
జాతీయ స్థాయిలో 3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలు, ప్రణాళికలను ఖరారు చేసేందుకు ‘ది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ది నేషనల్ సిలబస్ అండ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కమిటీ (NSTC) పేరుతో 19 మంది సభ్యులను నియమించింది. దీనికి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌ఐఈపీఏ) ఛాన్సలర్ మహేశ్ చంద్ర పంత్ నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ సుధామూర్తి, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ బిబేక్ దేబ్‌రాయ్, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్, ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంత కర్త చాము కృష్ణశాస్త్రి, సంగీత దర్శకులు శంకర్ మహదేవన్...వంటి ప్రముఖులకు ఎన్‌సీఈఆర్‌టీ స్థానం కల్పించింది.
పాఠశాల సిలబస్‌ని రూపొందించడంతోపాటు, 3 నుంచి 12వ తరగతి విద్యార్థులకు స్టడీమెటీరియల్‌ను అభివృద్ధి చేసే అధికారం ఎన్‌ఎస్‌టీసీకి ఉంటుంది. ఎన్‌ఎస్‌టీసీ అభివృద్ధి చేసిన పాఠ్యపుస్తకాలు, పాఠ్యప్రణాళికలను ఎన్‌సీఈఆర్‌టీ ప్రచురించి పంపిణీ చేస్తుంది. జాతీయ విద్యా విధానం-2020కి అనుగుణంగా పాఠశాలల్లో పాఠ్యాంశాల సవరణకు సంబంధించిన వివరాలను ది నేషనల్ కర్కిలమ్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ (NCF-SE).. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌కు జులై 28న పంపించింది. ఈ క్రమంలోనే ఎన్‌సీఈఆర్‌టీ ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.