జనాభా పెరుగుతోంది కానీ.. 

జనాభా పెరుగుతోంది కానీ.. 
  • ‘‘అబ్బా! ఏం జనం ఇంతకుముందు ఎప్పుడూ ఈ జాతరల ఇంత మందిని చూడలేదు.’’
  • ‘‘పట్నంల ఒక ఎగ్జిబిషన్​​ పోయిన. ఇసుక పోస్తే రాలనంత మంది వచ్చిన్రు’’
  • ‘‘పదేండ్ల కింద చార్మినార్ చూడనీకి పోయినప్పుడు ఓ వెయ్యి మంది కూడా లేరు. మొన్న పోయినప్పుడు రోడ్ల మీద చీమల లెక్కనే కుప్పలు తెప్పలు ఉన్నరు జనాలు’’
  • ‘‘అప్పట్లో బంజారాహిల్స్​, జూబ్లీహిల్స్​ దిక్కు పోవాల్నంటేనే భయమయితుండే... అంతా జంగిల్. కానీ.. ఇప్పుడు ఎటు చూసినా మనుషులే కనిపిస్తున్నరు. పట్నం అన్ని దిక్కుల మస్తు పెరిగింది. ఏ గల్లీల  చూసినా వేల మంది కనిపిస్తున్నరు. అబ్బా యాడికెళ్లి వచ్చిన్రు రా ఇంత మంది!’’
  • ఇలాంటి మాటలు ఎప్పుడూ వింటూనే ఉంటం. కానీ.. అందుకు కారణాల గురించి ఆలోచిస్తే.. ముందుగా మదిలో తట్టేది ‘‘జనాభా పెరుగుదల”. జనాభా పెరిగినందుకే పట్నాలు, పల్లెలు విస్తరిస్తున్నయ్​.  
  • ఈ పరిస్థితి ఇంకెన్నాళ్లు? అంటే ఇంకొన్నాళ్లే!  అంటున్నారు డెమోగ్రాఫర్స్. ఎందుకంటే.. రానున్న కాలంలో ప్రపంచ జనాభా వరుసగా తగ్గుతుంది అంటున్నారు వాళ్లు. 
  •  

ఒకప్పుడు  ఒక ఊళ్లో 200 ఇండ్లు ఉండేటివి. ఇప్పుడు 350 ఇండ్లు ఐనయ్​. ఊళ్లో ఇండ్లు కట్టడానికి ప్లేస్​ లేక, ఊరికి ఆనుకుని ఉన్న పొలాల్లో కట్టుకుంటున్నరు. ఒకప్పుడు ఊరికి దూరంగా ఉండే భూముల్లో పంటలు పండించేవాళ్లు కాదు. కానీ.. ఇప్పుడు అలాంటి బీడు భూములను కూడా దున్నుతున్నరు. 

‘‘మా ముత్తాతకు 100 ఎకరాలు ఉండేది. ఆయనకు పుట్టిన నలుగురికి తలా 25 ఎకరాలు పంచిండు. వాళ్లు కూడా వాళ్లకు పుట్టిన పిల్లలకు తలా 5 ఎకరాలు పంచిన్రు. చివరికి నాకు ఎకరా వచ్చింది. ఇప్పుడు నా కొడుకులకు పంచితే అరెకరా వస్తది” ఓ పెద్దాయన చెప్తున్న మాటలివి. 

ఇది మన దగ్గర మాత్రమే కాదు. చాలా దేశాల్లో ఉన్న సమస్యే. జనాభా పెరగడంతో ఊళ్లు పెరుగుతున్నాయి. కమతాల విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. అంతేకాదు.. జనాభా పెరుగుదల ఎన్నో సమస్యలకు కారణమవుతోంది. అలాగే, దీనివల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యే ప్రపంచ జనాభా 8  బిలియన్ల(800 కోట్లు) మార్క్​ని దాటింది. మానవ జాతి చరిత్రలో ఇదొక మైలురాయి. 7 నుండి 8 బిలియన్లకు పెరగడానికి 12 సంవత్సరాలు పట్టింది. ఇది 9 బిలియన్లకు చేరుకోవడానికి సుమారు 15 సంవత్సరాలు పడుతుందని అంచనా. అంటే ఇదివరకు 12 ఏండ్లలో పెరిగిన జనాభా.. ఇప్పుడు 15 ఏండ్లలో పెరుగుతుంది. ఇకనుంచి కొన్నేండ్లపాటు ప్రపంచ జనాభా వృద్ధి రేటు తగ్గుతూనే ఉంటుందని డెమోగ్రాఫర్లు ​(జనాభాపై రీసెర్చ్​ చేసేవాళ్లు) చెప్తున్నారు. 

