
దేశ రక్షణకు సంబంధించిన విధానాలను రూపొందించడం, రక్షణ, భద్రతకు సంబంధించిన అంశాల్లో వివిధ విభాగాలను సమన్వయం చేయడం రక్షణ మంత్రిత్వశాఖ ప్రధాన బాధ్యత. భారత సాయుధ దళాలు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ప్రధాన సైనిక దళాలు. వీటిలో సైనిక దళం, నౌకాదళం, వైమానిక దళం ఉన్నాయి. వీటిని సంయుక్తంగా త్రివిధ దళాలుగా పేర్కొంటారు.
భారత సైన్యాన్ని ఏడు కమాండ్లుగా విభజించారు. ప్రతి కమాండ్‌కు లెఫ్టినెంట్ జనరల్ హోదా కలిగిన అధికారి నేతృత్వం వహిస్తారు. భారత నౌకాదళాన్ని మూడు కమాండ్లుగా విభజించారు. ప్రతి కమాండ్ కు వైస్ అడ్మిరల్ ర్యాంకు కలిగిన అధికారి నేతృత్వం వహిస్తారు. భారత వైమానిక దళాన్ని ఐదు ఆపరేషనల్ కమాండ్స్, 2 ఫంక్షనల్ కమాండ్స్ గా విభజించి, ప్రతి విభాగాన్ని ఎయిర్ మార్షల్ నియంత్రణలో ఉంచారు.
యుద్ధ విన్యాసాలు
- యుద్ధ అభ్యాస్: వీటిని భారత్, అమెరికా రక్షణ ఒప్పందాల్లో భాగంగా 2005 నుంచి సంయుక్తంగా నిర్వహిస్తున్నారు.
- శక్తి: వీటిని 2011 నుంచి భారత్, ఫ్రెంచ్ సైనిక దళాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. మంచు ప్రాంతాలు, పర్వత ప్రాంతాల్లో ఉగ్రవాద అణచివేత కార్యకలాపాల్లో భాగంగా వీటిని నిర్వహిస్తున్నారు.
- ఇంద్ర: వీటిని భారత్, రష్యా సైనిక దళాలు ద్వైవార్షికంగా 2003 నుంచి సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి .
- నొమాడిక్ ఎలిఫెంట్: వీటిని భారత్, మంగోలియన్ ఆర్మీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇరు దేశాలు తీవ్రవాద వ్యతిరేక, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పరస్పర సహకారం, ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యకలాపాల్లో భాగంగా వీటిని నిర్వహిస్తున్నాయి.
- రుద్ర కోష్: వీటిని పంజాబ్, జమ్మూకాశ్మీర్ పశ్చిమ సైనిక కమాండ్ యుద్ధ సన్నద్ధత కార్యక్రమాల్లో భాగంగా, నూతన సాంకేతికతను పరీరక్షించడానికి, సంస్థాగత నిర్మాణం, యుద్ధరంగంలో పలు సైనిక విభాగాల అనుసంధానత పరీక్షించడం ధ్వేయంగా నిర్వహించారు.
- అశ్వమేధ: థార్ ఎడారిలో 3,00,000 ట్రూప్స్ తో భారత సైన్యం యుద్ధ సన్నద్ధతను పరీక్షించడానికి నిర్వహించింది.
- సూర్య కిరణ్: వీటిని 2011లో ప్రారంభించారు. భారత్, నేపాల్ సంయుక్తంగా ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి.
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్
దీనిని త్రివిధ దళాలకు నేతృత్వం వహించే అత్యున్నత పదవిగా పరిగణిస్తారు. భారత త్రివిధ దళాలు విడివిడిగా వాటి చీఫ్ ఆఫ్ స్టాఫ్ నేతృత్వంలో పనిచేస్తాయి. 1971లో జరిగిన ఇండియా, పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా శ్యామ్ మానెక్ షా అందించిన సేవలకు గుర్తింపుగా అతనికి ఫీల్డ్ మార్షల్ ర్యాంకును ప్రదానం చేయడంతోపాటు త్రివిధ దళాలకు నేతృత్వం వహించ గలిగిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా నియమించడానికి ప్రయత్నించారు. అయితే, విభిన్న వర్గాల నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకు ఆ ప్రయత్నాన్ని నాటి ప్రధాని ఇందిరాగాంధీ విరమించుకున్నారు.
1999లో కార్గిల్ యుద్ధం అనంతరం ఏర్పాటైన కార్గిల్ వ్యూహ కమిటీ, 2001లో ఏర్పాటైన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవిని ఏర్పాటు చేయాలని సిఫారసు చేశాయి. ఇదే విషయాన్ని తదనంతరం ఏర్పాటు చేసిన నరేష్ చంద్ర టాస్క్ఫక్షర్స్(2012), డి.బి.శేకట్కర్ కమిటీ(2016) బలపరిచాయి.
