వరదల ముప్పును తప్పించుకునేందుకు ఐదు దేశాల్లో సూపర్ ప్లాన్​లు

వరదల ముప్పును తప్పించుకునేందుకు ఐదు దేశాల్లో సూపర్ ప్లాన్​లు

సెంట్రల్ డెస్క్​, వెలుగు : పోయిన ఏడాది సడెన్​గా కురిసిన కుండపోత వర్షాలతో పాకిస్తాన్, నైజీరియా, ఆస్ట్రేలియా సహా అనేక దేశాల్లో వరదలు పోటెత్తి బీభత్సం సృష్టించాయి. క్లైమేట్ చేంజ్ వల్ల ఏ దేశంలో ఎప్పుడు వరదలు ముంచెత్తుతాయో.. ఎప్పుడు కరువు ఏర్పడుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. నదులు, సముద్రాల తీరాల్లో, లోతట్టు ప్రాంతాల్లో, సముద్రంలోని దీవుల్లో ఉన్న నగరాలకు వరదల ముప్పు ఇంకా ఎక్కువే ఉంటోంది.

అందుకే.. సడెన్​గా ఎంత పెద్ద వాన పడినా వరదలతో ముప్పు వాటిల్లకుండా ఉండేలా పలు దేశాలు తమ సిటీల్లో మార్పులు చేపడుతున్నాయి. ‘‘వరదలను ఆపేందుకు అడ్డుకట్టలు వేయడం కాదు.. వరద నీళ్లు సాఫీగా వెళ్లేలా ప్రకృతితో కలిసి పని చేయాలి” అనే కాన్సెప్ట్​తో ఐదు దేశాల్లోని నగరాల్లో చేపట్టిన వినూత్న ప్రాజెక్టులు ప్రస్తుతం పర్యావరణవేత్తల ప్రశంసలు పొందుతున్నాయి.

బీజింగ్.. స్పాంజ్ సిటీస్ 

చైనాలో రాజధాని బీజింగ్ సహా అనేక నగరాలను ఒక్కోసారి వరదలు ముంచెత్తితే.. ఒక్కోసారి తీవ్ర కరువు పీడిస్తుంటుంది. అందుకే.. అటు వరదలను నివారించడంతోపాటు ఇటు కరువుకూ చెక్ పెట్టేలా స్పాంజ్ సిటీస్ కాన్సెప్ట్​ను తెచ్చారు టురెన్ స్కేప్ సంస్థ వ్యవస్థాపకుడు, ఆర్కిటెక్ట్ ప్రొఫెసర్ కోంగ్జియాన్ యూ. 2012లో బీజింగ్ వరదల ధాటికి చాలా మంది చనిపోయారు. సిటీకి భారీ నష్టం జరిగింది. ఆ తర్వాత కోంగ్జియాన్ కాన్సెప్ట్​కు ఓకే చెప్పిన చైనా సర్కారు 2015లో 16 స్పాంజ్ సిటీస్ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది.

ఆయా సిటీల్లో కాంక్రీట్​తో కట్టిన డ్రైనేజీ కాలువలపై మొక్కలు పెంచి పార్కుల మాదిరిగా మార్చారు. అక్కడక్కడా పిల్లలు ఆడుకునేందుకు ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేశారు. వాన నీటిని ఇంకేలా చేయడంతో పాటు వరద నీటిని నిలుపుకొంటూ ఒక స్పాంజ్ రివర్​లా మారేలా వీటిని డిజైన్ చేశారు.

కోపెన్ హెగెన్.. క్లైమేట్ పార్క్ 

డెన్మార్క్ రాజధాని కోపెన్ హెగెన్​లో 2011లో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. ఒక్కసారిగా నీళ్లను కుండలతో  కుమ్మరించినట్లు భారీ వర్షం పడటంతో సిటీలోని చాలా ప్రాంతాలు మీటరు లోతు నీళ్లలో మునిగిపోయాయి. సిటీకి దాదాపు 100 కోట్ల డాలర్ల నష్టం జరిగింది. మున్ముందు ఇలాంటి విపత్తులు వచ్చినా ఎదుర్కొనేలా భారీ క్లైమేట్ పార్క్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో భాగంగా కోపెన్ హెగెన్​లోని 1928 నాటి 35 వేల చదరపు మీటర్ల పార్క్​ను రీడిజైన్ చేసే పనిని థర్డ్ నేచర్ అనే సంస్థ మొదలుపెట్టింది. రీడిజైన్​లో భాగంగా పార్కులో 3 మీ టర్ల దిగువన కాంక్రీట్​తో హాకీ కోర్టును నిర్మించారు.

పార్క్ దిగువన వరద నీళ్లను నిల్వ చేసుకునేలా చాంబర్లను ఏర్పాటు చేశారు. వరదలు వచ్చినప్పుడు పార్క్​లోని హాకీ కోర్టు, చాంబర్లు సహా మొత్తం పార్క్ అంతా 60 లక్షల గ్యాలన్ల నీటిని నిల్వ చేసి, ఆ తర్వాత నెమ్మదిగా కాలువల్లోకి వదిలేలా డిజైన్ చేశారు.