200 ఏండ్లలో ఏడు రెట్లు 

వాస్తవానికి ప్రపంచ జనాభా ఒక బిలియన్‌‌‌‌కు చేరుకోవడానికి వందల వేల ఏండ్లు పట్టింది. కానీ.. ఆ తర్వాత కేవలం 200 ఏండ్లలో అది ఏడు రెట్లు పెరిగింది. 2011 నాటికి ప్రపంచ జనాభా ఏడు బిలియన్ల మార్కును చేరుకోగా 2022 చివరి నాటికి అది ఎనిమిది బిలియన్లకు చేరుకుంది. ఒక రకంగా దీనికి కారణం మనిషి తెలివి పెరగడమే. అందువల్లే సైన్స్​ డెవలప్​ అయింది. దాంతో మరణాల రేటు తగ్గింది. కొన్ని వందల ఏండ్ల కిందట పెండ్లి వయసు రాకముందే చాలామంది అనారోగ్యంతోనూ, పౌష్టికాహారం లేక చనిపోయేవాళ్లు. కానీ.. సైన్స్​ డెవలప్​ అవుతున్న కొద్దీ మరణాల రేటు తగ్గుతూ వచ్చింది. అందుకు అనుగుణంగా ఫెర్టిలిటీ రేటు కూడా పెరిగింది. అందువల్ల జనాభా కూడా పెరుగుతూ వచ్చింది. 

మరో 90 ఏండ్లకు రెట్టింపు

20వ శతాబ్దం మధ్యలో ఉన్న దాని కంటే ఇప్పుడు ప్రపంచ జనాభా మూడు రెట్లు ఎక్కువ. ముఖ్యంగా 1950 నుంచి జనాభా విపరీతంగా పెరిగింది. 1950లో 2.5 బిలియన్లు ఉన్న జనాభా కేవలం 37 ఏండ్లలోనే రెట్టింపు అయింది. 1987లో ప్రపంచ జనాభా 5 బిలియన్ల మార్కును దాటింది. ఆ తర్వాత కూడా జనాభా స్పీడ్​గానే పెరిగింది. కానీ.. ఇకనుంచి జనాభా పెరిగే స్పీడ్​ తగ్గుతుందని రీసెర్చర్లు అంచనా వేస్తున్నారు. ప్రపంచ జనాభా మళ్లీ రెట్టింపు కావడానికి 90 ఏండ్లకు పైగా పట్టే అవకాశం ఉంది. 1987లో 5 బిలియన్లు ఉన్న జనాభా 2080 ప్రాంతాల్లో 10.4 బిలియన్లకు చేరుతుంది. ఇప్పటివరకు మొత్తంగా 1962–1965 మధ్య కాలంలోనే అత్యంత వేగంగా జనాభా పెరుగుదల రికార్డు అయింది. అప్పటి నుంచి ఫెర్టిలిటీ రేటు తగ్గుతూ రావడం వల్ల జనాభా పెరుగుదల వేగం సగానికి పైగా తగ్గింది. 2020లో 1950 తర్వాత మొదటిసారిగా జనాభా పెరుగుదల రేటు సంవత్సరానికి ఒక శాతం కంటే తక్కువకు పడిపోయింది. రాబోయే రోజుల్లో ఇది మరింత తగ్గే అవకాశం ఉంది. 

ఫెర్టిలిటీ రేటు 

ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. ఒక మహిళ పూర్తి రీ ప్రొడక్టివ్​ ఏజ్(15 నుంచి 49 ఏండ్ల వయసు)​లో జన్మనిచ్చిన సగటు పిల్లల సంఖ్యనే ఫెర్టిలిటీ రేటుగా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఫెర్టిలిటీ రేటు తగ్గుతూ వస్తోంది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ట్రెండ్​ ఎక్కువగా కనిపిస్తోంది. రాబోయే సంవత్సరాల్లో ఫెర్టిలిటీ రేటు అంచనాల కంటే తక్కువగా తగ్గితే ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచ జనాభా పన్నెండు బిలియన్లకు మించి ఉంటుంది. అంచనా కంటే ఎక్కువగా తగ్గితే 2100 నాటికి దాదాపు తొమ్మిది బిలియన్లకు చేరుకుంటుంది. ఈ మధ్య ఫెర్టిలిటీ రేట్లు, లైఫ్​ టైం అంచనాల్లో అనేక మార్పులు వచ్చాయి. 1970ల మొదట్లో ఫెర్టిలిటీ రేటు నాలుగు ఉండేది. అదే 2021 నాటికి రెండుకు పడిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు మేలు జరిగినా.. అభివృద్ధి చెందిన దేశాలకు మాత్రం ఇబ్బందులు తప్పవు. 

