లక్ష కోతుల సేల్స్​డీల్​!.. డబ్బుల కోసం చైనాకు అమ్మేందుకు రెడీ అవుతున్న శ్రీలంక

లక్ష కోతుల సేల్స్​డీల్​!.. డబ్బుల కోసం చైనాకు అమ్మేందుకు రెడీ అవుతున్న శ్రీలంక
  • డబ్బుల కోసం చైనాకు అమ్మేందుకు రెడీ అవుతున్న శ్రీలంక
  • అంతరించిపోతున్న అరుదైన జాతి కోతుల ఎగుమతికి ఏర్పాట్లు
  • డ్రాగన్​ను సంతోష పెట్టేందుకు.. జంతు పరిరక్షణ చట్టాలకు తూట్లు

కొలంబో: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక ప్రభుత్వం అవసరాలు తీర్చుకునేందుకు జంతువులను అమ్ముకుంటోంది. ఎడాపెడా అప్పులిచ్చిన చైనా.. తనకు లక్ష కోతులు కావాలని అడిగితే కాదనే పరిస్థితిలేక ఒప్పుకుంది. అంతరించిపోతున్న అరుదైన జాతికి చెందిన లక్ష కోతులను బీజింగ్​ కు ఎగుమతి చేసేందుకు సిద్ధమవుతోంది. చైనా, శ్రీలంకల మధ్య కుదిరిన ఈ డీల్​పై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. శ్రీలంక నుంచి తీసుకెళ్లే కోతులను తమ దేశంలోని 1000కిపైగా జూలలో పెడతామని డ్రాగన్​ అంటోంది. చైనా వేసిన అప్పుల ఉచ్చులో చిక్కుకొని విలవిలలాడుతున్న శ్రీలంక.. ఇప్పుడు ఆ దేశం ఏలా చెబితే అలా నడుచుకోవాల్సిన పరిస్థితిలో ఉంది. ఈ క్రమంలోనే చైనా నుంచి వచ్చిన లక్ష కోతుల కొనుగోలు ప్రతిపాదనకు దాదాపు ఓకే చెప్పింది. దేశం నుంచి జంతువుల ఎగుమతి, అమ్మకాలపై జంతు పరిరక్షణ చట్టాలు బ్యాన్​ పెట్టినా శ్రీలంక వెనక్కి తగ్గడంలేదు. చైనాను సంతోషపెట్టేందుకు, దేశ ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు.. ఆ చట్టాలను పక్కన పెట్టేందుకు సిద్ధమవుతోంది.

సమీక్ష సమావేశం.. అధ్యయనానికి కమిటీ

‘టాఖ్​ మకాఖ్’ రకానికి చెందిన కోతులను అంతరించిపోతున్న జీవ జాతుల జాబితాలోని రెడ్​ లిస్టులో ఇంటర్నేషనల్​ యూనియన్​ ఫర్​ కన్జర్వేషన్​ఆఫ్​ నేచర్​(ఐయూసీఎన్) చేర్చింది.  అటువంటి అరుదైన వానరాలనూ చైనాకు ఎక్స్​పోర్ట్​ చేసేందుకు శ్రీలంక ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 11న శ్రీలంక వ్యవసాయశాఖ మంత్రి మహింద అమరవీర నేతృత్వంలో సంబంధిత విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ప్రస్తుతం శ్రీలంకలో 30 లక్షలకుపైగా కోతులు ఉన్నాయని.. అవి నిత్యం పంటలకు నష్టం కలిగిస్తున్నాయని ఇందులో చర్చకు వచ్చింది. కోతులను చైనాకు ఎగుమతి చేసే క్రమంలో ఎదురయ్యే న్యాయపరమైన అవాంతరాలపై స్టడీ చేసేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఈ మీటింగ్​ సందర్భంగా వచ్చిందని సమాచారం. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న తర్వాత కోతుల సంఖ్య పెరగకుండా చేసేందుకూ కసరత్తు మొదలుపెట్టింది. ఈ తరుణంలోనే తమకు లక్ష కోతులు కావాలనే ప్రతిపాదనను చైనా తీసుకొచ్చినట్టు తెలిసింది. ఇటీవల శ్రీలంక ఇంటర్నేషనల్​ మానిటరీ ఫండ్​ (ఐఎంఎఫ్) నుంచి రూ.24 వేల కోట్ల లోన్​ తీసుకుంది. దీనికి శ్రీలంక తరఫున గ్యారంటీ ఇచ్చిన దేశాల్లో చైనా ఒకటి. ఈ నేపథ్యంలో అడిగినన్ని కోతులను పంపేందుకు లంక సిద్ధమవుతోంది. 

చైనా..  కోతుల కొనుగోలు వెనుక.. ?

కోతులను చైనాలో మాంసం కోసం, ఇళ్లలో పెంచుకునేందుకు, జూలలో ఉంచేందుకు, సర్కస్​ చేయించేందుకు వాడుతుంటారు. ఫార్మా రీసెర్చ్ అండ్​ డెవలప్​మెంట్​ ల్యాబ్​లలో కోతులపై మందులను, వ్యాక్సిన్లను నిత్యం పరీక్షిస్తుంటారు. అవయవ మార్పిడి సర్జరీలను, సాంక్రమిక వ్యాధుల మందులనూ పరీక్షించేందుకు ఉత్తమ ట్రయల్​ రిసోర్స్​గా కోతులను శాస్త్రవేత్తలు పరిగణిస్తుంటారు.