కొత్త ఎంవీ యాక్టుకు ఓకే చెప్పిన రాష్ట్రాలు.. ఇప్పుడు యూ టర్న్

కొత్త ఎంవీ యాక్టుకు ఓకే చెప్పిన రాష్ట్రాలు.. ఇప్పుడు యూ టర్న్

కొత్త మోటర్​ వాహనాల చట్టం  పేరు చెబితే ఇప్పుడు జనం హడలెత్తిపోతున్నారు. చాలా రాష్ట్రాలు ‘నో’ అంటున్నాయి. ఇక్కడ మెలిక ఏమిటంటే, ఒకప్పుడు ఈ రాష్ట్రాలన్నీ వెనకా ముందూ చూడకుండా ‘ఎస్​’ చెప్పినవే.​ సవరణ బిల్లును పార్లమెంట్​లో పెట్టకముందు దానిపై ఐదు సార్లు మీటింగ్​లు జరిగాయి. ఏ ఒక్క రాష్ట్రమూ ఈ చట్టంలో చేయబోయే మార్పులు చేర్పులపై మాట వరసకైనా అభ్యంతరం తెలపలేదు. అప్పుడు ‘ఓకే’ అన్నవాళ్లందరూ ఇప్పుడు ‘యూటర్న్​’ తీసుకున్నారు. ముందే ఆలోచిస్తే ఇప్పుడీ రాద్ధాంతం ఉండేది కాదంటున్నారు వెహికల్​ ఓనర్లు.

బైక్​, కార్​, వ్యాన్​​, లారీ, బస్​.. వాహనం ఏదైనా కావొచ్చు. దాన్ని బయటకు తీయాలంటేనే​ పబ్లిక్​ తెగ పరేషాన్​ అవుతున్నారు. ట్రాఫిక్​ పోలీసులకు చిక్కితే ఏదో ఒక వంకతో చలానా వేస్తారని భయపడాల్సి వస్తోంది. మామూలుగా వంద రూపాయలు పడే చలాన్​ ఏకంగా పది రెట్లు పెరిగిపోయింది. రూల్స్​ బ్రేక్​ చేసినందుకు వేలల్లో ఫైన్​ కట్టక తప్పట్లేదు. పెనాల్టీలను ఏ స్థాయిలో పెంచారంటే.. ‘అంత డబ్బు చెల్లించటం కన్నా వెహికల్​ను రోడ్డు మీదే వదిలేసి రావటం బెటర్’​ అనుకునేటంతగా! దీంతో ప్రభుత్వంపై రెగ్యులర్​ మీడియాలో విమర్శలు, సోషల్​ మీడియాలో సెటైర్లు, పంచ్​లు పేలుతున్నాయి.

పెద్ద నోట్ల రద్దు తర్వాత జనాన్ని ఇంత పెద్దఎత్తున కంగారు పెడుతున్న టాపిక్​ ఏదయినా ఉందంటే అది కొత్త ఎంవీ యాక్టే! ఇప్పుడు దేశమంతా దీనిపైనే చర్చ. హెల్మెట్​​, ఆర్​సీ, డ్రైవింగ్​ లైసెన్స్​, ఇన్సూరెన్స్​, పొల్యూషన్​ చెకప్​ సర్టిఫికెట్​.. ఇలా ఏ ఒక్క డాక్యుమెంట్​ లేకుండా బండి నడిపినా; ట్రాఫిక్​ రూల్స్​ పాటించకపోయినా భారీగా ఫైన్లు ఖాయం. కేంద్రం ఈ నెల నుంచే చట్టాన్ని అమల్లోకి తెచ్చింది.  ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో చాలా రాష్ట్రాలు చట్టాన్ని అమలుచేయటానికి జంకుతున్నాయి. తప్పంతా మోడీ సర్కార్​దే అన్నట్లు మాట్లాడుతున్నాయి.

