రైతులకు రుణమాఫీ

రైతులకు రుణమాఫీ
  • ఎస్పీ మేనిఫెస్టోలో ప్రకటించిన అఖిలేశ్
  • పేదలకు ఏటా రెండు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ
  • అమ్మాయిలకు పీజీ దాకా ఉచిత చదువులు
  • సమాజ్‌‌వాదీ క్యాంటీన్లు, రేషన్ షాపుల ఏర్పాటు

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే రైతు రుణాలను మాఫీ చేస్తామని సమాజ్‌‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. ఉపాధి హామీ పథకం తరహాలో అర్బన్ ఎంప్లాయ్‌‌మెంట్ గ్యారంటీ యాక్ట్‌‌ను తీసుకొస్తామని పేర్కొన్నారు. ప్రైమరీ నుంచి పీజీ దాకా ఆడపిల్లలకు ఉచితంగా చదువు చెప్పిస్తామన్నారు. ‘సత్య వచన్.. అటూట్ వాదా’ అనే ట్యాగ్‌‌లైన్‌‌తో ‘సమాజ్‌‌వాదీ వచన్ పత్ర్’ పేరుతో 88 పేజీల మేనిఫెస్టోను అఖిలేశ్ మంగళవారం రిలీజ్ చేశారు. తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌‌లో మాట్లాడారు. ‘‘2012లో మేం మేనిఫెస్ట్ రిలీజ్ చేయడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ఆయా హామీలను అమలు చేసేందుకు అన్ని డిపార్ట్‌‌మెంట్లతో మీటింగ్ నిర్వహించడం నాకు ఇంకా గుర్తుంది. అన్ని హామీలను అమలు చేశాం. ఇప్పుడు ‘సమాజ్‌‌వాదీ వచన్ పత్ర్’ మేనిఫెస్టోతో ఎన్నికలకు వెళ్తున్నాం” అని చెప్పారు.

మేనిఫెస్టోలోని హామీలివీ..

  • నాలుగేళ్లలో రుణమాఫీ పూర్తి. 2025 నాటికి రైతులకు రుణవిముక్తి.
  • అన్ని పంటలకు కనీస మద్దతు ధర. 
  • చెరుకు రైతులకు 15 రోజుల్లోనే చెల్లింపులు. ఇందుకోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు.
  • సాగు చట్టాల రద్దు ఆందోళనల్లో చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.25 లక్షల సాయం.
  • వ్యవసాయానికి ఉచిత కరెంట్, 
  • వడ్డీలేని రుణం, ఇన్సూరెన్స్, పెన్షన్.
  • ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్.
  • ప్రతి ఇంటికీ 300 యూనిట్ల ఉచిత కరెంట్.
  • ఇంటర్ కంప్లీట్​ చేసిన అమ్మాయిలకు రూ.36 వేలు, ఒక ల్యాప్‌‌టాప్.
  • దారిద్ర్య రేఖకు దిగువ(బీపీఎల్)న ఉన్న పెద్దలకు, అవసరంలో ఉన్న మహిళలకు, ఫ్యామిలీలకు ఏటా రూ.18 వేల పెన్షన్‌‌ స్కీమ్‌‌.
  • కార్మికులు, మేస్త్రీలు, ఇండ్లు లేని వాళ్లకు తక్కువ ధరకు నిత్యావసరాలు అందజేసేందు కు క్యాంటీన్లు, కిరానా స్టోర్లు ఏర్పాటు.
  • రూరల్ ఎకానమీకి ఊతమిచ్చేందుకు రూ. లక్ష కోట్లు కేటాయింపులు
  • రాష్ట్రవ్యాప్తంగా సమాజ్‌‌వాదీ క్యాంటీన్లు. రూ.10కే భోజనం.
  • ప్రతి మండలంలో ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్.
  • పేద కుటుంబాలకు ఏటా 2 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ.
  • టూ వీలర్లు ఉన్నోళ్లకు నెలనెలా లీటర్ పెట్రోల్. ఆటో ఓనర్లకు ప్రతి నెలా 6 లీటర్ల పెట్రోల్, 3 కిలోల సీఎన్‌‌జీ గ్యాస్ ఫ్రీ.

మరిన్ని వార్తల కోసం..

బీబీసీ అవార్డు రేసులో సింధు

నాగార్జున డబుల్‌‌ స్పీడ్