మస్తు టీకాలు వస్తున్నయ్..కొత్తగా ఆరు వ్యాక్సిన్లు రెడీ అవుతున్నయ్

మస్తు టీకాలు వస్తున్నయ్..కొత్తగా ఆరు వ్యాక్సిన్లు రెడీ అవుతున్నయ్
  • కొత్తగా ఆరు వ్యాక్సిన్లు రెడీ అవుతున్నయ్​
  • ఇప్పటికే 2 వ్యాక్సిన్లు.. వాటికి జత కలిసిన స్పుత్నిక్​
  • వచ్చే నెలలో మార్కెట్​లోకి డీఆర్డీవో 2డీజీ డ్రగ్


హైదరాబాద్​, వెలుగు / న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై వ్యాక్సిన్​ వజ్రాయుధంలా పనిచేస్తోంది. రెండు డోసుల వ్యాక్సిన్​ తీసుకున్నోళ్లు మాస్క్​ కూడా పెట్టుకోనక్కర్లేదని అమెరికా ప్రకటించింది. వ్యాక్సినేషన్​లో మూడో ప్లేస్​లో ఉన్న మనదేశంలో కూడా జోరుగా టీకాలు వేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకు మరిన్ని వ్యాక్సిన్లు స్పీడ్​గా రెడీ అవుతున్నాయి. ఇప్పటికే కొవిషీల్డ్, కొవాగ్జిన్​లను జనానికి వేస్తుండగా.. వాటికి ఇప్పుడు స్పుత్నిక్​ వీ తోడైంది. వాటితో పాటు కొత్తగా మరో ఆరు టీకాలూ రాబోతున్నాయి. ఇంకో ఆరు నెలల్లోపే ఇవి అందుబాటులోకి వచ్చే చాన్స్​ ఉంది. ఆ టీకాలొస్తే ఇప్పటిదాకా స్లోగా సాగుతున్న వ్యాక్సినేషన్​ జోరందుకోనుంది.

స్పుత్నిక్​ టీకా వచ్చేసింది

శుక్రవారం హైదరాబాద్​లో రష్యా వ్యాక్సిన్​  స్పుత్నిక్​ వీ ఫస్ట్​ డోస్​ను వేశారు. దాని ధరను డాక్టర్​ రెడ్డీస్​ లేబొరేటరీస్​ ఖరారు చేసింది. ఒక్కో డోసు ధరను రూ. 995గా నిర్ణయించింది. అయితే, కేవలం దిగుమతి చేసుకున్న టీకాలకే ఈ రేటును ఫిక్స్​ చేసింది. అందులో టీకా అసలు ధర రూ.948 కాగా, దానికి 5 శాతం జీఎస్టీనీ యాడ్​ చేసి ధరను ఫైనల్​ చేసింది. డాక్టర్​ రెడ్డీస్​కే చెందిన ఉన్నతాధికారికి తొలి టీకా ఇచ్చారు. రష్యన్​ డైరెక్ట్​ ఇన్వెస్ట్​మెంట్​ ఫండ్​ (ఆర్డీఐఎఫ్​)తో కలిసి గమాలియా ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ రీసెర్చ్​ తయారు చేసిన వ్యాక్సిన్​ను మన దేశంలో ఉత్పత్తి చేసేందుకు డాక్టర్​ రెడ్డీస్ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ నెల 1న రష్యా నుంచి వ్యాక్సిన్లు వచ్చాయి. దిగుమతి చేసుకున్న వాటితో పోలిస్తే మన దేశంలో తయారయ్యే స్పుత్నిక్​ డోసులకు మాత్రం తక్కువ ధరే ఉంటుందని డాక్టర్​ రెడ్డీస్​ స్పష్టం చేసింది. మే 1న ఫస్ట్​ బ్యాచ్​ వ్యాక్సిన్లు వచ్చాయని, గురువారం వాటి వాడకానికి కసౌలీలోని సెంట్రల్​ డ్రగ్స్​ లేబొరేటరీ అనుమతిచ్చిందని పేర్కొంది. ఏడాదిలో 25 కోట్ల వ్యాక్సిన్​ డోసులను అందించేందుకు టార్గెట్​ పెట్టుకున్నామని చెప్పింది. 