ఒక్కసారైనా వద్దనలేదు

మోటర్​ వాహనాల చట్టంలో చేయనున్న మార్పులు చేర్పులతో కూడిన బిల్లును పార్లమెంట్​లో హడావుడిగా ప్రవేశపెట్టలేదు. అన్ని రాష్ట్రాల సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కోరుతూ ఐదు సార్లు మీటింగ్​లు నిర్వహించింది. కొత్త చట్టానికి మూడేళ్ల ముందు (2016) నుంచే కసరత్తు మొదలుపెట్టారు. ఆ సమావేశాలకు ప్రతిసారీ దాదాపు అన్ని రాష్ట్రాల ట్రాన్స్​పోర్ట్​ మినిస్టర్లూ వచ్చేవారు. అన్నింటికీ ఓకే చెబుతూ పోయేవారు. ఫైన్లు ఈ రేంజ్​లో వేయటం సరికాదని ఒక్క రాష్ట్రమైనా అడ్డు తగల్లేదు. అప్పుడు ఓకే చెప్పేసి, ఇప్పుడు నాట్​ ఓకే అంటూ మడత పేచీ పెడుతున్నాయి. ‘మోటర్​ వెహికల్స్​ అమెండ్​మెంట్​ యాక్ట్​–2019’లోని కొన్ని ప్రొవిజన్లను ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్​ కూడా తప్పుపడుతోంది. రోడ్​ సేఫ్టీ సంబంధిత అంశాలపై మంచీచెడు మాట్లాడుకోవటానికి 2017లో ఈ స్టేట్​లోనే అన్ని రాష్ట్రాల ట్రాన్స్​పోర్ట్​ మినిస్టర్ల మీటింగ్​ జరిగింది. ట్రాన్స్​పోర్ట్​ డెవలప్​మెంట్​ కమిటీ(టీడీసీ)లో వీళ్లందరూ మెంబర్లు. టీడీసీ భేటీలు 2016–18 మధ్య కాలంలో ఢిల్లీ, బెంగళూరు, ధర్మశాల, తిరువనంతపురం, గువాహటిల్లో జరిగాయి. మోటర్​ వాహనాల చట్టానికి చేయనున్న సవరణలపై చర్చించారు. తర్వాత కేబినెట్​ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. ఈ ఏడాది మోడీ సర్కారు మళ్లీ అధికారానికి రాగానే జూలైలో పార్లమెంట్ ఆమోదం పొందారు. దీని ప్రకారం.. ట్రాఫిక్​ రూల్స్​ పట్టించుకోనివారికి విధించే జరిమానాలను 500 శాతం నుంచి 1,000 శాతం వరకు పెంచారు. ‘డ్రంక్​ అండ్​ డ్రైవ్​’, ఓవర్​ స్పీడ్​ వంటి తప్పులకు రూ.4,000 మొదలుకొని రూ.10,000 దాకా చలానా వేస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకే ఈ స్థాయిలో ఫైన్లు వేస్తున్నామని సర్కారు అంటోంది.

సూపర్​ ఫైన్​ చలాన్లు

సెప్టెంబర్​ 3వ తేదీన ఒడిశాలోని సంబల్​పూర్​లో ట్రక్​ డ్రైవర్ అశోక్​ జాదవ్​కి ఏకంగా రూ.86,500 జరిమానా పడింది. చట్టం అమల్లోకి వచ్చాక ఇదే అతి పెద్ద ఫైన్​. పర్మిషన్​ లేని వ్యక్తికి డ్రైవింగ్​ ఇచ్చినందుకు 5,000, అతనికి లైసెన్స్​ లేనందుకు 5,‌000, ట్రక్​ కెపాసిటీ 18 టన్నులకు మించి లోడ్​ వేసినందుకు 56,000, ట్రక్​ హద్దులు దాటిపోయేలా లోడింగ్​ చేసినందుకు 20,000, సాధారణ తప్పుగా 500 రూపాయలు… మొత్తంగా రూ.86,500 వడ్డించారు. చివరికి పోలీసుల కాళ్లావేళ్లా పడి 70,000 రూపాయలు ఫైన్​ కట్టాడు జాదవ్​.

ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్​లో ఒక ఆటో రిక్షా డ్రైవర్​కి 32,500 రూపాయలు ఫైన్​ వేశారు. సరైన డాక్యుమెంట్లు లేనందుకు, సిగ్నల్​ దగ్గర రెడ్​ లైట్​ జంప్​ చేసినందుకు ఈ ఫైన్​ పడింది.

ఢిల్లీలోనే ఒక బైక్​ రైడర్​కి 23,000 రూపాయలు వడ్డించారు. అతని దగ్గర బైక్​ పేపర్లు ఏవీ లేవు. కనీసం హెల్మెట్​ కూడా పెట్టుకోలేదు.

ఉత్తరాఖండ్​లోని డెహ్రాడూన్​లో రెండెద్దుల బండి ఓనర్​కి రాంగ్​ పార్కింగ్​ కింద వెయ్యి రూపాయలు ఫైన్​ వేశారు. తన పొలం పక్కనే రోడ్డు మీద ఎద్దుల బండిని ఆపి ఉంచాడని రియాజ్​ హసన్​ అనే రైతుకు ఈ ఫైన్​ పడింది.

సౌత్​ ఢిల్లీలో డ్రంక్​ అండ్​ డ్రైవ్​ కింద ఒక బైకర్​కి రూ. 16,000 చలాన్​ రాశారు. తాగి నడుపుతున్నందుకు 10,000, రిజిస్ట్రేషన్​ పేపర్లు లేనందుకు 5,000, హెల్మెట్​ పెట్టనందుకు రూ. 1,000 వేశారు. దాంతో ఆ బైకర్​కి చిర్రెత్తుకొచ్చి  బైక్​కి నిప్పెట్టేశాడు.