వార్సా (పోలెండ్): వరల్డ్ చాంపియన్ డి. గుకేశ్.. సూపర్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ టోర్నీలో మరో విజయాన్ని నమోదు చేశాడు. శుక్రవారం ముగిసిన ర్యాపిడ్ ఫైనల్ రౌండ్ గేమ్‌లో గుకేశ్ 49 ఎత్తుల వద్ద ఫ్యాబియానో కరువాన (అమెరికా)పై నెగ్గాడు. దాంతో ఈ రౌండ్ ముగిసేసరికి గుకేశ్ 9 పాయింట్లతో కరువానా, జాన్ డుడాతో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు.
కరువానతో జరిగిన గేమ్‌లో గుకేశ్ ఆరంభంలో కాస్త ఇబ్బందిపడినా సకాలంలో తేరుకున్నాడు. ఆరంభంలోనే అద్భుతమైన ఎత్తులు వేసిన కరువానాను మిడిల్ గేమ్‌లో గుకేశ్ నియంత్రించాడు. ఈ క్రమంలో 38వ ఎత్తు వద్ద కరువానా చేసిన చిన్న తప్పిదాన్ని గుకేశ్ అనుకూలంగా మార్చుకున్నాడు. ఒక బిషప్‌ను కోల్పోయి ప్రత్యర్థి ఏనుగును సొంతం చేసుకున్నాడు. వైల్డ్ కార్డు ఎంట్రీ హన్స్ మోక్ నీమన్ (13) టాప్ ప్లేస్‌ను సొంతం చేసుకున్నాడు.
