హైదరాబాద్ పై ఆర్సీబీ ఘన విజయం

హైదరాబాద్ పై ఆర్సీబీ ఘన విజయం

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మరోసారి చేతులెత్తేసింది. శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికలబడింది. 67 పరుగుల తేడాతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు గెలిచింది. ఈ మ్యాచ్‌తో సన్‌రైజర్స్ బ్యాటింగ్ ఎంత దారుణంగా ఉందో మరోసారి బయటపడింది. ముఖ్యంగా జట్టు కెప్టెన్, సన్‌రైజర్స్ ఓపెనర్ విలియంసన్ ఫామ్‌లో లేకపోవడం జట్టుకు ఎంతటి నష్టాన్ని కలిగిస్తోందో మరోసారి రుజువైంది. 170, 180కి పైగా టార్గెట్ ఉంటే ఛేజింగ్‌ చేసి SRH గెలవడం కష్టమనే అంచనాలను నిజం చేసేలా ఈ మ్యాచ్‌లో కూడా సన్‌రైజర్స్ బ్యాటింగ్ సాగింది. ఈ ఓటమి సన్ రైజర్స్ కు వరుసగా నాలుగోది. ఇప్పటివరకు 11 మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్ 6 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. తాజా ఓటమితో సన్ రైజర్స్ ప్లే ఆఫ్ ఆశలు దాదాపు అడుగంటిపోయాయి.