బీసీ గురుకులాల గతి ఇంతేనా?

V6 Velugu Posted on May 06, 2021

తెలంగాణ ఆవిర్భవించే నాటికే సాంఘిక సంక్షేమ గురుకులాల స్టూడెంట్లు ఎవరెస్ట్ ఎక్కడంతో పాటు వందల సంఖ్యలో నీట్, ఐఐటీ సీట్లు లాంటి ఘనతను సాధించారు. ఈ విజయాలను చూసిన సీఎం కేసీఆర్ 604 గురుకుల పాఠశాలలను సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ, అలాగే మైనారిటీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో కొత్తగా మంజూరు చేశారు. ప్రస్తుతం కొత్తవి పాతవి కలిపి హైస్కూల్ నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ స్థాయిలో బోధించే గురుకుల విద్యాలయాలు సాంఘిక సంక్షేమ శాఖలో 268, బీసీ సంక్షేమ శాఖలో 226, గిరిజన సంక్షేమ శాఖలో 187, మైనారిటీ సంక్షేమ శాఖలో 204 ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం కొత్తగా మంజూరైన గురుకులాలకు పక్కా భవనాలను నేటికీ నిర్మించలేక పోయింది. అయితే వీటిలో చదివే పిల్లలు సాధించే విజయాల పరంపర సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకులాలకే పరిమితమైంది. దీనికి ప్రధాన కారణాలుగా నిధుల లేమి, ప్రభుత్వాల నిర్లక్ష్యం, అధికారుల ప్రణాళికా లోపం మొదలైన వాటిని చెప్పొచ్చు.

ఎస్సీ, ఎస్టీలు ఎంతో చైతన్యంతో ముందుకు వచ్చి ఉద్యమాలు చేసి చట్టబద్ధమైన సబ్ ప్లాన్ ను సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం 2021–22 బడ్జెట్​లో రూ.33,600 కోట్లను సబ్ ప్లాన్ రూపంలో కేటాయించింది. అందుకు వారిని మనం అభినందించి తీరాలి. ఈ సబ్​ప్లాన్ ద్వారా తమ జనాభాకు అనుగుణంగా వచ్చే నిధులతో సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ విద్యాలయాల్లో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కల్పించి, కోచింగ్ ఇచ్చి వివిధ పోటీ పరీక్షల్లోనే కాకుండా అనేక రంగాల్లో విజయాలు సాధిస్తున్నాయి. వివిధ ఐఐటీలు, యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీల్లో సీటు పొందిన స్టూడెంట్లకు ఆర్థికంగా కూడా ఈ సబ్​ ప్లాన్ నిధులు తోడ్పడుతున్నాయి. కానీ ఎస్సీ, ఎస్టీల్లా చైతన్యవంతమైన ఉద్యమాలు చేయని బీసీ సామాజిక వర్గాలు ఏనాడూ ప్రభుత్వాలను సబ్ ప్లాన్ గురించి గట్టిగా అడిగింది లేదు, సబ్​ప్లాన్​ చట్టాన్ని పొందింది లేదు. మెజారిటీ బీసీలకు సబ్​ప్లాన్ అంటే ఏమిటి? దాని వల్ల వచ్చే లాభాలు ఏమిటో తెలియదు. తెలిసిన కొద్ది మంది బీసీలు అడిగితే.. వారిని ప్రభుత్వం పట్టించుకోదు. ఫలితంగా బడ్జెట్​లో ప్రభుత్వం విదిల్చిన దానితోనే సర్దుకుని బీసీ గురుకులాలను నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో బీసీ గురుకులాల నుంచి అద్భుతమైన ఫలితాలు ఆశించడం అత్యాశే అవుతుంది. బీసీ సమాజం ఇప్పటికైనా మేల్కొని ఈ సబ్ ప్లాన్ కోసం పోరాడి సాధిస్తే బీసీ గురుకుల పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది.

