
- బల్దియా స్టాండింగ్ కమిటీలో నిర్ణయం
- బంజారాహిల్స్ ఏరియాలో రెండు ఫ్లై ఓవర్ల కోసం రోడ్ల వెడల్పు
- 14 అంశాలతో పాటు 3 టేబుల్ ఐటమ్స్ కు ఆమోదం
హైదరాబాద్ సిటీ, వెలుగు: స్టాండింగ్ కమిటీ సమావేశం గురువారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో మేయర్ అధ్యక్షతన జరిగింది. ఇందులో 14 అంశాలతో పాటు 3 టేబుల్ ఐటమ్స్ కు ఆమోదం తెలిపారు. ప్రధానంగా జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో 14 ఏండ్లుగా నెలకొన్న విగ్రహాల వివాదానికి తెరపడింది. బల్దియా ఆవరణలోని వైఎస్ఆర్, బీఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలను అక్కడి నుంచి తొలగించి వేరేచోట ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విగ్రహాలు ఉన్న స్థలంలో వాటర్ ఫౌంటెయిన్నిర్మించాలని డిసైడ్అయ్యారు.
రోడ్ల వెడల్పు.. ఆస్తుల సేకరణ
హెచ్ సిటీ పనుల్లో భాగంగా ఎన్ఎఫ్ సీఎల్ జంక్షన్ వద్ద మల్టీలెవల్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం రోడ్డు డెవలప్ మెంట్ ప్లాన్, సుల్తాన్ -ఉల్ -ఉలూమ్ కాలేజ్ ఆఫ్ లా నుంచి జలగం వెంగళరావు పార్క్ వరకు ప్రతిపాదించిన 30 మీటర్ల రోడ్డు వెడల్పునకు, 34.50 మీటర్ల రోడ్డు ఏర్పాటుకు ఆరు ఆస్తుల సేకరణకు కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. టీవీ 9 జంక్షన్ వద్ద మల్టీ-లెవల్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ కింద 24 మీటర్ల వెడల్పుతో ఉన్న రోడ్డుని 36 మీటర్ల వరకు వెడల్పు చేయాలని నిర్ణయించారు.
దీని కోసం 38 ఆస్తుల సేకరించాలని, 2 స్ట్రెచెస్ మాస్టర్ ప్లాన్ రోడ్డు వెడల్పు కోసం 30 మీటర్ల నుంచి 36 మీటర్ల వరకు ఫారెన్ ఎక్సేంజ్ నుంచి సుల్తాన్ ఉల్ ఉలూం లా కాలేజీ వరకు 18 మీటర్ల నుంచి 24 మీటర్లు వరకు, టీవీ9 జంక్షన్ నుంచి శ్రీనగర్ కాలనీ వరకు చేపట్టే రోడ్డు వెడల్పు కోసం కమిటీ సభ్యులు ఆమోదించారు.
లింగోజిగూడలో రెండు లేన్ల వంతెన
ఎల్బీనగర్ సర్కిల్ లింగోజిగూడలోని ప్రియదర్శిని పార్క్ ప్రవేశ ద్వారం నుంచి శారద థియేటర్ ఎదురుగా ఉన్న ప్రాంతం వరకు రూ.5.95 కోట్ల వ్యయంతో 2 లేన్ల వంతెన నిర్మాణం కోసం పరిపాలన అనుమతికి ఆమోదించారు. గోషామహల్ పోలీస్ గ్రౌండ్ వద్ద దారుస్సలాం జంక్షన్ నుంచి మలకుంట రోడ్డు (ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్) వరకు, ఉస్మానియాకు వెళ్లే రోడ్డు వెడల్పును 24 మీటర్ల నుంచి 30 మీటర్లకు పెంచడం, 102 ఆస్తులము సేకరించేందుకు ఆమోదించారు. పురానాపూల్ నుంచి వయా కమేలా కార్వాన్ సాహు వరకు ఇప్పటికే ప్రతిపాదించిన 18 మీటర్ల రోడ్డుని 24 మీటర్లుగా వెడల్పు చేసేందుకు ప్రతిపాదనలతో పాటు 278 ఆస్తుల సేకరణకు ఆమోదించారు.
బల్దియా ఉద్యోగులకు రూ. ఆరు లక్షల క్రికెట్ కిట్లు
2023-–24లో ఈవీడీఎం డైరెక్టర్ గా ఉన్న విశ్వజిత్ కంపాటి జీహెచ్ఎంసీ నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ కోసం ఉద్యోగులకు రూ.6,38,509 లక్షలతో క్రీడా సామగ్రి కొన్నారు. అయితే ఈ బిల్లు రిలీజ్ కోసం అప్పట్లో ఎగ్జామినర్ కి పంపగా, రూ. 5 లక్షలు దాటితే స్టాండింగ్ కమిటీ ఆమోదం తప్పనిసరి అని తెలిపారు. దీంతో వీటికి కూడా ఆమోదం తెలిపారు. సపోర్ట్ మీట్ లో భాగంగా క్రీడల నిర్వహణకు క్రీడా సామగ్రి కోసం రూ.13,22,514తో ఆమోదం తెలిపారు.
426 కోట్ల చెల్లింపు..
రాంనగర్ నుంచి బాగ్ లింగంపల్లి వరకు ఫైఓవర్ నిర్మాణాన్ని విరమించుకోవడం, ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ మెయిన్ రోడ్ వరకు నిర్మించిన ఫ్లై ఓవర్నిర్మాణానికి అదనంగా ఖర్చయిన రూ.426 కోట్లు చెల్లించాలని నిర్ణయించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 జీహెచ్ఎంసీ గార్డెన్ నిర్వహణను రెండేండ్లకు సీఎస్ఆర్ కింద ఖజానా గ్రూప్-తో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ఎంఓయూ చేసుకోవడానికి ఆమోదించారు. నాగోల్ లో రూ.7కోట్లతో బాక్స్ డ్రెయిన్ల నిర్మాణం కోసం ఆమోదించడంతో పాటు సీఎస్ ఆర్ కింద చెరువులు, పార్కులు అప్పగించేందుకు ఆమోదించారు.
అలాగే టేబుల్ఐటమ్స్ కింద కాప్రా సర్కిల్ చర్లపల్లిలో డిమార్ట్ మీదుగా పోచమ్మ కుంట వరకు, అక్కడి నుంచి కృష్ణారెడ్డి నగర్ ఆర్చ్ కుషాయిగూడ వరకు రూ. 3.75కోట్లతో బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికి అనుమతి ఇస్తూ కమిటీ ఆమోదం తెలిపింది. కాప్రా సర్కిల్, చిన్న చర్లపల్లి లో మోడల్ గ్రేవ్ యార్డ్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్ నిర్మాణాలను రూ. 5.50 కోట్లతో చేపట్టేందుకు, జీహెచ్ఎంసీ కి చెందిన ఆర్ కేనగర్ లో ప్లాట్ 38లో ఉన్న 400 గజాల భూమిలో సబ్ స్టేషన్ నిర్మాణానికి హబ్సిగూడ సూపరింటెండెంట్ ఇంజినీర్ కు అలాట్ చేస్తూ
ఆమోదించారు.