WTC Final: ఆస్ట్రేలియాను దెబ్బ కొట్టడానికి కొత్త స్కెచ్.. టెస్ట్ ఛాంపియన్ షిప్ ముందు సౌతాఫ్రికా మాస్టర్ ప్లాన్

WTC Final: ఆస్ట్రేలియాను దెబ్బ కొట్టడానికి కొత్త స్కెచ్.. టెస్ట్ ఛాంపియన్  షిప్ ముందు సౌతాఫ్రికా మాస్టర్ ప్లాన్

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ షిప్ లో ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించడం అంత శక్తికి మించిన పని. ఐసీసీ ఫైనల్స్ లో కంగారూల జట్టును ఢీ కొట్టి గెలవడం దాదాపు అసాధ్యం. అది కూడా ఇప్పటివరకు ఐసీసీ టైటిల్ గెలవని సౌతాఫ్రికా.. ఆస్ట్రేలియాపై టైటిల్ గెలిస్తే అది అద్భుతమనే అని చెప్పాలి. అయితే సౌతాఫ్రికా కమ్మిన్స్ సేనను ఓడించడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టు సమాచారం. టెస్ట్ ఛాంపియన్స్ షిప్ ఫైనల్ సరిగ్గా వారం రోజులు ముందు సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ గడ్డపై జింబాబ్వేతో నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి.

ఇంగ్లాండ్ లో పరిస్థితులను అర్ధం చేసుకోవడానికి సౌతాఫ్రికాకు ఇది కాస్త ఊరట కలిగించే విషయమనే చెప్పాలి. జూన్ 3 న సస్సెక్స్ తో సౌతాఫ్రికా వార్మప్ మ్యాచ్ ఆడనున్నారు. ప్రస్తుతం సౌతాఫ్రికా ప్లేయర్స్ ఐపీఎల్‌లో ఆడుతూ బిజీగా ఉన్నారు. గ్రూప్ దశ ముగిసిన తర్వాత చాలా మంది సఫారీ క్రికెటర్లు ఇంగ్లాండ్‌కు వెళతారు. ఒకవేళ తమ జట్లు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తే మే 25న టోర్నమెంట్ ముగిసిన తర్వాత మిగిలిన వారు సౌతాఫ్రికా జట్టులో చేరతారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-25 లో భాగాంగా  ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు అధికారికంగా డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరుకున్నాయి. 

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ వేదిక ఇప్పటికే ఖరారైంది. ఈ మెగా ఫైనల్ మ్యాచ్ కు తొలిసారి లార్డ్స్ వేదిక కానుంది. ఈ  ఏడాది (2025) జూన్ 11 నుంచి 15 మధ్య ఐకానిక్ లార్డ్స్‌లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జరుగుతుందని ఐసీసీ 2024 సెప్టెంబర్ 3 న ప్రకటించింది. జూన్ 16ని రిజర్వ్ డేగా కేటాయించారు. వరుసగా మూడోసారి ఈ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఇంగ్లాండ్ లోనే జరగబోతుంది. 

ఇప్పటివరకు జరిగిన రెండు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ లు సౌతాంప్టన్ (2021), ఓవల్ (2023) వేదికలుగా జరిగాయి. 2021 లో జరిగిన ఫైనల్లో భారత్ పై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 2023  ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా 229 పరుగుల భారీ తేడాతో భారత్ ను ఓడించింది. ఆస్ట్రేలియా వరుసగా రెండో సారి టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు అర్హత సాధించగా.. సౌతాఫ్రికాపై ఇదే తొలిసారి.