త్వరలో మరో 3.6 కోట్ల డోసులు రష్యా నుంచి వస్తాయని, మే నెల చివరి నాటికి వాటిని పంపించాల్సిందిగా ఆర్డీఐఎఫ్​ను కోరామని వెల్లడించింది. దేశంలో వీలైనంత ఎక్కువమందికి వ్యాక్సిన్​ అందించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నామని చెప్పింది. దేశంలో స్పుత్నిక్​ టీకాల ప్రొడక్షన్​కు ఆరు సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు. హెటిరో డ్రగ్స్​, గ్లాండ్​ ఫార్మా, విర్కో బయోటెక్​, ప్యానాసియా బయోటెక్​, శిల్ప మెడికేర్​, స్టెలిస్​ బయోఫార్మాలూ స్పుత్నిక్​ను తయారు చేస్తున్నాయంది. ప్రస్తుతం పెరుగుతున్న కేసులను తగ్గించాలంటే వ్యాక్సినేషనే మేలైన ఆయుధమని కంపెనీ కో చైర్మన్​, ఎండీ జీవీ ప్రసాద్​రెడ్డి చెప్పారు. అందులో భాగంగా తొందర్లోనే వీలైనన్ని ఎక్కువ వ్యాక్సిన్లను అందించడమే తమ ముందున్న లక్ష్యమని ఆయన చెప్పారు. కాగా, ఆర్​ఏడీ 26, ఆర్​ఏడీ5 అనే రెండు డోసుల కాంబోలో తయారైన స్పుత్నిక్​ టీకా పనితీరు 91.6 శాతంగా ఉందని ట్రయల్స్​లో వెల్లడైంది. ఫస్ట్​ డోస్​ కింద ఆర్​ఏడీ26, రెండో డోస్​ కింద ఆర్​ఏడీ 5ను ఇస్తారు.

మరో లోకల్​ వ్యాక్సిన్​ రెడీ

కరోనా వ్యాక్సిన్లలో మరో లోకల్​ టీకా వచ్చేస్తోంది. అహ్మదాబాద్​ కంపెనీ జైడస్​ క్యాడిలా తయారు చేసిన జైకొవ్​– డీ వచ్చే నెలలోనే మార్కెట్లోకి రాబోతోంది. ఏడాదికి 24 కోట్ల డోసులను తయారు చేసేందుకు కంపెనీ టార్గెట్​ పెట్టుకుంది. ఈ నెలాఖరుకు డ్రగ్స్​ కంట్రోలర్​ జనరల్​ ఆఫ్​ ఇండియా (డీసీజీఐ)కి వ్యాక్సిన్​ పనితీరుకు సంబంధించిన డేటాను అందించనుంది. ‘‘ప్లాస్మిడ్​ డీఎన్​ఏ టెక్నాలజీతో తయారు చేసిన మా వ్యాక్సిన్​ పనితీరు చాలా బాగుంది. మే చివరి నాటికి ట్రయల్స్​ డేటాను ప్రభుత్వానికి అందజేస్తాం. జూన్​లో వ్యాక్సిన్​ సరఫరాకు అనుమతులు పొందేందుకు ప్రయత్నిస్తాం’’ అని కంపెనీ ఎండీ డాక్టర్​ శర్విల్​ పటేల్​ చెప్పారు. మొదట నెలకు కోటి డోసులను తయారు చేస్తామన్నారు. ఆ తర్వాత దానిని రెట్టింపు చేస్తామని వివరించారు. 12 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలపైనా వ్యాక్సిన్​ ట్రయల్స్​ చేశామన్నారు. 

మిగతా వాటితో పోలిస్తే కొత్తగా..

