- రోజూ 4 వేలకు పైగా ఓపీ.. 400 మంది ఇన్ పేషెంట్లు
- సోమవారం ఒక్కరోజే 4,725 రికార్డు స్థాయి ఓపీ నమోదు
- ఆర్థో, న్యూరో, రుమటాలజీ, యూరాలజీలలో ఎక్కువ రద్దీ
- రాష్ట్రం నలుమూలల నుంచి రోగులు.. ఉన్నది 1600 బెడ్లే
- టిమ్స్ పూర్తిగా అందుబాటులోకి వస్తే నిమ్స్‌పై భారం తగ్గే చాన్స్
మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ 58 ఏండ్ల మహిళ మోకాళ్ల నొప్పితో మే నెలలో నిమ్స్ హాస్పిటల్‌కు వచ్చింది. పరీక్షించిన డాక్టర్లు కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయాలని చెప్పారు. అన్ని రకాల టెస్ట్‌లు పూర్తి చేశారు. సర్జరీ కోసం ఎల్‌వోసీ కూడా తెచ్చుకున్నారు. తీరా సర్జరీకి ఇప్పుడు ఖాళీ లేదని, డిసెంబర్‌లో చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఆమె తీవ్ర నొప్పులతో బాధపడుతూ డిసెంబర్ నెల కోసం ఎదురుచూస్తున్నది.
హైదరాబాద్, వెలుగు: నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) అధిక రద్దీతో సతమతవుతున్నది. రోజు రోజుకూ పేషెంట్ల సంఖ్య పెరగడం.. బెడ్ల సంఖ్య తక్కువగా ఉండడంతో సర్జరీలకు నెలలకాలం పడుతున్నది. దీంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీని భరించలేక.. నిమ్స్‌పై నమ్మకంతో రాష్ట్రం నలుమూలలతోపాటు పొరుగు రాష్ట్రాలైన ఏపీ, మహారాష్ట్ర, కర్నాటక సరిహద్దు ప్రాంతాల నుంచి ఇక్కడికి రోగులు వస్తున్నారు.
హాస్పిటల్ సామర్థ్యానికి మించి సర్జరీల కోసం పేషెంట్స్ వస్తుండడంతో ఆమేరకు సరిపడా స్టాఫ్, ఆపరేషన్ థియేటర్లు అందుబాటులో ఉండడం లేదు. దీంతో డాక్టర్లు వారికి ఏకంగా నాలుగైదు నెలల నుంచి ఆర్నెల్ల తర్వాత సర్జరీ డేట్లు ఇస్తున్నారు. ఎమర్జెన్సీ కేసులు తప్ప మిగిలిన రోగులందరూ నెలల తరబడి నొప్పులు, అవస్థలతో కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొన్నది.
కీలక డిపార్ట్‌మెంట్లలోనే..
ముఖ్యంగా ఆర్థోపెడిక్, న్యూరో సర్జరీ, రుమటాలజీ, యూరాలజీలాంటి కీలక డిపార్ట్‌మెంట్లలో రద్దీ తీవ్రంగా ఉంది. ఆర్థోపెడిక్ విభాగంలోనే ఏడాదికి సగటున సుమారు 70 నుంచి 80 వేల ఓపీలు, 4 వేలకు పైగా మేజర్ సర్జరీలు జరుగుతున్నాయి. మోకాలి కీళ్ల మార్పిడి (టీకేఆర్), తుంటి మార్పిడి (టీహెచ్ఆర్), వెన్నుపూస సమస్యలు, మెదడు కణితులు, కిడ్నీ సంబంధిత జబ్బులతో వచ్చే రోగులకు కనీసం 6 నెలల తర్వాత డాక్టర్లు సర్జరీ డేట్లను ఇస్తున్నారు.
తీరా ఆ గడువు ముగిసిన తర్వాత రోగులు ఎంతో ఆశతో హాస్పిటల్‌కు వస్తే.. గతంలో చేయించిన బ్లడ్ టెస్టులు, స్కాన్లు పాతబడిపోయాయంటూ డాక్టర్లు మళ్లీ మొదటి నుంచి పరీక్షలు చేయిస్తున్నారు. ఈ రిపోర్టులు వచ్చేసరికి లేట్ కావడంతో.. సర్జరీని మరో మూడు, నాలుగు నెలలు వాయిదా వేస్తున్నారు. దీంతో సర్జరీల కోసం ఏళ్ల తరబడి హాస్పిటల్ మెట్లు ఎక్కి దిగలేక, అటు ప్రైవేట్‌లో చేయించుకునే స్తోమత లేక పేద రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సనత్‌నగర్ టిమ్స్‌లో పూర్తి సేవలు అందుబాటులోకి వస్తేనే..
నిమ్స్‌లో రద్దీ నివారణకు రూ.1,600కు పైగా కోట్లతో సవరించిన నిమ్స్ విస్తరణ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాల్సి ఉండగా.. పనులు నెమ్మదిగా నడుస్తున్నాయి. నిమ్స్ కొత్త భవనాలు అందుబాటులోకి రావడానికి ఇంకా రెండేండ్లకుపైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో నిమ్స్‌పై తీవ్రమైన ఒత్తిడి తగ్గాలంటే సనత్‌నగర్ టిమ్స్‌లో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి తేవాలి.