బ్యాంకాక్.. మంకీ చీక్ పార్క్​లు

థాయిలాండ్​ రాజధాని బ్యాంకాక్.. చావో ఫ్రయా నదీ  తీరంలో ఉంది. దీంతో సిటీని తరచూ వరదలు ముంచెత్తుతూ ఉంటాయి. 2011లో సిటీలో వరదల కారణంగా వందలాది మంది మృత్యువాతపడ్డారు. రోజురోజుకూ నగరం సైజ్ పెరుగుతుండటంతో వరదల ముప్పూ పెరుగుతోంది. ఈ ముప్పును తగ్గించేందుకు మంకీ చీక్ పార్క్​ల కాన్సెప్ట్​ను రూపొందించారు కొచకోర్న్ వొరాఖోమ్ అనే ఆర్కిటెక్ట్. కోతులు తమకు ఫుడ్ దొరికినప్పుడు గబగబా నోట్లో పెట్టుకుని, కొంత ఫుడ్​ను దవడల కింద దాచుకుంటాయట.

ఆ ఫుడ్​ను తర్వాత తీరిగ్గా తింటాయట. సరిగ్గా ఇలాగే.. వరదలు వచ్చినప్పుడు నీళ్లను గబగబా దాచుకుని.. నెమ్మదిగా కాలువల ద్వారా సిటీ బయటకు పంపేలా మంకీ చీక్ పార్క్ కాన్సెప్ట్​ను ఆమె రూపొందించారు. ఇందుకోసం సిటీలోని లోతట్టు ప్రాంతంలో 11 ఎకరాల్లో మంకీ చీక్ పార్క్​ను నిర్మించారు. పార్క్  కింద 1.60 లక్షల గ్యాలన్ల నీటిని నిల్వ చేసేలా, మొత్తం పార్క్​లో 10 లక్షల గ్యాలన్ల వరద నీరు పట్టేలా డిజైన్ చేశారు.

ఆమ్​స్టర్​డామ్​.. నీటిపై పడవల్లా ఇండ్లు 

నెదర్లాండ్స్​లో మూడొంతుల భూభాగం సముద్రమట్టం కంటే తక్కువ ఎత్తులోనే ఉంటుంది. సముద్రమట్టం ఏ కొంచెం పెరిగినా ఈ దేశా నికి ముప్పు తీవ్రంగా ఉంటుంది. అందుకే.. సముద్రమట్టం పెరిగినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు దేశ రాజధాని ఆమ్​స్టర్​డామ్​ సహా పలు సిటీల్లో పడవల్లా నీటిపై తేలుతూ ఉండే ఫ్లోటింగ్ హోమ్స్ కాన్సెప్ట్ ను అమలుచేశారు. రోటర్ డామ్ సిటీలో 2019లోనే ప్రపంచంలోనే ఫస్ట్ ఫ్లోటింగ్ డైరీని నిర్మించారు.

ఇండ్లను మాత్రమేకాదు.. పార్కులను, ఆఫీస్​లను కూడా నీటిపైనే చెక్కలతో నిర్మించారు. ఇండ్లపై సోలార్ ప్యానెల్స్, రూఫ్ గార్డెన్​లు కూడా ఏర్పాటు చేశారు. సముద్రమట్టం, అలలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటే.. అందుకు అనుగుణంగా ఇండ్లు కూడా పైకి, కిందకు కదిలేలా నిర్మించారు. ఒక ఇంటి నుంచి మరో ఇంటికి, సిటీలోకి వెళ్లేందుకు రోడ్ల వరకూ ఫ్లెక్సిబుల్​గా ఉండే జెట్టీలను ఏర్పాటుచేశారు.

మాలి.. ఫ్లోటింగ్ హోమ్స్ తో సిటీ

హిందూ మహాసముద్రంలో వెయ్యి ద్వీపాలతో విస్తరించిన ఉన్న దేశం మాల్దీవులు. సముద్రమట్టానికి ఒక మీటర్ ఎత్తులో మాత్రమే ఉన్న ఈ దేశానికి కూడా మునిగిపోయే ముప్పు పొంచి ఉంది. అందుకే.. ఏకంగా ఒక కొత్త ఫ్లోటింగ్ సిటీనే నిర్మించేందుకు ప్రభుత్వం ప్లాన్ వేసింది. ముందుగా తీరం వద్ద ఇండ్లను నిర్మించి, వాటిని సముద్రంలోకి తరలించి.. చుట్టూ పగడపు దిబ్బల మధ్య ఉన్న ఈ ప్రాంతంలోకి చేర్చాలన్నది ప్లాన్.

సముద్రమట్టం పెరిగినా ఇండ్లకు ఇబ్బంది లేకుండా టెలిస్కోపిక్ స్టిల్ట్స్ (ప్రత్యేక స్తంభాలను) ఈ ఇండ్ల కింది నుంచి సముద్రం అడుగుకు అమర్చనున్నారు. చుట్టూ పగడపు దిబ్బలు ఉంటాయి కాబట్టి అలల కారణంగా ఇండ్లు కొట్టుకుపోయే అవకాశం ఉండదు. అలాగే సముద్రంలోని కోరల్ ఎకోసిస్టంకు ఇబ్బంది లేకుండా ఎండ సముద్రం అడుగు వరకూ పడేలా ఇండ్లను డిజైన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు 2028 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు.