వరకట్న వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు

వరకట్న వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు

వరకట్నాన్ని నిర్మూలించేందుకు కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలపై వరకట్న వేధింపులకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. హింస, బెదిరింపులకు వ్యతిరేకంగా అవగాహన కల్పించడం ద్వారా దీన్ని నివారించవచ్చునని సీఎం పినరయి విజయన్‌ అన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న వరకట్న వేధింపులు, గృహ హింస కేసులపై  ఆయన బుధవారం అసెంబ్లీలో మాట్లాడారు.

 వరకట్నానికి వ్యతిరేకంగా ఇటీవల గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ చేసిన నిరాహారా దీక్ష అవగాహన కల్పించేదిగా తెలిపారు. 2011-16 మధ్య కాలంలో ఆత్మహత్యలతో కలిసి 100 వరకట్న వేధింపుల మరణాలు నమోదయ్యాయని, 2016-21 నాటికి ఆ సంఖ్య 54కు తగ్గిందని చెప్పారు. 2020-21ల్లో ఆరు చొప్పున వరకట్న వేధింపుల మరణాలు నమోదయ్యాయని చెప్పారు. విజయన్‌ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వరకట్న వేధింపులు, గృహ హింస కారణంగా రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య, నమోదైన కేసుల సంఖ్య, తీసుకున్న చర్యలపై అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఇటువంటి కేసులను పోలీసులు విచారిస్తున్నారని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.