ల్యాండ్​ డిగ్రెడేషన్​ అట్లాస్​

ల్యాండ్​ డిగ్రెడేషన్​ అట్లాస్​

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలోని స్పేస్​ అప్లికేషన్​ సెంటర్​ డెసెర్టిఫికేషన్​ అండ్​ ల్యాండ్​ డీగ్రెడేషన్​  అట్లాస్​ను విడుదల చేసింది.  దేశవ్యాప్తంగా 2011–13 నుంచి 2018–19 మధ్యకాలంలో కొత్తగా 14.5 లక్షల హెక్టార్ల భూమి సారం కోల్పోయింది. ఈ కాలంలో అత్యధికంగా మహారాష్ట్రలో 4,80,094 హెక్టార్ల భూమి ఎడారీకరణ/ క్షీణతకు గురై ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 2018–19 నాటికి మొత్తం 9.78 కోట్ల హెక్టార్ల (29.77శాతం) భూమి క్షీణతకు గురైంది. 

తెలంగాణ: రాష్ట్ర మొత్తం భూభాగం 1,14,84,000 హెక్టార్లు కాగా అందులో 36,38,508 హెక్టార్లు (31.68శాతం) ఎడారీకరణకు గురైంది. తెలంగాణ రాష్ట్రంలో 2003–05 వరకు భూక్షీణతకు గురైన ప్రాంతం 31.86శాతం కాగా 2011–13 నాటికి ఆ మొత్తం 31.34శాతానికి తగ్గింది. అంటే ఆ పదేళ్లలో భూక్షీణతలో 0.52శాతం తగ్గుదల (59,626 హెక్టార్లు) నమోదైంది. 2011–13 నుంచి 2018–19 మధ్యకాలంలో మాత్రం భూక్షీణత 0.34శాతం(39,652 హెక్టార్లు) మేరకు పెరిగింది. ఇదే కాలంలో నీటి కోతకు గురయ్యే వ్యవసాయ భూముల విస్తీర్ణం తగ్గింది. అయితే మానవ చర్యలు, లవణీకరణతో క్షీణతకు గురైన భూమి పెరిగింది. 

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో భూసార క్షీణత: రాష్ట్రాలవారీ భూభాగాల పరంగా చూస్తే ఇప్పటివరకు ఝార్ఖండ్​లో 68.77శాతం, రాజస్తాన్​లో 62.06శాతం, ఢిల్లీలో 61.73శాతం, గోవాలో 52.64శాతం, గుజరాత్​లో 52.22శాతం, నాగాలాండ్​లో 50శాతం, మహారాష్ట్రలో 46.49శాతం, హిమాచల్​ప్రదేశ్​లో 43.11శాతం, త్రిపురలో 42.66శాతం, మేఘాలయలో 24.86శాతం, జమ్ముకశ్మీర్​లో 20.86శాతం, పశ్చిమబెంగాల్​లో 20.10శాతం, ఛత్తీస్​గఢ్​లో 17.06శాతం, ఆంధ్రప్రదేశ్ లో 14.84శాతం భూసారం క్షీణతకు గురైంది.