సందేసరా బ్రదర్స్ కుంభకోణం…డినో మోరియో, అకీల్‌‌కు సమన్లు

సందేసరా బ్రదర్స్ కుంభకోణం…డినో మోరియో, అకీల్‌‌కు సమన్లు

విచారణకు రావాలని ఈడీ ఆదేశం

ముంబై : రూ.14,500 కోట్ల విలువైన స్టెర్లింగ్ బయోటెక్ కుంభకోణం విచారణలో భాగంగా బాలీవుడ్ నటుడు డినో మోరియా, డీజే అకీల్‌‌కు ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. వీరికి జరిపిన చెల్లింపుల విషయంలో విచారణకు హాజరు కావాలని ఈ ఇద్దరు బాలీవుడ్ సెలబ్రిటీలను ఈడీ ఆదేశించింది. స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్ ప్రమోటర్లైన సందేసరా బ్రదర్స్‌‌ బ్యాంకుల్లో రూ.14,500 కోట్లకు పైగా కుంభకోణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా సందేసరా గ్రూప్‌‌కు చెందిన రూ.9 వేల కోట్లకు పైగా ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ప్రధాన నిందితులు నితిన్ సందేసరా, చేతన్ సందేసరా, హితీష్ పటేల్‌‌ను ఇండియాకు రప్పించడానికి ఈడీ ప్రయత్నిస్తోంది. ఈ ఫ్యామిలీ ఐరోపాలోని అల్బేనియాలో దాక్కునట్టు తెలుస్తోంది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను దారి మళ్లించడానికి సందేసరా బ్రదర్స్‌‌ షెల్ కంపెనీలు సృష్టించారు. ఈ షెల్ కంపెనీలకు హితీష్ పటేల్ డమ్మీ డైరెక్టర్లను నియమించడంలో సాయ పడ్డాడు. నితిన్ సందేసరా, చేతన్ సందేసరాకు  హితీష్ సోదరుడు. స్టెర్లింగ్ బయోటెక్ కేసులో పటేల్‌‌కు వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్, దాని గ్రూప్ కంపెనీలు, డైరెక్టర్లు బ్యాంకులను మోసం చేసినందుకు గాను 2017లోనే సీబీఐ ఎఫ్‌‌ఐఆర్ దాఖలు చేసింది. స్టెర్లింగ్ బయోటెక్‌‌ను నితిన్ సందేసరా, చేతన్ సందేసరాలు ప్రమోట్ చేస్తున్నారు. ఇండియాలో ప్రొసీడింగ్స్ మొదలువుతుండగానే వీరు దేశం విడిచి పారిపోయారు. స్టెర్లింగ్ బయోటెక్ కేసులో దేశం విడిచి తప్పించుకుపోయిన వీరికి వ్యతిరేకంగా స్పెషల్ పీఎంఎల్‌‌ఏ కోర్టు నుంచి ఈడీ నాన్ బెయిలబుల్ వారెంట్లను సంపాదించింది. ఇటీవలే స్టెర్లింగ్ బయోటెక్ కుంభకోణం, పీఎన్‌‌బీలో నీరవ్ మోడీ చేసిన స్కాం కంటే పెద్దదని ఈడీ వెల్లడించింది. దీని విలువ రూ.14,500 కోట్లకు పైగా ఉంటుందని తెలిపింది.  ఢిల్లీకి చెందిన బిజినెస్‌‌మ్యాన్ గగన్ ధావన్, ఆంధ్రా బ్యాంక్ ఎక్స్ డైరెక్టర్ అనుప్ గార్గ్‌‌లపై కేసులు నమోదు చేసింది.

బ్యాంకుల కన్సార్టియంలో ఆంధ్రాబ్యాంక్, ఎస్‌‌బీఐ

సందేసరా బ్రదర్స్, వారి కంపెనీలకు చెందిన రూ.4,700 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ గతేడాది మార్చిలోనే అటాచ్ చేసింది. అటాచ్ చేసిన వాటిలో ప్లాంట్ మెషినరీ, కంపెనీలు, ప్రమోటర్లకు చెందిన 200 బ్యాంక్ అకౌంట్లు, 4 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఇమ్మూవబుల్ ప్రాపర్టీలు, రూ.6.67 కోట్ల విలువైన షేర్లు, పలు హై ఎండ్ లగ్జరీ కార్లు ఉన్నాయి.  స్టెర్లింగ్ బయోటెక్‌‌కు రుణాలు ఇచ్చిన బ్యాంకుల కన్సార్టియంలో ఆంధ్రాబ్యాంక్, యూకో బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,అలహాబాద్ బ్యాంక్,బ్యాంకు ఆఫ్ ఇండియాలు ఉన్నాయని ఈడీ వర్గాలు వెల్లడించాయి.