దసరా నాటికి.. టిమ్స్‌లో పూర్తిస్థాయిలో వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, కొత్త నిర్మాణాలపైనే కాకుండా గాంధీ, ఉస్మానియాల్లో శానిటేషన్ మెరుగుపరిచి, సీనియర్ డాక్టర్ల సేవలు సామాన్యులకు అందేలా చర్యలు తీసుకుంటేనే నిమ్స్‌పై భారం తగ్గి, పేద రోగులకు సత్వర వైద్యం దక్కుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టిమ్స్ ఆపరేషన్ థియేటర్లను వాడుకునేదెప్పుడు ?
నిమ్స్‌పై పేషంట్ల భారం తగ్గించేందుకు.. సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్లను వినియోగించుకోవాలని అధికారులకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఇదివరకే సూచించారు. అయితే, నెలలు గడుస్తున్నా.. ఇంతవరకూ ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదు.
నిమ్స్‌లో ఆపరేషన్ థియేటర్ల కొరత ఉన్నది. సమీపంలోని సనత్‌నగర్ టిమ్స్‌లో ఆపరేషన్లు చేస్తే.. పేషెంట్ల వెయిటింగ్ కొద్దిగానైనా తగ్గుతుంది. ఇప్పటికైనా అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని ప్రజల నుంచి డిమాండ్స్ వస్తున్నాయి.
అడ్మిషన్‌కు నరకం.. డిశ్చార్జీకి గోస
నిమ్స్‌లో బెడ్ దొరకడమే కష్టమనుకుంటే, చికిత్స పూర్తయ్యాక ఇంటికి వెళ్లడానికి సైతం రోగులకు నరకయాతన తప్పడం లేదు. విభాగాలు, డయాగ్నస్టిక్ ల్యాబ్‌లు, ఫార్మసీ, అడ్మినిస్ట్రేషన్ విభాగాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్ల పేషెంట్‌ను డిశ్చార్జి చేయడానికే ఒకటి నుంచి రెండు రోజుల సమయం పడుతోంది.
డాక్టర్లు డిశ్చార్జి రాసినప్పటికీ.. ఫైల్ క్లియరెన్స్, ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ అప్రూవల్స్, మందుల చిట్టీలు, బిల్లింగ్ ప్రక్రియల ఆలస్యం కారణంగా బెడ్లు సకాలంలో ఖాళీ కావడం లేదు. వేగంగా డిశ్చార్జి ప్రక్రియ ముగిస్తే ఆ బెడ్లను వెయిటింగ్‌లో ఉన్న మరో అత్యవసర రోగికి వెంటనే కేటాయించే వీలున్నా, సిబ్బంది అలసత్వం, పరిపాలనా పర్యవేక్షణ లోపంతో అడ్మిషన్ల నిరీక్షణ మరింత పెరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి.
బెడ్ ఆక్యుపెన్సీ 90 శాతం పైనే..
ప్రస్తుతం నిమ్స్ హాస్పిటల్‌లో ఇన్‌పేషెంట్ విభాగానికి సంబంధించి కేవలం 1,600కు పైగా బెడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇందులో జనరల్ బెడ్లు సుమారు 875, ఐసీయూ 452, పేయింగ్ బెడ్లు 173 కాగా.. డయాలసిస్, ఆంకాలజీకి సంబంధించి మరో 139 డేకేర్ బెడ్లు ఉన్నాయి. అయితే హాస్పిటల్‌పై ఆధారపడే పేషంట్ల సంఖ్య మాత్రం రోజు రోజుకూ పెరిగిపోతున్నది. నిత్యం 4 వేలపైనే ఔట్ పేషెంట్లు (ఓపీ), 300 నుంచి 400 వరకు ఇన్‌పేషెంట్లు (ఐపీ) నమోదవుతున్నారు. ఏడాదికి సుమారు 10 లక్షల మందికి పైనే ఓపీ సేవలు పొందుతున్నట్టు అంచనా. ప్రతి ఏడాది ఓపీ పేషంట్ల సంఖ్య 10 నుంచి 15 శాతం పెరుగుతూనే ఉన్నది.
ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ఓపీల సంఖ్యే ఏడాదికి సుమారు 4 లక్షలు, ఇన్‌పేషెంట్ అడ్మిషన్ల సంఖ్య 70 వేలకుపైనే ఉండొచ్చని తెలుస్తున్నది. సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) ద్వారా చికిత్స కోసం వచ్చే పేషెంట్ల సంఖ్య నిరుడు11 వేల మార్కును దాటగా.. ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. బెడ్ ఆక్యుపెన్సీ రేటు నిరంతరం 91 శాతం నుంచి 100 శాతంగా కొనసాగుతుండటంతో.. కొత్తగా వచ్చే పేషెంట్లకు అడ్మిషన్ దొరకడం గగనంగా మారింది.