ఆయుర్దాయం

ప్రపంచంలో మనిషి సగటు ఆయుర్దాయం(యావరేజ్​ లైఫ్​ ఎక్స్​పెక్టెన్సీ, జీవితకాలం) కొంత కాలంగా బాగా పెరిగింది. ఇది కూడా జనాభా పెరుగుదలకు ఒక కారణమే. 1840ల్లో ప్రజల సగటు ఆయుర్దాయం 40 సంవత్సరాలకు మించేది కాదు. ఆ తరువాత పోషకాహారం అందుతోంది. పరిసరాలు శుభ్రంగా ఉంటున్నాయి. సైన్స్​ డెవలప్​ అయింది. ఈ కారణాల వల్ల సగటు ఆయుర్దాయం వరుసగా పెరుగుతూ వచ్చింది. 1990ల మొదట్లో మనిషి ఆయుర్దాయం సుమారు 64 సంవత్సరాలు ఉండేది. 2021 నాటికి 71 సంవత్సరాలకు పెరిగింది. ఇది ఇంకా ఎక్కువగానే ఉండేది. కానీ.. కరోనా వల్ల పెరుగుదల కాస్త తగ్గింది. కరోనాకు ముందు 2019లో 73 సంవత్సరాలు ఉంది. ఆయుర్దాయం పెరుగుతుంటే.. జనాభా కూడా పెరిగింది. అయితే.. జనాభా పెరిగిన కొద్దీ పట్టణాలు పెరిగాయి. ఎందుకంటే జనాలు ఎక్కువగా పట్టణాల్లో ఉండడానికే ఇష్టపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలు పెరిగాయి.  2007 నాటికి ప్రపంచ జనాభాలో ఎక్కువ శాతం గ్రామాల్లో కంటే పట్టణాల్లోనే ఉన్నారు. 2050 నాటికి ప్రపంచ జనాభాలో 68 శాతం మంది సిటీల్లోనే ఉంటారనేది ఒక అంచనా. 

పెరుగుతూనే ఉంది

రెండు శతాబ్దాలుగా ప్రపంచ జనాభా పెరుగుతుండడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మెడికల్ ఫీల్డ్​లో వచ్చిన మార్పులు, ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో పేదరికం తగ్గడం వల్ల మరణాల సంఖ్య తగ్గింది. ఇది కూడా జనాభా పెరుగుదల లాంటిదే. మరి ఆయుర్దాయం పెరిగింది. ఫెర్టిలిటీ రేటు తగ్గుతుంది కదా! అలాంటప్పుడు జనాభా ఎందుకు తగ్గడంలేదు? అనే ప్రశ్న చాలామందిలో తలెత్తుతోంది. కానీ.. ఫెర్టిలిటీ రేటు కంటే కూడా మరణాల రేటు మరింత ఎక్కువగా తగ్గింది. అందుకే జనాభా పెరుగుతూ వచ్చింది. ఫెర్టిలిటీ రేటు తగ్గినప్పుడు మరణాల రేటు పెరిగితే జనాభా సంఖ్యలో పెరుగుదల తగ్గేది. గతంలో ఫెర్టిలిటీ రేటు ఎక్కువగా ఉండేది. కొన్నేండ్ల క్రితం సర్వైవల్​ రేటు కూడా పెరిగింది. కాబట్టి, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రీ ప్రొడక్టివ్​ ఏజ్​లో ఉన్న ఆడవాళ్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. 

ఒక్కో దేశంలో ఒక్కోలా!