బీసీ గురుకులాలకు పక్కా భవనాలు లేవు
సబ్ ప్లాన్ నిధులు ఇచ్చిన దన్నుతో కానీ ఇతర నిధులతో కానీ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకులాలు చాలా వాటికి పక్కా భవనాలు ఉన్నాయి. చదువులోనే కాకుండా మ్యూజిక్, స్పోర్ట్స్ లో ఆసక్తి ఉన్న స్టూడెంట్ల కోసం ప్రత్యేక స్కూళ్లను ప్రారంభించారు. సైన్యంలో చేరాలనుకున్న బాల బాలికలకు వేర్వేరుగా సైనిక్ స్కూల్స్, ఆర్మ్​డ్​​ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజీలు ప్రారంభించారు. ఇంటర్ తర్వాత అమ్మాయిలకు తల్లిదండ్రులు చిన్నతనంలోనే పెళ్లి చేస్తున్నారనే ఉద్దేశంతో 50కిపైగా డిగ్రీ కాలేజీలు ప్రారంభించారు. ఇవే కాకుండా ఐఐటీ, నీట్, సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షల కోసం ప్రత్యేకమైన సెంటర్ ఆఫ్ ఎక్స్​లెన్స్​ కాలేజీలు, కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. వాటికి అనుగుణంగానే ఆయా రంగాల్లో సాంఘిక సంక్షేమ, గురుకుల సంక్షేమ విద్యాలయాల్లో చదివే స్టూడెంట్లు అత్యద్భుత ప్రతిభను మనం చూడగలుగుతున్నాం. కానీ మొదటి నుండి నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న బీసీ గురుకులాలకు ఇట్లాంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు కానీ, పక్క బిల్డింగులు కానీ లేక ఇంటర్ వరకు సాధారణ విద్యను అందించి ఇంటికి పంపుతున్నారు. ఇంటర్ తర్వాత చదువుకోడానికి ఇంటి దగ్గర పరిస్థితులు సహకరించని పేద స్టూడెంట్లు రోడ్డుపై పడుతున్నారు. తల్లిదండ్రులు అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసి మరో ఇంటికి పంపుతున్నారు. సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకులాల్లో అమలవుతున్న ప్రత్యేక సౌకర్యాలు బీసీ సంక్షేమ, మైనార్టీ సంక్షేమ గురుకులాల్లో కూడా అమలైతేనే మనం అద్భుత ఫలితాలను ఇక్కడ కూడా చూడగలం. అందుకు ప్రభుత్వానికి కృతనిశ్చయం, చిత్తశుద్ధి అవసరం.

అధికారులు ప్రణాళికా లోపం
సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకులాల్లో అధికారులు చక్కటి ప్రణాళికతో చదువులోనే కాకుండా స్టూడెంట్లు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాయిస్ ఫర్ గర్ల్స్, యూత్ పార్లమెంట్, స్పెల్ బి వంటి కార్యక్రమాలు పిల్లలలో అంతర్గతంగా ఉన్న ప్రతిభను వెలికి తీస్తున్నాయి. వారిలో ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాయి. ఎండాకాలం సెలవుల్లో ప్రత్యేకంగా నిర్వహించే సమ్మర్ సమురాయ్ క్యాంపుల్లో స్టూడెంట్లకు గుర్రపు స్వారీ, స్విమ్మింగ్, విదేశీ భాషలు, జర్నలిజం, ఫిలిం మేకింగ్, యాక్టింగ్, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం, కోడింగ్ మొదలైన వినూత్నమైన రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు. కానీ బీసీ, మైనారిటీ గురుకులాల్లో ఇవి పెద్దగా జరగవు. దానితో స్టూడెంట్లు పుస్తకాలు ఉన్నది చదివి పరీక్షలు రాయడం తప్ప ఇతర రంగాల్లో రాణింపు ఉండటం లేదు. కనుక ఆయా కార్యక్రమాలను బీసీ గురుకులాల్లో కూడా అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధమైన మార్పులు బీసీ, మైనార్టీ గురుకులాల్లో కూడా వచ్చి ఇక్కడి పిల్లలు కూడా అన్ని రంగాల్లో తారాజువ్వల్లా వెలగాలని ఆశిద్దాం. అందుకోసం ప్రభుత్వాలు, అధికారులకు వినతిపత్రాలు ఇద్దాం. అవసరమైతే ఉద్యమాలకు సిద్ధం కావాలి.

                                                                                                                                                                                                                                                                - జ్ఞాన శోధక్, హైదరాబాద్

Tagged budget, Officers, st, sc, KCR government, Telangana BC Gurukulas, Sub Plans, Minority Gurukulas

Latest Videos

Subscribe Now

More News