కృష్ణా నదీ జలాలపై కేంద్రం, తెలంగాణకు నోటీసులు

కృష్ణా నదీ జలాలపై కేంద్రం, తెలంగాణకు నోటీసులు

న్యూఢిల్లీ, వెలుగు: కృష్ణా నదీ జలాల వినియోగం కేసులో  కేంద్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులిచ్చింది. కేఆర్ఎంబీకి, టీఎస్ జెన్​కోకు కూడా 2వారాల్లో సమాధానమివ్వాలంటూ నోటీసులిచ్చింది. ఏపీ, తెలంగాణ మధ్య ఒప్పందాన్ని తెలంగాణ సర్కార్ ఉల్లంఘిస్తోందని ఏపీ సర్కార్ గతేడాది సుప్రీం కోర్టును ఆశ్రయించింది. విద్యుత్ ఉత్పత్తికి శ్రీశైలం రిజర్వాయర్​ నుంచి కృష్ణా వాటర్ వాడుకునేలా తెలంగాణ ఇచ్చిన జీవోతో ఏపీకి నష్టం జరుగుతోందని పేర్కొంది. ఈ పిటిషన్​ను జస్టిస్ అజయ్ రస్తోగి బెంచ్ సోమవారం విచారించింది. పర్మిషన్ లేకుండా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తికి శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయడంతో ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించినట్లు ఏపీ తరఫు అడ్వకేట్ జయదీప్ గుప్తా బెంచ్​కు వివరించారు.

దీని తర్వాత కేంద్రం... ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నదీ జలాలు, ప్రాజెక్ట్ నిర్వహణపై రెండు బోర్డులను ఏర్పాటు చేసిందని తెలిపారు. బోర్డు ఏర్పాటు తర్వాత ఏపీ సర్కార్ రిజర్వాయర్ అంశాలను వాటికి అప్పగించినట్లు తెలిపారు. తెలంగాణ మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించిందన్నారు. ఎందుకు రెస్పాన్స్ కాలేదని తెలంగాణ సర్కారును కోర్టు ప్రశ్నించగా.. ప్రభుత్వం తరఫు అడ్వకేట్ వైద్యనాథన్ స్పందిస్తూ.. కేంద్ర జల శక్తి మంత్రి చైర్మన్​గా ఉన్న అపెక్స్ కౌన్సిల్​కు తమ అభ్యంతరాలు చెప్పామన్నారు.