జనాభా పెరుగుదల ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంది. కొన్ని దేశాల్లో అవసరమున్న దానికన్నా తక్కువ వృద్ధి రేటు రికార్డు అవుతోంది. కొన్ని దేశాల్లో ఎక్కువగా ఉంటుంది. అంతగా అభివృద్ధి చెందని దేశాల్లో 2022 –2050 మధ్య జనాభా రెట్టింపు అవుతుందని అంచనా. మరోవైపు, ఫెర్టిలిటీ రేటు తగ్గడం, వలసల వల్ల ప్రపంచవ్యాప్తంగా 60 కంటే ఎక్కువ దేశాల్లో జనాభా తగ్గిపోతుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. ఎక్కువ ఆదాయం ఉండే దేశాల్లో ఫెర్టిలిటీ రేటు కంటే వలసలదే జనాభా రేటు పెరగడంలో కీ రోల్. 

తగ్గినా.. పెరిగినా.. 

జనాభా తక్కువ టైంలో పెరిగినా లేదా తగ్గినా సమస్యే. గడిచిన ఒకట్రెండు దశాబ్దాల్లో జనాభా పెరిగింది కాబట్టి ప్రస్తుతం యువకులే ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు ఫెర్టిలిటీ రేటు తక్కువగా ఉండడం వల్ల చిన్నపిల్లల సంఖ్య తగ్గుతూ వస్తోంది. కొన్నేండ్లకు వీళ్లంతా యూత్​ అవుతారు. ఇప్పటి యూత్​ ముసలివాళ్లు అవుతారు. అప్పుడు యూత్​ సంఖ్య తక్కువగా ముసలివాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. దేశానికి తలకుమించిన భారంగానే మారుతుంది. అందుకే జనాభా పెరగడం, తగ్గడం.. ఏదైనా చాలా ఎక్కువ టైంలో జరగాలి. ఒకవేళ జనాభా ఒక్కసారిగా పెరిగినా, యూత్​ సంఖ్య పెరుగుతుంది. అప్పుడు దేశాలు వాళ్లకు పనులు చూపించాలి. అందుకు కావాల్సిన వనరులు దేశంలో ఉండాలి. లేదంటే నిరుద్యోగం పెరిగిపోతుంది. అది కూడా దేశాలకు మంచిది కాదు. 

అన్ని దేశాలపై ఎఫెక్ట్​..

జనాభా పెరుగుదల పరిస్థితులు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉన్నా.. అది ప్రపంచం మొత్తం మీద ఎఫెక్ట్​ చూపించే ప్రమాదం లేకపోలేదు. గ్రీన్‌‌‌‌హౌస్ వాయువులు ఎక్కడ విడుదలైనప్పటికీ ప్రపంచ వాతావరణం మారుతుంది. అలాగే ఏ దేశంలోనైనా జనాభా విపరీతంగా పెరిగినా, తగ్గినా ఆ ఎఫెక్ట్​ డైరెక్ట్​గానో.. ఇన్​డైరెక్ట్​గానో అన్ని దేశాల మీద పడుతుంది. జనాభా తగ్గినా, పెరిగినా.. మానవాళికి సవాలే. 

మన పరిస్థితి ఏంటి? 

దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మన దేశాన్ని పీడిస్తున్న సమస్య జనాభా. ఈ సమస్య ఎప్పుడూ ప్రభుత్వాలను భయపెడుతూనే ఉంది. అందుకే 1952లో కుటుంబ నియంత్రణ పథకాన్ని తీసుకొచ్చారు. కానీ.. దాన్ని పెద్దగా అమలు చేయలేదు. ఆ తర్వాత 1972లో పబ్లిక్​ స్టెరిలైజేషన్ క్యాంపెయిన్​ని మొదలుపెట్టారు. అయినా.. జనాభా పెరుగుదలను కంట్రోల్​ చేయడంలో అనుకున్నంత సక్సెస్​ కాలేదు. 1960లో  దేశంలో ఫెర్టిలిటీ రేటు 5.91గా ఉండేది. అంటే ఒక ఇంట్లో సగటున ఆరుగురు పిల్లలు ఉండేవాళ్లు. కానీ.. 1960  నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చింది. కానీ.. ఆ తగ్గుదల చాలా నెమ్మదిగా జరిగింది. పోయినేడాది నవంబర్​లో 2019–21 ఏండ్లకు సంబంధించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేను గవర్నమెంట్​ రిలీజ్​ చేసింది. దీని ప్రకారం మన దేశంలో మొదటిసారిగా ఫెర్టిలిటీ రేటు 2.1 కంటే తక్కువకు పడిపోయింది. ఎఫ్​హెచ్​ఎస్​–-4(2015-–2016) ప్రకారం దేశంలో ఫెర్టిలిటీ రేటు 2.2 ఉండేది. అందులోనూ పట్టణ ప్రాంతాల్లో మరీ తక్కువగా 1.6  మాత్రమే ఉంది. దేశంలో బీహార్ (3.0), మేఘాలయ (2.9), ఉత్తరప్రదేశ్ (2.7), జార్ఖండ్ (2.4), మణిపూర్ (2.2) రాష్ట్రాల్లో ఎక్కువ ఫెర్టిలిటీ రేటు ఉంది. అన్నింటికంటే తక్కువగా సిక్కింలో 1.1 మాత్రమే ఉంది. ఫెర్టిలిటీ రేటు 2 ఉందంటే.. ఒక జంట దాదాపు ఇద్దరిని కంటున్నారని అర్థం. సిక్కిం, లడఖ్, గోవా, అండమాన్– నికోబార్, లక్షద్వీప్, జమ్మూ–కాశ్మీర్, చండీగఢ్‌‌‌‌లలో ఫెర్టిలిటీ రేటు 1.5 కంటే తక్కువగా ఉంది. కొన్నేండ్లలో ఈ ప్రాంతాల్లో జనాభా తగ్గుతుంది. 