ఇప్పుడున్న వ్యాక్సిన్లను కేవలం రెండు డోసులు వేస్తున్నారు. కానీ, జైకొవ్​– డీని మూడు డోసులుగా ఇస్తారు. డీఎన్​ఏ ప్లాస్మిడ్​ టెక్నాలజీతో ఈ వ్యాక్సిన్​ను తయారు చేశారు. అంటే జెనెటిక్​ ఇంజనీరింగ్​లో వాడే బ్యాక్టీరియాలోని క్రోమోజోమల్​ డీఎన్​ఏకి కరోనా వైరస్​ జీన్​ను కలిపి వ్యాక్సిన్​ను తయారు చేశారు. దీనిని శరీరంలోకి పంపించినా వైరస్​ మరింతగా రెప్లికేట్​ కాదని సైంటిస్టులు చెబుతున్నారు. దాని ద్వారా శరీరంలో ఉత్పత్తయ్యే యాంటీజెన్లను గుర్తించి ఇమ్యూన్​ సిస్టమ్​ యాంటీ బాడీలను తయారు చేస్తుందని అంటున్నారు. 

ఐఐఎస్సీ వ్యాక్సిన్​

కరోనా నివారణకు బెంగళూరులోని ఇండియన్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ సైన్సెస్​ (ఐఐఎస్సీ) కూడా ఒక వ్యాక్సిన్​ను తయారు చేస్తోంది. మిగతా వ్యాక్సిన్లతో పోలిస్తే దీనిని రూం టెంపరేచర్​ 30 డిగ్రీల వద్ద కూడా స్టోర్​ చేసుకోవచ్చని, వాటితో పోలిస్తే కరోనా నుంచి మెరుగైన రక్షణనిస్తుందని ఐఐఎస్సీ డైరెక్టర్​ ప్రొఫెసర్​ గోవిందన్​ రంగరాజన్​.. కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రికి తెలియజేశారు. త్వరలోనే వ్యాక్సిన్​ ట్రయల్స్​ మొదలుపెట్టేందుకు ఐఐఎస్సీ రెడీ అవుతోంది. ట్రయల్స్​ కోసం కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోనుంది. అయితే, ఆ వ్యాక్సిన్​ ఏంటి? ఎలా తయారు చేశారు? అన్న వివరాలు మాత్రం ఇంకా బయటకు వెల్లడించలేదు. 

తక్కువ ధరకే బయోలాజికల్​ ఈ వ్యాక్సిన్​

హైదరాబాద్​కు చెందిన బయోలాజికల్​ఈ కంపెనీ ఓ ప్రత్యేకమైన వ్యాక్సిన్​ను తయారు చేస్తోంది. మొత్తం వైరస్​ను కాకుండా.. వైరస్​లోని భాగాలను తీసుకుని (వైరల్​ సబ్​ యూనిట్స్​) ‘బీఈకొవ్​2ఏ’ అనే వ్యాక్సిన్​ను తయారు చేస్తోంది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్​ ఎమర్జెన్సీ వాడకానికి కేంద్రం ఓకే చెప్పేసింది. ఈ టెక్నిక్​ ద్వారా తయారు చేసే వ్యాక్సిన్ల ధరలు తక్కువగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. అమెరికాకు చెందిన టెక్సస్​ చిల్డ్రెన్స్​ హాస్పిటల్​ సెంటర్​ ఫర్​ వ్యాక్సిన్​ డెవలప్​మెంట్​ అభివృద్ధి చేసిన యాంటీజెన్లతో బీఈకొవ్​2ఏని సిద్ధం చేసింది. త్వరలోనే ఫేజ్​3 ట్రయల్స్​ను మొదలుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఆగస్టు నుంచి 7.5 కోట్ల నుంచి 8 కోట్ల దాకా వ్యాక్సిన్​ డోసుల తయారీకి సిద్ధమవుతోంది. మొత్తంగా ఏటా 30 కోట్ల డోసులను తయారు చేస్తామని ఈమధ్యే సంస్థ ప్రకటించింది. ఇప్పుడున్న వ్యాక్సిన్ల కన్నా తక్కువ ధరకే వ్యాక్సిన్​ ఇస్తామని కంపెనీ ఎండీ మహిమా దాట్ల ఇటీవల చెప్పారు. అంతేగాకుండా జాన్సన్​ అండ్​ జాన్సన్​ సింగిల్​ డోస్​ వ్యాక్సిన్​నూ ప్రొడ్యూస్​ చేయడానికి బయోలాజికల్​ ఈ ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా 60 కోట్ల డోసులను ఉత్పత్తి చేయనుంది. క్వాడ్​ ఇనిషియేటివ్​లో భాగంగా ఏర్పడిన యూఎస్​ ఇంటర్నేషనల్​ డెవలప్​మెంట్​ ఫైనాన్స్​ కార్పొరేషన్​.. కంపెనీకి ఆర్థిక సాయం చేస్తామనీ ప్రకటించింది. 2022 నాటికి వంద కోట్ల డోసుల తయారీ లక్ష్యంగా ఈ నిధులను ఇవ్వనుంది. 

