రూ.5,350 కోట్ల రాష్ట్ర సర్కార్ సబ్సిడీలు పెండింగ్

రూ.5,350 కోట్ల రాష్ట్ర సర్కార్ సబ్సిడీలు పెండింగ్
  • ఎన్​పీఏల లిస్ట్​లో 1.55 లక్షల ఎంఎస్​ఎంఈ అకౌంట్లు
  •  ఓవర్​ డ్యూల లిస్ట్​లో మరో లక్షన్నర
  •  మొత్తం రూ.10 వేల కోట్ల నష్టంలో పరిశ్రమలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చిన్న పరిశ్రమలు దివాలా తీస్తున్నాయి. కరోనా కుదుపు తర్వాత రాష్ట్ర సర్కార్​ పట్టించుకోకపోవడంతో నాన్ పర్​ఫామింగ్ అసెట్స్​గా (ఎన్​పీఏ) మిగిలిపోతున్నాయి. ఓవర్​ డ్యూలు పెరిగి.. మొండి బకాయిలు పేరుకుపోయి మూసివేస్తున్నారు. కనీసం ఆయా ఎంఎస్ఎంఈలకు రావాల్సిన సబ్సిడీలు కూడా సర్కార్ రిలీజ్ చేయడం లేదు. దీంతో రాష్ట్రంలో 3 లక్షలకు పైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే 5,675 ఎంఎస్ఎంఈలు మూతపడగా.. మరికొన్ని తాళం వేసే దశకు చేరుకుంటున్నాయి. రిజిస్టర్ లిస్ట్​లో ఉన్న ఈ కంపెనీలే ఇలా ఉండగా.. రిజిస్టర్​ కాకుండా లక్షల్లో ఉన్న ఎంఎస్​ఎంఈల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వానికి ఆఫీసర్లు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 1.40 లక్షల ఎంఎస్ఎంఈ బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి రూ.9,014 కోట్లు ఓవర్ డ్యూలు ఉన్నాయి. నాన్ పర్​ఫామింగ్ అసెట్స్​లో 1.55 లక్షల ఎంఎస్​ఎంఈల బ్యాంక్ అకౌంట్లలో రూ.6,100 కోట్లు ఉన్నాయి.

ఇండస్ట్రియల్​ హెల్త్ క్లినిక్ ఉత్తదేనా 

కరోనా, లాక్‌‌డౌన్‌‌తో మూతపడిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కోలుకోలేకపోతున్నాయి. ఉత్పత్తి ఆగిపోయిన యూనిట్లు మూతపడుతున్నాయి. కరెంటు చార్జీలు, బ్యాంకు కిస్తీలు, వడ్డీలు చెల్లించలేక, ఉద్యోగులు, కార్మికులకు వేతనాలు ఇవ్వలేక మూసేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఓవర్ డ్యూలు, ఎన్​పీఏలు పెరుగుతున్నాయంటున్నారు. కరోనా తరువాత కొంత వరకు కేంద్ర సర్కార్ ఆత్మ నిర్భర్ కింద నిధులు ఇచ్చి ప్రోత్సహించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక రాయితీలు ఎంఎస్​ఎంఈలకు అందడం లేదు. మూతపడ్డ పరిశ్రమలను తెరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2018 ఏప్రిల్‌‌లో రూ.50 కోట్ల కార్పస్‌‌ఫండ్‌‌తో తెలంగాణ ఇండిస్ట్రియల్‌‌ హెల్త్‌‌ క్లినిక్‌‌ పేరుతో ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో మూతపడ్డ పరిశ్రమలను గుర్తించి, బ్యాంకుల నుంచి ఆర్థిక సాయం, మార్కెటింగ్‌‌ నైపుణ్యం, తిరిగి పునరుద్ధరించేందుకు సమాయత్తం చేయడం, అందుకు కావల్సిన సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో రిజిస్టర్డ్, నాన్ రిజిస్టర్డ్ ఎస్​ఎంఈలు లక్షల సంఖ్యలో మూతపడగా.. టీఐహెచ్‌‌సీఎల్ తో వెయ్యి లోపు యూనిట్లు పునరుద్ధరణకు నోచుకున్నాయి. వాస్తవానికి మూతపడ్డ పరిశ్రమల పునరుద్ధరణకు గతంలో జిల్లాల స్థాయిలో కలెక్టర్‌‌ చైర్మన్‌‌గా, ఇండస్ట్రిస్ మేనేజర్‌‌, బ్యాంకర్లు సభ్యులుగా కమిటీలు ఉండేవి. అయా జిల్లాలలో మూతపడ్డ యూనిట్లపై క్షేత్రస్థాయి రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకునేవారు. అయితే 2018లో ఇండస్ట్రియల్‌‌ హెల్త్‌‌ క్లినిక్‌‌ ను ప్రారంభించిన తరువాత జిల్లా స్థాయిలో ఈ కమిటీలు మూలకుపడ్డాయి.

ఇన్సెంటివ్ ఇయ్యరాయే

ఎంఎస్​ఎంఈలకు పొరుగునున్న ఏపీ ప్రభుత్వం ఎంఎస్​ఎంఈ  ఇన్సెంటివ్ బకాయిలను కరోనా తరువాత విడుదల చేసింది. అయితే తెలంగాణలో మాత్రం ఆరేండ్లుగా ఇవ్వడం లేదు. అధికార పార్టీకి దగ్గరగా ఉన్న కొందరు పైరవీలతో ఇన్సెంటివ్​లు రిలీజ్ చేయించుకోగా.. వేల ఎంఎస్​ఎంఈలు వాటికోసం ఎదురుచూస్తున్నాయి. దాదాపు రూ.5,350 కోట్ల ప్రోత్సాహకాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆగిపోయాయి. వీటి చెల్లింపులపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కదలిక లేదని విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా ఎంఎస్​ఎంఈలకు స్టాంప్ డ్యూటీ రీఫండ్, పెట్టుబడి మొత్తంలో పరిశ్రమలను బట్టి 20 నుంచి 25 శాతం వరకు సబ్సిడీ ఇస్తమని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. పావలా వడ్డీ లోన్లు, కరెంట్​వాడకంలో రాయితీ, పట్టణ, జిల్లా స్థాయిలో పరిశ్రమలు, ప్రాంతాలవారీగా ప్రత్యేక రాయితీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవేమి ఇవ్వడం లేదు. సబ్సీడీలను ప్రభుత్వం రిలీజ్​ చేయకపోతే రాష్ట్రంలో మరిన్ని ఎంఎస్​ఎంఈలు మూతపడుతాయని ఇండస్ట్రియల్ ఎక్స్​పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.

చిన్న వాటిపై నిర్లక్ష్యం

పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లు రాష్ట్ర సర్కార్ ఇండస్ట్రీల ఏర్పాటు విషయంలో గప్పాలు కొట్టుకుంటుందే తప్ప చర్యలు శూన్యం. ఎంఎస్​ఎంఈలు వేలల్లో మూతుపడుతున్నా పట్టించుకోవడం లేదు. పెద్ద కంపెనీలు, భారీ పెట్టుబడులు అంటూ ఊదరగొడుతూ చిన్న కంపెనీలను వదిలేశారు. దీంతో వేల మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి వస్తోంది. 

- దొంతి నర్సింహారెడ్డి, ఎక్స్​పర్ట్​