చైనాను మించి..

ఐక్యరాజ్యసమితి రిలీజ్​ చేసిన వరల్డ్​ పాపులేషన్​ డాటా షీట్​–2021 ప్రకారం.. మన దేశ జనాభా 2023లో చైనా జనాభాను దాటిపోతుంది. మన జనాభా పెరగడమే కాదు.. చైనా జనాభా పెరగకపోవడం కూడా దీనికి కారణమే అంటున్నారు ఎక్స్​పర్ట్స్​. చైనా1979లో ‘వన్ చైల్డ్’ (ఒకే బిడ్డ) విధానాన్ని తీసుకొచ్చింది. అందుకే జనాభా పెరుగుదల బాగా తగ్గింది. ఇక నుంచి మరింత తగ్గే అవకాశం ఉంది. 2100 నాటికి 73.2 కోట్లకు తగ్గుతుందని ఒక అంచనా. చైనాలో ఫెర్టిలిటీ రేటు 2019లో 70 ఏండ్ల కనిష్ఠానికి పడిపోయింది. అందువల్లే ఇండియా ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారే అవకాశం ఉంది. అంతేకాదు.. చైనాలో కొన్నేండ్లలో ముసలివాళ్ల సంఖ్య బాగా పెరిగి, గవర్నమెంట్​కు తలకుమించిన భారం అయ్యే అవకాశమూ లేకపోలేదు.  

ఎందుకు తగ్గుతోంది?

మన దేశంలో ఫెర్టిలిటీ రేటు తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. గవర్నమెంట్లు ‘‘అధిక సంతానం” మీద ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. పైగా చదువుకున్నవాళ్లలో చాలామంది ఒకరు లేదా ఇద్దర్నే కంటున్నారు. ఎన్​ఎఫ్​హెచ్​ఎస్​–4తో పోలిస్తే... ప్రస్తుతం  కాంట్రసెప్టివ్స్​(గర్భనిరోధక సాధనాలు) వాడే ఆడవాళ్ల సంఖ్య13 శాతం పెరిగింది. ప్రస్తుతం దేశంలో సగటున 67 శాతం మంది కాంట్రసెప్టివ్స్​ వాడుతున్నారు. ఇదివరకు శిశు మరణాలు ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువమంది పిల్లల్ని కనేవాళ్లు. కానీ.. ఇప్పుడు హాస్పిటల్​లో పిల్లల్ని కనేవాళ్ల సంఖ్య కూడా 79 శాతం నుంచి 89 శాతానికి పెరిగింది. అందులోనూ దేశంలో 76 శాతం మంది పిల్లలకు క్రమం తప్పకుండా టీకాలు వేయిస్తున్నారు. కాబట్టి శిశు మరణాలు తగ్గాయి. అందుకే ఒకర్ని లేదా ఇద్దరినే కనాలనుకునేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. 

పిల్లల సంఖ్య..

