పరిహారం ఇచ్చేది ఎప్పుడు.. సర్వే చేసుకొని పోయిన ఆఫీసర్లు 

 పరిహారం ఇచ్చేది ఎప్పుడు.. సర్వే చేసుకొని పోయిన ఆఫీసర్లు 
  • అప్పులు చేసి నష్టాన్ని పూడ్చుకున్న బాధితులు
  • నష్ట పరిహారం కోసం ఇంకా ఎదురుచూపులు

పెద్దపల్లి, వెలుగు: గత ఏడాది జులైలో కురిసిన వర్షాలు, వరదల వల్ల  పెద్దపల్లి జిల్లాలో పెద్ద సంఖ్యలో ఇండ్లు మునిగాయి, చాలా కూలిపోయాయి. వందల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. సర్కార్​ సర్వే చేయించి నష్టపోయిన వారికి పరిహారం ఇస్తామని ప్రకటించింది.   కానీ, ఏడాదైనా ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా రాలేదు.   

తప్పని ఎదురుచూపులు 

ఇండ్లు పూర్తిగా కూలిపోయిన వాళ్లు  సర్కార్ సాయం కోసం ఇంకా ఎదురుచూస్తున్నారు.  గత ఏడాది కురిసిన  గోదావరి, మానేరు నదులకు వరద పోటెత్తడంతో మంథని పట్టణంతో పాటు గోదావరి తీరంలోని దాదాపు 10 గ్రామాలు నీట మునిగాయి.  వరదలకు కొన్ని ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. చాలా వరకు పూర్తిగా ధ్వంసం కావడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

బుట్టదాఖలైన రిపోర్టులు 

గత ఏడాది జూలై  9 నుంచి 16 తేదీల మధ్య వచ్చిన వరదలతో  జిల్లాలోని  కాల్వశ్రీరాంపూర్, రామగుండం, ఓదెల , మంథని మండలాలతో పాటు మంథని పట్టణం సగానికి పైగా నీట మునిగింది.   ముంపునకు గురైన ప్రాంతాల వారికి వారం రోజుల పాటు అధికారులు పునరావాసం కల్పించారు. ఆ తర్వాత అధికారులు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. నష్టం అంచనా వేసి, అధికారులు  ప్రభుత్వానికి రిపోర్టు పంపారు.  ఇప్పటికి ఏడాది దాటిని బాధితులకు ఎలాంటి పరిహారం దక్కలేదు. దీంతో ఇండ్లు కూలిపోయిన పేదలు, అప్పులు చేసి తమ ఇండ్లు బాగుచేసుకున్నారు. ఆర్థికంగా దెబ్బతిన్న తమను ఆదుకోవాలని బాధిత కుటుంబాలు సర్కార్​ను కోరుతున్నాయి. 

దెబ్బతిన్న ఇండ్లు 

 జిల్లా వ్యాప్తంగా 591 ఇండ్లు పాక్షికంగా, 18 ఇండ్లు పూర్తిగా కూలిపోయినయి. ప్రభుత్వ పరంగా పాక్షికంగా దెబ్బతిన్న వాటికి రూ.5,200, పూర్తిగా కూలిపోయిన వాటికి రూ.95,100 సాయాన్ని ఇవ్వాల్సి ఉంది. మంథని పట్టణంలో పెద్ద సంఖ్యలో ఇండ్లు దెబ్బతిన్నాయి. షాపు యజమానులు తీవ్రంగా నష్టపోయారు. మెడికల్ షాపులు, ఫెర్టిలైజర్, బట్టలు, కిరాణ,  తదితర షాపులు నీట మునగడంతో లోపల ఉన్న మెటీరియల్ తడిసిపోయి పనికికాకుండా పోయాయి. వీరంతా లక్షల్లో నష్టపోయినట్లు చెప్తున్నారు. ఈ నష్టానికి సంబంధించి అధికారులు ఎలాంటి సర్వే చేయలేదు. కానీ,  నష్టపోయిన  వారికి సున్నా వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పారు.  కానీ ఇప్పటి వరకు 
ఇయ్యలేదు.

పంటలకు తీవ్ర నష్టం

ఇదిలా ఉంటే పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.  జిల్లాలోని 142 గ్రామాల్లో 7485 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నట్టు  అధికారులు అంచనా  వేవారు. అలాగే.. 46 గ్రామాల్లో వెయ్యి  ఎకరాల వరి నీట మునిగినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో దానికన్నా ఎక్కువే నష్టం  వచ్చినట్టు రైతులు వాపోతున్నారు.