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఏర్పాటుకు అవసరమైన ప్రక్రియను 2017లో ఏర్పాటైన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(సీసీఎస్) ప్రారంభించింది. 2019, ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోటపై జాతీయ పతాక ఆవిష్కరణ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత బలమైన సైనిక వ్యవస్థ కలిగిన దేశాలు సైతం త్రివిధ దళాలకు నేతృత్వం వహించే ఏకైక అత్యున్నత పదవిని కలిగి ఉండగా, భారతదేశం తొలిసారిగా 2020, జనవరి 1న మూడు సంవత్సరాల కాలపరిమితితో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవిని ఏర్పాటు చేసింది. మొదటి సీడీఎస్ గా ఇండియన్ ఆర్మీకి చెందిన జనరల్ బిపిన్ రావత్ నియామకమయ్యారు. ప్రస్తుతం అనిల్ చౌహన్ భారత సీడీఎస్‌గా పనిచేస్తున్నారు.
ప్రధానికి, ప్రభుత్వానికి సైనికపరమైన సలహాలు అందించడానికి, త్రివిధ దళాల అధిపతిగా భారత రక్షణ దళాలను ముందుండి నడిపించడానికి ఈ పదవిని ఏర్పాటు చేశారు. పదవిరీత్యా త్రివిధ దళాల్లోని ఏ విభాగానికీ సీడీఎస్ నేతృత్వం వహించదు. ఈ పదవి కోసం రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేసే డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్(డీఎంఏ) ఏర్పాటైంది.
సైన్యానికి అందించే పురస్కారాలు
- పరమవీర చక్ర – యుద్ధ సమయాల్లో అందించే అత్యున్నత పురస్కారం
- మహా వీర చక్ర, వీర చక్ర – శాంతి సమయాల్లో అందించే అత్యున్నత పురస్కారం
- అశోక చక్ర – అత్యున్నత సేవలు అందించే వారికి ఇచ్చే విశిష్ట పురస్కారం పరమ విశిష్ట సేవా మేడల్
ఇండియన్ ఆర్మీ
ఇండియన్ ఆర్మీకి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ నేతృత్వం వహిస్తారు. ప్రస్తుతం భారత ఆర్మీలో 12,37,117 క్రియాశీల బలగాలు, 9,60,00 రిజర్వు బలగాలు సేవలందిస్తున్నాయి. ఇండియన్ ఆర్మీలో అత్యున్నత ర్యాంక్ఫీల్డ్ మార్షల్. ఇప్పటి వరకు ఐదు నక్షత్రాలు కలిగిన ఈ అత్యున్నత ర్యాంకును పొందిన వారు శ్యామ్ మానెక్ షా(1973), కె.ఎం.కరియప్ప (పదవీ విరమణ అనంతరం 1986లో). ఇండియన్ ఆర్మీలోని ఫీల్డ్ మార్షల్‌కు నౌకాదళం, వైమానిక దళంలో సమాన ర్యాంకులు అడ్మిరల్ ఆఫ్ ద ప్లీట్(ఇండియన్ నేవీ), మార్షల్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఇండియన్ ఎయిర్ ఫోర్స్). ఇండియన్ ఎయిర్ ఫోర్సులో అత్యున్నత ర్యాంకు మార్షల్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ పొందిన మొదటి అధికారి జనరల్ అర్జున్ సింగ్. కాగా, ఇండియన్ నేవీలో అడ్మిరల్ ఆఫ్ ద ప్లీట్ ర్యాంకు ఇప్పటి వరకు ఎవరికీ ఇవ్వలేదు.
సైనిక కార్యకలాపాలు
- మొదటి భారత్, పాకిస్తాన్ యుద్ధం(1947–48), ఆపరేషన్ పోలో(1948), ఇండో–చైనా వార్(1962), రెండో భారత్–పాకిస్తాన్ యుద్ధం(1965), ఇండియా–పాకిస్తాన్ వార్(1971), శ్రీలంక పౌర యుద్ధం(1983), కార్గిల్ యుద్ధం(1999).
- ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యక్రమాల్లో భాగంగా సైప్రస్, లెబనాన్, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, అంగోల, కంబోడియా, వియత్నాం, నమీబియా, ఎల్ సాల్వడార్, లైబీరియా, మొజాంబిక్, సోమాలియా దేశాల్లో తన సేవలను అందిస్తూ ఉన్నది.
- 1950, జూన్‌లో ఉభయ కొరియాల మధ్య యుద్ధం సందర్భంగా గాయపడిన, అనారోగ్యం పాలైన సైనికుల సహాయం కోసం పారామెడికల్ విభాగాన్ని అక్కడికి పంపించారు.
భారత సైన్యానికి వైమానిక సేవలను అందించడానికి 1986, నవంబర్ 1న ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్ ఏర్పాటైంది. సైనికుల తరలింపు, అవసరమైన సామగ్రి తరలింపు ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్ బాధ్యత. ఇందుకోసం భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ఎంఐ 25, ఎంఐ 35 అటాక్ హెలికాప్టర్లతోపాటు చేతక్, చీతా, ధ్రువ్ హెలికాప్టర్ల సేవలను ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్ వినియోగించుకుంటుంది.