ఫెర్టిలిటీ రేటు తగ్గుతుండడంతో మన దేశంలో మొత్తం జనాభాలో 15 ఏళ్లలోపు పిల్లల శాతం వేగంగా తగ్గుతోంది. ఎన్​ఎఫ్​హెచ్​ఎస్​–1 (1992–-93) ప్రకారం ఈ వయస్సులోపు పిల్లల జనాభా 38 శాతం ఉండగా ఇప్పుడు అది 26.5 శాతానికి తగ్గింది. అంటే భవిష్యత్తులో యువకుల సంఖ్య బాగా తగ్గే అవకాశం ఉంది. ఆ ఎఫెక్ట్​ దేశ ఆర్థిక, సామాజిక నిర్మాణంపై చూపిస్తుంది. 

చైనానే ఉదాహరణ

జనాభా తగ్గడం ఒక విధంగా మంచిదే. కానీ.. అది మరో రకంగా తలకు మించిన భారం అవుతుంది. దేశంలో యువశక్తి లేకపోతే.. కార్మిక శక్తి తగ్గిపోతుంది. అది దేశ ఆర్థిక బలాన్ని తగ్గిస్తుంది. అందుకే చైనా 2015లో ఒకే బిడ్డ విధానానికి స్వస్తి చెప్పింది. ఇద్దరు పిల్లల్ని కనే అవకాశం ఇచ్చింది. ఎందుకంటే.. చైనాలో డిపెండెన్సీ రేషియో బాగా పెరిగింది. వర్కింగ్​ ఏజ్​ జనాభా చైనా ఆర్థిక రాకెట్ ఇంజిన్‌‌‌‌కి ఫ్యుయెల్ లాంటిది. ఆ ఏజ్​ వాళ్ల సంఖ్య 1980లో 68 శాతం ఉండేది. 2015లో 38 శాతానికి తగ్గింది. వందల మిలియన్ల మంది చైనీయులు రిటైరయ్యే వయసులో ఉన్నారు. కానీ.. వాళ్ల ప్లేస్​లో జాయిన్​ కావడానికి సరిపడా యువకులు దేశంలో లేరు. 2020 నాటికి చైనాలో ఫెర్టిలిటీ రేటు1.3కి పడిపోయింది. అందుకే 2021లో చైనా ప్రభుత్వం మళ్లీ జనాభాను పెంచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇద్దరు పిల్లల విధానాన్ని ముగ్గురు పిల్లల పాలసీగా మార్చింది. కానీ.. అదే సంవత్సరం ఫెర్టిలిటీ రేటు మళ్లీ పడిపోయి1.15కి చేరింది. అందుకే చైనా రాబోయే రోజుల్లో నలుగురు పిల్లల పాలసీ తీసుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

తగ్గుతున్న దేశాలు

ప్రపంచ జనాభా 8 బిలియన్లు దాటింది! పెరుగుతున్న జనాభా ఎప్పటికైనా భారమే అని బాధపడాలో.. వాళ్ల దేశ పరిస్థితి గురించి బాధ పడాలో’’ అర్థంకాక కొట్టుమిట్టాడుతున్నాయి కొన్ని దేశాలు. ఎందుకంటే.. ప్రపంచ జనాభా రోజురోజుకూ పెరుగుతున్నా కొన్ని దేశాల్లో జనాభా పెరుగుదల రేటు చాలా తక్కువగా ఉంది. దేశ జనాభాలో చిన్నపిల్లల పర్సంటేజీ తగ్గుతూ వస్తోంది. ఇది ఫ్యూచర్​ని కలవరపెట్టే విషయమని ఎనలిస్ట్​లు చెప్తున్నారు. చాలా దేశాల్లో ఖాళీ ఊయలలు తక్కువగా.. వీల్​ చెయిర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటున్నారు.  ఒకప్పుడు బంగారాన్ని దేశ ఆస్తిగా చెప్పుకునేవాళ్లు. ఇప్పుడు ఫారెక్స్​ నిల్వలను ఆస్తిగా చెప్పుకుంటున్నారు. కానీ... భవిష్యత్తులో దేశంలోని యూత్​నే ఆస్తిగా చెప్పుకునే రోజులు రావొచ్చు. 
రష్యా, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, జపాన్, హంగేరి లాంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. కొన్ని దేశాల్లో ఒకరికంటే ఎక్కువమందిని కన్న తల్లిదండ్రులకు ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నారు. యూరప్​లో కూడా ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. అక్కడి జనాభా పెరుగుదల కొన్నేండ్లుగా తగ్గుతోంది. 

ఈ పరిస్థితి ఎందుకు? 

