మద్దతు ధర లేక పత్తిని ఇండ్లల్లోనే దాచుకుంటున్న రైతులు

మద్దతు ధర లేక పత్తిని ఇండ్లల్లోనే దాచుకుంటున్న రైతులు
  • మద్దతు ధర లేక ఇండ్లు,  పొలాల వద్ద నిల్వ చేసుకుంటున్న రైతులు 
  • గతేడాది మద్దతు ధర రూ.12 వేలు..  ఈసారి రూ.6,300
  • జిల్లాలో 3.25 లక్షల టన్నుల దిగుబడి
  • సగం కూడా చేరని అమ్మకాలు 
  • ధర తగ్గుదలపై పరేషాన్ లో రైతులు

సంగారెడ్డి/రాయికోడ్, వెలుగు:  మద్దతు ధర లేక రైతులు పత్తిని ఇండ్లల్లోనే దాచుకుంటున్నారు. ఇండ్లు, వ్యవసాయ పొలాల వద్ద పత్తి నిల్వలు ఉంచి రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి ఎక్కువగా పండే నారాయణఖేడ్, జహీరాబాద్, ఆందోల్​నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 3.25 లక్షల టన్నుల దిగుబడి రాగా ఇప్పటికీ సగం కూడా అమ్మలేదు. గతేడాది పత్తికి అత్యధికంగా క్వింటాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.12 వేలు ధర పలికింది. ఈసారి ప్రభుత్వం రూ.6,300 ప్రకటించింది. మార్కెట్​లో ధర లేక పంట నిల్వలు పెరిగిపోతుండగా..  ఆర్థిక సమస్యలతో కొందరు రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు వ్యవసాయ పొలాల వద్దనే పంటను నిల్వ ఉంచి మద్దతు ధర కోసం ఎదురుచూస్తున్నారు. బహిరంగ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్వింటాకు రూ.8,200 పలుకుతోంది. ధర లేక పత్తిని అమ్మడానికి రైతులు ఆసక్తి చూపకపోవడంతో జిన్నింగ్ మిల్లులు వెలవెలబోతున్నాయి.

జిల్లాలో దిగుబడి ఇలా...

జిల్లాలో ఈసారి వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1.83 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేయగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు సుమారు 60 వేల ఎకరాల పంట దెబ్బతిన్నది. ఈ క్రమంలో 3.25 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి చేతికి వచ్చింది. ఇందుకు తగ్గట్టు కొనుగోళ్ల కోసం జిల్లా మార్కెటింగ్ శాఖ జిన్నింగ్ మిల్లులను రెడీ చేసింది. కాగా 19 మిల్లులో డిసెంబర్ నుంచే కొనుగోలు స్టార్ట్ చేసినప్పటికీ ధర లేక రైతులు పత్తి అమ్మేందుకు ఆసక్తి చూపడం లేదు.  అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటికీ 1,55,135 క్వింటాళ్లు మాత్రమే అమ్మారు. 

మద్దతు ధర లేకనే పత్తి కొనుగోళ్లు తగ్గినట్టు మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే గతేడాది రూ.12 వేలు ఉండగా, ఈసారి ఏకంగా రూ.6,300లకు పడిపోవడం రైతులు జీర్ణించుకోలేక పోతున్నారు. గతంతో పోలిస్తే ఈసారి కనీసం ధర రూ.15 వేలు దాటుతుందని రైతులు ఆశించారు. కానీ అంచనాలు తారుమారై ధర ఏకంగా సగానికి పడిపోవడంతో ఆందోళనలో ఉన్నారు.  మరోవైపు నిల్వచేసిన పత్తి తేమ ఆరిపోయి బరువు తగ్గే అవకాశం ఉందని రైతులు టెన్షన్​ పడుతున్నారు.  చాలాకాలం నిల్వ ఉంటే పత్తి క్వాలిటీ కూడా తగ్గే అవకాశముందని మార్కెటింగ్​శాఖ అధికారులు చెబుతున్నారు. 

వచ్చే ఏడాది దిగుబడిపై ప్రభావం?

పత్తి ధర తగ్గడంతో భవిష్యత్తులో పంట దిగుబడిపై ప్రభావం చూపనుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. రెండేండ్ల కింద ఇప్పటిలాగే ధర తగ్గగా... ఆ ఏడు యాసంగిలో ఒక్కసారిగా దాదాపు లక్ష మెట్రిక్​టన్నుల దిగుబడి తగ్గిపోయింది. అనంతరం వ్యవసాయ అధికారులు గ్రామాల్లో తిరిగి రైతులను చైతన్యం చేయడంతో మళ్లీ రైతులు పత్తి సాగుచేశారు. కానీ మద్దతు ధర విషయంలో అదే పరిస్థితి ఎదురవడంతో రైతుల నుంచి నిరాశ చెందుతున్నారు. 

170 క్వింటాళ్లు అమ్మకుండా నిల్వ చేసిన..

నాకున్న 15 ఎకరాల్లో పత్తి పంట ఏశాను. 170 క్వింటళ్ల పత్తి దిగుబడి వచ్చింది. మద్దతు ధర కోసం ఎదురుచూస్తూ పంటను నిల్వచేసిన. పోయిన ఏడాదికంటే ఈసారి చాలా తక్కువ ధర ఇస్తున్నారు. అప్పటి రేటు చూసి ఈసారి పంట ఎక్కువగా వేస్తే దిగుబడి బాగానే వచ్చింది. కానీ ధర మాత్రం తగ్గింది. ఈ రేటుకు ఇస్తే పెట్టిన పెట్టుబడి కూడా రాదు. దళారులకు అమ్ముకోలేక..నిల్వ చేసిన పంటను కాపాడుకోలేక ఇబ్బంది పడుతున్నాం. మద్దతు ధర పెంచి కొనుగోలు స్టార్ట్ చేస్తే బాగుంటది.

-ఒగ్గు శ్రీనివాస్ యాదవ్, రైతు జంబ్గి( కే ), రాయికోడ్.