రైతులను ఇబ్బంది పెడితే  సహించం : విఠల్​రావు

రైతులను ఇబ్బంది పెడితే  సహించం : విఠల్​రావు

నిజామాబాద్, వెలుగు:   కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన వడ్లను దింపుకోకుండా  రైతులను ఇబ్బంది పెట్టే మిల్లర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని జడ్పీ చైర్మన్​ దాదన్నగారి విఠల్​రావు హెచ్చరించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ​జడ్పీ మీటింగ్​హాల్లో  విఠల్​రావు అధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది.  అడిషనల్​కలెక్టర్​ చిత్రామిశ్రా, ఐడీసీఎంఎస్​ చైర్మన్​మోహన్​, గవర్నమెంటు హాస్పిటల్​సూపరింటెండెంట్​డాక్టర్​ ప్రతిమారాజ్​ ఆయా శాఖల ఆఫీసర్లు పాల్గొన్న ఈ సమావేశంలో  సభ్యులు ఆయా శాఖల  ఆధ్వర్యంలో తలెత్తుతున్న సమస్యలను సభ దృష్టికి తీసుకు వచ్చారు. 

కొనుగోలు కేంద్రాల నిర్వహణపై..

సభ్యులు ముందుగా వడ్ల కొనుగోలు కేంద్రాల నిర్వహణపై  జిల్లా కోఆపరేటివ్​ఆఫీసర్​ సింహాచలంపై ప్రశ్నల వర్షం కురిపించారు.  దీనిపై ఆయన స్పందిస్తూ..  కొనుగోలు  కేంద్రాల నిర్వహణను సునిశితంగా పరిశీలిస్తున్నామని, సూపర్​వైజింగ్​ ఆఫీసర్లను నియమించామని చెప్పారు. జిల్లాలోని సహకార సంఘాలపై వస్తున్న అవినీతి ఆరోపణల గురించి కోటగిరి జడ్పీటీసీ  మెంబర్​శంకర్​పటేల్​ప్రశ్నించగా, సెక్షన్​– 60 ప్రకారం తనకు  సొంతంగా విచారణ నిర్వహించి నిర్ణయాలు తీసుకునే అధికారం ఉందని, విచారణ చేపడుతామని  డీసీవో సమాధానం ఇచ్చారు. తాళ్లరాంపూర్​ సొసైటీపై 48 హియరింగ్ లు చేశామని, అందుకే పాలకవర్గం ట్రిబ్యునల్​కు వెళ్లినా  వారికి అనుకూల ఉత్తర్వులు రాలేదన్నారు. కొత్తపల్లి సింగిల్​ విండోపై థర్డ్​పార్టీ విచారణ జరిపించాలని  డీసీవో కలెక్టర్​ రాజీవ్​గాంధీ హన్మంతును కోరగా ఆయన అంగీకరించారు. 

రైతులకు నష్టపరిహారంపై చర్చ 

జిల్లాలోని అంగన్​వాడీ  కేంద్రాలకు  కోడిగుడ్లు, పప్పులు సరఫరా కావడం లేదని, బియ్యం సరఫరాలో సమస్యలు తలెత్తున్నాయని జడ్పీ వైస్​ చైర్​ పర్సన్​రజితా యాదవ్​సభ దృష్టికి తెచ్చారు. మహిళా ప్రతినిధులను  కొందరు  ఆఫీసర్లు చులకనగా చూస్తున్నారని చైర్మన్​ దృష్టికి తెచ్చారు.  అనంతరం డిసెంబర్​ 2021, జనవరి 2022 అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతుల పరిహారం.. గురించి సభ్యులు ప్రశ్నించగా, బాధిత రైతుల బ్యాంకు అకౌంట్లను పరిశీలిస్తున్నామని నిర్ధరణ తరువాత పరిహారం పైసలు వారి ఖాతాలో జమచేస్తామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తిరుమల ప్రసాద్​  చెప్పారు.  ఇటీవల పంట నష్టం  రిపోర్టును  ప్రభుత్వానికి పంపామన్నారు.  ఇప్పటి వరకు రూ.38 వేల లోపు క్రాఫ్​లోన్లకు  పైసలు జమచేశామని తెలిపారు. 

ఇసుక తవ్వకాలపై ప్రశ్నించిన సభ్యులు

తహసీల్దార్లు  పర్మిషన్​ఇచ్చిన 23 పాయింట్ల వద్ద ఇసుక తవ్వకాలు నడుస్తున్నాయని,  గనుల శాఖ ఎక్కడా పర్మిషన్లు ఇవ్వలేదని మైన్స్​ ఏడీ  సత్యనారాయణ సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. మొరం, ఇసుక తవ్వకాలకు చెందిన  సీనరేజ్​ఛార్జీల వాటా  రూల్స్​ప్రకారం జడ్పీ, ఎంపీపీ,  పంచాయతీలకు జమచేస్తామని కలెక్టర్​ రాజీవ్​గాంధీ హన్మంతు తెలిపారు. రిజిస్ట్రేషన్​ పైసలు ప్రభుత్వానికి  వెళ్తాయని,  స్థానిక సంస్థలకు ఇందులో ఎలాంటి వాటా ఉండదని జడ్పీ సీఈవో గోవింద్​నాయక్​ సభ్యుల ప్రశ్నకు జవాబు చెప్పారు. ‘ధరణి’ సమస్యలపై 33 మాడ్యుల్​లో అప్లై చేయాలని కలెక్టర్​ సూచించారు. 

నిజాం షుగర్స్ ​భూములపై పది రోజుల్లో క్లారిటీ..

బోధన్​ నిజాం షుగర్స్​ నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లు  గతంలో కొనుగోలు  చేసి లబ్ధిదారులకు పంచిన భూముల అమ్మకాల రిజిస్ట్రేషన్​ చేయడం లేదని కొందరు సభ్యులు ప్రశ్నించగా..  దీనిపై  ప్రభుత్వం నుంచి పది రోజుల్లో క్లారిటీ వస్తుందని కలెక్టర్​ తెలిపారు. ఉపాధి హామీ పనులను రైతులకు ఉపయోగపడేలా చేయించాలని సభలో నిర్ణయించారు. ఎలక్ట్రిసిటీ శాఖపై జరిగిన చర్చలో శిథిలమైన, వంగిన కరెంటు స్తంభాలను మారుస్తామని ట్రాన్స్​కో ఎస్ఈ రవీందర్ తెలిపారు.