సాధారణంగా ఏ దేశంలో అయినా.. ఫెర్టిలిటీ రేటు తక్కువగా ఉంటే జనాభా తగ్గే అవకాశం ఉంటుంది. దాంతోపాటు రాజకీయ, ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, నేరాలు పెరగడం, యుద్ధం, వలసలు పెరగడం, రేసిజం, పేదరికం, నిరుద్యోగం, ప్రకృతి వైపరీత్యాలు లాంటివి ఎక్కువైనప్పుడు దేశ జనాభా పెరుగుదల రేటు తగ్గుతుంది. 

యూరప్​లో తక్కువ.. 

ఐక్యరాజ్యసమితి రిపోర్ట్​ ప్రకారం.. యూరప్​లోనే జనాభా ఎక్కువగా తగ్గే అవకాశం ఉంది. 2050 వరకు భారీగా జనాభా తగ్గుతుంది. బల్గేరియా, లాట్వియా, లిథువేనియా, సెర్బియా, ఉక్రెయిన్‌‌‌‌ లాంటి కొన్ని దేశాల్లో దాదాపు 20 శాతం, అంతకంటే ఎక్కువ జనాభా తగ్గే ప్రమాదం ఉంది. సోవియట్ యూనియన్ రద్దయిన తర్వాత తూర్పు యూరప్​ దేశాల్లో హెల్త్​ ఎమర్జెన్సీ వచ్చింది. అప్పటినుంచి ఈ దేశాల్లో జనాభా తగ్గుతూ వస్తోంది. యువత పిల్లల్ని కనకపోవడం, వలసలు పెరగడమే దీనికి కారణాలుగా ఎక్స్​పర్ట్స్​ చెప్తున్నారు. సోవియట్ యూనియన్‌‌‌‌తో సంబంధం లేని గ్రీస్, పోర్చుగల్ లాంటి ఇతర యూరోపియన్ దేశాల్లో కూడా ఫెర్టిలిటీ రేటు తగ్గడం, అక్కడి ఆర్థిక పరిస్థితుల వల్ల జనాభా తగ్గుతోంది. 

ఆఫ్రికాలో ఎక్కువ

ప్రపంచంలో అన్ని దేశాలు ఒక వైపు నడిస్తే.. ఆఫ్రికా మాత్రం నా రూటే సెపరేటు అంటోంది. అన్ని దేశాలకు భిన్నంగా ఆఫ్రికాలో మాత్రం జనాభా విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుతం 8 బిలియన్ల మార్కు దాటడానికి ఆఫ్రికన్ దేశాలు.. అందులోనూ సహారా చుట్టుపక్కల ఉన్న దేశాల పాత్ర ప్రధానమైనది. ఆ దేశాల్లో ప్రతి మహిళ సగటున 4.6 మందిని కంటోంది. నైజర్ దేశంలో ప్రతి మహిళకు సగటున 6.74 మంది సంతానం ఉంది. సోమాలియాలో సగటున ఒక మహిళ ఆరుగురిని, కాంగో, మాలి, చాడ్‌‌‌‌లో ఐదుగురిని కంటుంది. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం.. 2050  తర్వాత ఆఫ్రికన్ల సంఖ్య రెట్టింపు అవుతుంది. అదే జరిగితే.. ప్రపంచ జనాభాలో నాలుగింట ఒక వంతు వాళ్లే ఉంటారు.  

ఆఫ్రికాకు సామర్థ్యం ఉందా?

ఆఫ్రికా ఖండం ఇంకా బోలెడంత మందికి ఆశ్రయం ఇవ్వగలదు. అక్కడ తగినంత భూమి, వనరులు ఉన్నాయి. ప్రస్తుతం ఆఫ్రికాలో చదరపు కిలోమీటరుకు 45 నుండి 47 మంది ఉంటున్నారు. అదే యూరప్​లో 117 మంది, ఆసియాలో 150 మంది ఉన్నారు. దీంతో పోలిస్తే.. ఆఫ్రికాలో జనాభా పెరిగినా సమస్య రాదు. కానీ.. పని దొరకడం కష్టం కావచ్చు. ప్రపంచంలోని ఖనిజ నిల్వల్లో 30 శాతం, చమురులో 12 శాతం, న్యాచురల్​ గ్యాస్​ నిల్వల్లో 8 శాతం ఈ ఖండంలో ఉన్నాయి. అంతేకాదు.. ప్రపంచంలోని వ్యవసాయానికి పనికొచ్చే భూముల్లో 60 శాతం ఆఫ్రికాలోనే ఉన్నాయి. 2050 నాటికి యూరప్​, ఉత్తర అమెరికాలో ఉంటున్న ప్రతి నలుగురిలో ఒకరి వయసు 65 ఏండ్లకు పైనే. కానీ.. ఆఫ్రికన్లలో సగం కంటే ఎక్కువ మంది 25 ఏండ్ల కంటే తక్కువ వయసు వాళ్లే ఉంటారు. అంటే కార్మిక శక్తి ఉంటుంది. అయితే.. ప్రపంచ వాణిజ్యంలో ఈ ఖండం వాటా కేవలం 3 శాతం మాత్రమే!