ఫస్ట్​ లోకల్​ ఎంఆర్​ఎన్​ఏ వ్యాక్సిన్​ 

దేశంలోని ఫస్ట్​ ఎంఆర్​ఎన్​ఏ వ్యాక్సిన్​ను జెన్నోవా బయోఫార్మాస్యుటికల్స్​ తయారు చేస్తోంది. కరోనా స్పైక్​ ప్రొటీన్​ను శరీరంలో తయారు చేసి దానిని మన ఇమ్యూన్​సిస్టమ్​ గుర్తించేలా చేస్తుంది కరోనా జెనెటిక్​ సీక్వెన్స్​ ఉండే ఈ ఎంఆర్​ఎన్​ఏ. పూణెకు చెందిన జెన్నోవా.. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్​పై ట్రయల్స్​ చేస్తోంది. ఎమర్జెన్సీ వాడకానికి కేంద్రం అనుమతులిచ్చింది. డిసెంబర్​ నాటికి 6 కోట్ల వ్యాక్సిన్​ డోసులు అందుబాటులోకి రానున్నాయి. 

సీరమ్​ కొవోవ్యాక్స్​కూ ఓకే

అమెరికా కంపెనీ నోవావ్యాక్స్​ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్​ను మన దేశంలో ‘కొవోవ్యాక్స్​’ పేరిట సీరమ్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా తయారు చేయనుంది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్​ ఫేజ్​3 ట్రయల్స్​ నడుస్తున్నాయి. ఈ వ్యాక్సిన్​ కూడా వైరస్​ సబ్​ యూనిట్​ ఆధారంగా తయారవుతున్నదే. డిసెంబర్​ నాటికి 20 కోట్ల డోసులను ఇచ్చేందుకు కంపెనీ చకచకా అడుగులు వేస్తోంది. భారత్​ బయోటెక్​ తయారు చేస్తున్న నాజల్​ వ్యాక్సిన్​పైనా ట్రయల్స్​ నడుస్తున్నాయి. ఇవేగాకుండా, మరిన్ని విదేశీ టీకాలనూ తెప్పించుకునేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా కంపెనీలతో ఒప్పందం చేసుకుంటే రెండు మూడ్రోజుల్లోనే అనుమతులిచ్చేస్తామని పేర్కొంది. 

28 వేల మందిపై ట్రయల్స్​

28 వేల మందిపై జైకొవ్​– డీ వ్యాక్సిన్​ ఫేజ్​3 ట్రయల్స్​ చేశామని, ఇప్పటిదాకా దేశంలో జరిగిన అతిపెద్ద కరోనా వ్యాక్సిన్​ ట్రయల్స్​ ఇవేనని ఆయన చెప్పారు. అన్ని వేరియంట్లపైనా వ్యాక్సిన్​ మంచి ప్రభావాన్ని చూపించిందని చెప్పారు. ఇతర టీకాలతో పోలిస్తే మంచి ఫలితాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సిన్​ ప్రొడక్షన్​ కెపాసిటీని పెంచేందుకు రెండు, మూడు లోకల్​ కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని, తక్కువ టైంలో వీలైనన్ని ఎక్కువ డోసులు తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 

వచ్చే నెలలో 2డీజీ

కరోనా ట్రీట్​మెంట్​ కోసం డీఆర్డీవోతో కలిసి తయారు చేసిన 2డీజీ మందును వచ్చే నెలలో మార్కెట్​లోకి తీసుకొస్తామని డాక్టర్​ రెడ్డీస్​ లేబొరేటరీస్​ ప్రకటించింది. ఈ మందు ధరను ఇంకా నిర్ణయించలేదని, సామాన్య జనాలకూ అందేలాగానే మందు ధరను నిర్ణయిస్తామని పేర్కొంది.