
- పశు సంవర్ధక శాఖ ఆఫీసులో ఫైల్స్ మాయం
- మాజీ మంత్రి తలసాని ఓఎస్డీపై కేసు నమోదు
- సహకరించిన సిబ్బందిపై కూడా
మెహిదీపట్నం, వెలుగు : హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని పశు సంవర్ధక శాఖ ఆఫీసులో కొన్ని ముఖ్యమైన ఫైల్స్మాయమయ్యాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్ శుక్రవారం రాత్రి మాసబ్ ట్యాంక్ లోని ఆఫీసులోకి అక్రమంగా ప్రవేశించి, సిబ్బంది సహాయంతో బీరువాలో ఉన్న ఫైళ్లను చింపివేసి, కొన్ని ముఖ్యమైన ఫైల్స్‌ను తన కారులో తీసుకెళ్లాడు. ఈమేరకు వాచ్మెన్ మందాల లక్ష్మయ్య ఫిర్యాదుతో పోలీసులు కల్యాణ్‌పై కేసు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి ఆఫీస్ బిల్డింగ్‌ను తనిఖీ చేసేందుకు అధికారులు వెళ్లగా.. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కల్యాణ్ కార్యాలయం గదిలోని ఫైల్స్ అన్ని చిందరవందరగా పడి ఉన్నాయని పోలీసులు తెలిపారు.
కల్యాణ్.. అనుమతి లేకుండా ప్రవేశించి, కంప్యూటర్ ఆపరేటర్స్ ఎలిజా, మోహన్, అటెండర్ వెంకటేశ్, ప్రశాంత్ సహాయంతో బీరువాలోని ఫైళ్లను చించేసి, మరికొన్ని ఫైళ్లను నల్లని పెద్ద కవర్లో తీసుకెళ్లినట్లు వాచ్ మెన్ తెలిపాడని పోలీసులు వెల్లడించారు. ప్రభుత్వం మారడంతో వివిధ శాఖల ఫైల్స్‌ను డిపార్ట్మెంట్ నుంచి బయటికి తీసుకువెళ్లొద్దని సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వుల జారీ చేశారన్నారు. పదవి పోయి 4 రోజులైనా.. అనుమతి లేకుండా వచ్చి ఫైల్స్ చించేసి సంచుల్లో మూటకట్టి కారులో తీసుకెళ్లిన కల్యాణ్‌పై, సహకరించిన సిబ్బందిపై కేసు నమోదు చేసినట్లు నాంపల్లి ఎస్సై తెలిపారు.