పాపులేషన్​ డెన్సిటీ

జనాభా ఎక్కువగా ఉన్న దేశాల కంటే తక్కువగా ఉన్న దేశాల్లోనే పాపులేషన్​ డెన్సిటీ(జన సాంద్రత) ఎక్కువగా ఉంది. 2021 లెక్కల ప్రకారం.. మొనాకో దేశంలో చదరపు కిలోమీటరుకు 24,621 మంది ఉంటున్నారు. దాని తర్వాత స్థానంలో మకావో, సింగపూర్​, హాంకాంగ్​ ఉన్నాయి. మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్​ తొమ్మిదో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్​లో ప్రతి చదరపు కిలోమీటరుకు 1,301  మంది ఉంటున్నారు. అదే మన దేశం విషయానికొస్తే.. కిలోమీటరుకు 473 మంది ఉంటున్నారు. 

ఆసియాలోనే ఎక్కువ

మొత్తం ప్రపంచ జనాభాలో దాదాపు 60 శాతం ఆసియాలో ఉన్నారు. జనాభాలో టాప్​ 5లో నాలుగు దేశాలు చైనా, ఇండియా, ఇండోనేసియా, పాకిస్తాన్​ ఆసియాలో ఉన్నాయి. 8 బిలియన్ల ప్రపంచ జనాభాలో 4.6 బిలియన్ల మంది ఆసియాలోేనే ఉన్నారు. అందులోనూ చైనా, ఇండియాల్లో 1.4 బిలియన్లకు పైగా జనాభా ఉంది. 

భూమి సమస్య

మన దేశంలో జనాభా పెరిగితే వచ్చే ప్రధాన సమస్య భూమి​. పెరిగే జనాభాకు తగ్గ భూమి లేకపోవడంతో వ్యవసాయంపై ఆధారపడడం తగ్గుతుంది. జనాభా మరీ ఎక్కువైతే ఉన్న వనరులను అందరికీ సమానంగా పంచడం కూడా సమస్యే. అర్హులు ఎక్కువమంది ఉన్నా ప్రభుత్వ పథకాలు కొందరికే అందుతాయి.

నైజీరియా

ప్రపంచంలోనే అత్యంత వేగంగా జనాభా పెరుగుదల నైజీరియాలోనే ఉంది. ఇకముందు కూడా పెరిగే అవకాశాలే ఎక్కువ. నైజీరియా జనాభా 1950లో 38 మిలియన్లు. ఇప్పుడు 206 మిలియన్లకు పెరిగింది. వచ్చే 30 ఏండ్లలో అది రెట్టింపయ్యే అవకాశం ఉంది. గత 70 ఏళ్లలో అత్యంత వేగంగా జనాభా పెరిగిన దేశాల్లో ఇండియా, ఇండోనేసియా, పాకిస్తాన్, నైజీరియా ముందు వరుసలో ఉన్నాయి. 

అగ్రరాజ్యానిదీ అదే పరిస్థితి

అగ్రరాజ్యమైన అమెరికాలో కూడా రాబోయే రోజుల్లో యూత్​ సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే.. అమెరికాలో 65 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవాళ్ల సంఖ్య బాగా పెరుగుతోంది. 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న అమెరికన్ల కంటే సీనియర్​ సిటిజన్స్​ సంఖ్య రెండింతలు ఉంది. దేశ జనాభాలో వీళ్లే 16.9 శాతం ఉన్నారు. వయో వృద్ధుల సంఖ్య 2040 నాటికి 80 మిలియన్లకు, 2060 నాటికి 95 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. అంటే 2040 నుంచి అమెరికాలో వర్కింగ్​ ఏజ్​ జనాభా తగ్గుతుంటుంది. యూరప్​, తూర్పు ఆసియాలోని  కొన్ని దేశాల్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.  ::: కరుణాకర్​ మానెగాళ్ల