్గం ఎంతవరకు సహకరిస్తుందనేది చెప్పలేం. ప్రభుత్వ పథకాలు, సీఎం కేసీఆర్ పైనే బీఆర్ఎస్ గెలుపు నమ్మకం పెట్టుకోగా.. ఎన్నికల ఫలితాల తర్వాతే తెలుస్తుంది. 

 జిల్లాకు చెందిన నేత సీఎం అవుతాడని ప్రచారం 

ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్​కు 2014,2018లో రెండుసార్లు ఓడిన సెంటిమెంట్ తో పాటు ప్రస్తుత ఎమ్మెల్యే మెతుకు ఆనంద్​కు వ్యతిరేక వర్గం నేతలు హస్తం గూటికి చేరడం కలిసొస్తుందనే చర్చ జరుగుతుంది. ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు కూడా కాంగ్రెస్​కు పడతాయని పార్టీ అభ్యర్థితో పాటు క్యాడర్ ధీమాగా ఉంది. మాజీమంత్రి చంద్రశేఖర్ వర్గం పూర్తిగా సపోర్టు చేస్తుండటం కూడా ఆయనకు కలిసొస్తుందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఆరు గ్యారంటీలను ​ప్రచారం చేస్తుంది. పార్టీ అధికారంలోకి వస్తే వికారాబాద్ జిల్లా కొడంగల్​ నుంచి పోటీ చేస్తున్న  పీసీసీ  చీఫ్​ రేవంత్ రెడ్డి సీఎం అవుతారని, అప్పుడు జిల్లా మరింత డెవలప్ అవుతుందని జోరుగా ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో గెలుపుపై కాంగ్రెస్​ ఆశలు పెట్టుకుంది. 

బలమైన నేత బీజేపీని వీడగా..

ఇక్కడ బీజేపీకి బలమైన నేత మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్ ఉండగా.. ఎన్నికల నోటిఫికేషన్​కు ముందు ఆయన  కాంగ్రెస్​లో  చేరారు. ప్రస్తుతం జహీరాబాద్ నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో ఆయనతో పాటు క్యాడర్  కూడా వెళ్లిపోయింది. ఇప్పుడు బీజేపీకి పెద్దగా పట్టు అయితే లేదు. 2018లో కాంగ్రెస్​ ఓటమికి ఆయనే ప్రధాన కారణమని చెప్పొచ్చు. అప్పట్లో కాంగ్రెస్​టికెట్ ఆశించగా రాకపోవడంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసి 23వేల ఓట్లు సాధించాడు. కాంగ్రెస్​ 3,092 ఓట్ల తేడాతో ఓటమి పాలైంది.