సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణం.. ఆరేళ్ల పాపపై ఆటో డ్రైవర్ రేప్, హత్య

V6 Velugu Posted on Sep 10, 2021

హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణం జరిగింది. ఆరేళ్ల పాపపై ఓ దుర్మార్గుడు అకృత్యానికి ఒడిగట్టాడు. చిన్నారిని రేప్ చేసి చంపేశాడు. స్థానికంగా ఉండే రాజు (30) అనే ఆటో డ్రైవర్ ఈ దారుణానికి పాల్పడ్డాడని, అతడిని తమకు అప్పగించే వరకూ పాప మృతదేహాన్ని కదిలించేది లేదని బస్తీ వాసులు ఆందోళనకు దిగారు.

సింగరేణి కాలనీలో నిన్న (గురువారం) సాయంత్రం 5 గంటల నుంచి పాప కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల అంతా గాలించారు. రాత్రయ్యే వరకూ ఆచూకీ తెలియకపోవడంతో ఆ ఏరియాలో జులాయిగా తిరిగే రాజుపై అనుమానం వచ్చింది. నల్గొండ జిల్లా చందంపేట్ మండలం నుంచి హైదరాబాద్ వచ్చి ఆటో డ్రైవర్ గా పని చేస్తున్న రాజు చిల్లర దొంగతనాలు చేస్తూ ఆ ఏరియాలో జనాలతో దురుసుగా వ్యవహరిస్తూ ఉండేవాడు. దీంతో అతడు పాపను ఏమైనా చేశాడేమోనన్న అనుమానంతో అర్థరాత్రి సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా ఆ చిన్నారి విగత జీవిగా పడి ఉంది. సాయంత్రం వరకూ చిరు నవ్వులతో ఆడుకుంటూ కనిపించిన తమ బుజ్జాయి అలా ఓ కిరాతకుడికి బలైపోవడం చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. 

ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడి చేరుకున్న పోలీసులు క్లూస్ సేకరించారు. అయితే నిందితుడు రాజును తమకు అప్పగించే వరకూ పాప మృతదేహాన్ని అక్కడి నుంచి తీసేది లేదని బస్తీవాసులంతా నిరసనకు దిగారు. పోలీసులు వారికి నచ్చజెప్పి.. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. కాగా, నిందితుడు రాజు చిల్లర దొంగతనాలు చేస్తూ మందుకు బానిసై భార్యను కొట్టి ఇంటి నుంచి గెంటేశాడని స్థానికులు చెబుతున్నారు.

Tagged Hyderabad, murder, auto driver, singareni colony, Saidabad, six year old girl, Girl rape

Latest Videos

Subscribe Now

More News